ఏకగ్రీవంలో ఆదర్శం.. | - | Sakshi
Sakshi News home page

ఏకగ్రీవంలో ఆదర్శం..

Dec 3 2025 8:07 AM | Updated on Dec 3 2025 8:07 AM

ఏకగ్రీవంలో ఆదర్శం..

ఏకగ్రీవంలో ఆదర్శం..

గత ఏడు దఫాలుగా పోటీ లేని గ్రామం

35 సంవత్సరాలుగా ముందంజలో

గ్రామ పంచాయతీ

పాతలింగాల

సర్పంచ్‌ అభ్యర్థి సుజాత, వార్డు సభ్యులను అభినందిస్తున్న గోపాల్‌రెడ్డి

కామేపల్లి: కామేపల్లి మండలంలోని మాజీ మంత్రి, దివంగత రాంరెడ్డి వెంకటరెడ్డి స్వగ్రామమైన పాతలింగాల గ్రామపంచాయతీ ఏకగ్రీవంలో ఆదర్శంగా నిలుస్తోంది. ఈ గ్రామంలో 788 మంది ఓటర్లు ఉండగా 407 మహిళలు, 381 పురుషులు ఉన్నారు. వీరంతా ఏకతాటిపై నిలుస్తూ పాలకవర్గం ఏకగ్రీవంతో జరిగే ప్రయోజనాలను గుర్తించి ముందు కు సాగుతున్నారు. ఫలితంగా 35ఏళ్లుగా గ్రామంలో పోటీ లేకుండానే సర్పంచ్‌ సహా పాలకవర్గాన్ని ఎన్నుకుంటుండడం విశేషం.

స్నేహపూర్వక సంబంధాలు

గ్రామపంచాయతీ ఎన్నికల ప్రక్రియ మొ దలుకాగానే గ్రామస్తులంతా సమావేశమవుతారు. గత పాలకవర్గాల హయాంలో జరి గిన అభివృద్ధిపై చర్చించడంతో పాటు భవిష్యత్‌ పనులపై సమీక్ష నిర్వహించుకుంటారు. ఆతర్వాత పాలకవర్గం ఏకగ్రీవంపై దృష్టి సారి స్తారు. పోటీ చేయడం ద్వారా ఎన్నికల నిర్వహణ, ప్రచారం తాలూకా ఖర్చులతో ఎదురయ్యే ఇబ్బందులను సమీక్షించుకుంటారు. అంతేకాక పోటీ ద్వారా గ్రామస్తుల నడుమ స్నేహపూర్వక సంబంధాలు దెబ్బతింటాయనే భావనతో గ్రామస్తులు కలిసికట్టుగా సర్పంచ్‌, వార్డు మెంబర్లను ఏకగ్రీవంగా ఎంపిక చేసుకుంటారు. తద్వారా 35ఏళ్లుగా పాతలింగాలలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగకుండా పాలకవర్గాలను ఏకగ్రీవం చేసుకున్నారు. ప్రసుత్తం కామేపల్లి మండలంలో రెండో విడతగా గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనుండగా నామినేషన్ల స్వీకరణ మంగళవారంతో ముగిసింది. కాగా, పాతలింగాల గ్రామపంచాయతీ ఈసారి ఎస్టీ మహిళా రిజర్వ్‌ కాగా గ్రామానికి చెందిన కిన్నెర సుజాత మాత్రమే ఏకాభిప్రాయంతో సర్పంచ్‌ స్థానానికి నామినేషన్‌ దాఖలు చేశారు. అంతేకాక ఎనిమిది వార్డులకు కూడా సింగిల్‌ నామినేషనే దాఖలవడంతో గత ఆనవాయితీని కొనసాగించినట్లయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement