మద్యం మత్తులో ఆత్మహత్య
దుమ్ముగూడెం: మండలంలోని పైడిగూడెం గ్రామానికి చెందిన కట్టం రామయ్య (50) మద్యంమత్తులో పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మద్యానికి బానిసైన ఆయన రెండు రోజులుగా భోజనం చేయలేదు. సోమవారం ఉదయం ఆయన భార్య కట్టం నాగమ్మ పొలం పనికి వెళ్లొచ్చే సరికి రామయ్య అపస్మారకస్థితిలో ఉన్నాడు. పురుగులమందు వాసన రావడంతో ఆయన్ను బండిరేవు వైద్యశాలకు, అక్కడి నుంచి భద్రాచలం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. రామయ్య మద్యంమత్తులో పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్టు ప్రాథమికంగా గుర్తించి, కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ గణేశ్ తెలిపారు.
ఉరి వేసుకుని వ్యక్తి..
కొత్తగూడెంటౌన్: భార్య పుట్టింటికి వెళ్లి తిరిగి రావడం లేదని మనస్తాపానికి గురైన వ్యక్తి.. ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. రామవరం లక్ష్మీటాకీస్ ఏరియాకు చెందిన కడలి దుర్గాప్రసాద్ (34) ప్రైవేట్ ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. భార్య ఆరు నెలల క్రితం పుట్టింటికి వెళ్లింది. అప్పటి నుంచి మనస్తాపానికి గురైన దుర్గాప్రసాద్.. మంగళవారం ఇంట్లో ఎవరూ లేనిసమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి ఇద్దరు పిల్లలున్నారు. తండ్రి ఏడుకొండలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
లారీ ఢీకొని వ్యక్తి మృతి
ఖమ్మంరూరల్: ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మంగళవారం మండలంలోని గుర్రాలపాడు గ్రామ శివారులో చోటుచేసుకుంది. ఖమ్మం పంపింగ్‌వెల్‌రోడ్‌కు చెందిన కూరపాటి వెంకటేశ్వర్లు (60) బట్టల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. వెంకటగిరి ఏరియాలో మంగళవారం బట్టలు విక్రయించి ద్విచక్రవాహనంపై ఇంటికి వస్తుండగా గుర్రాలపాడు సమీపాన ఖమ్మం – కోదాడ ప్రధాన రహదారిపై వెనుక నుంచి వచ్చిన లారీ బలంగా ఢీకొట్టింది. తీవ్ర గాయాల పాలైన వెంకటేశ్వర్లు అక్కడికక్కడే మృతిచెందాడు. ఆయన భార్య జయమ్మ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ ముష్క రాజు తెలిపారు.


