నేత్రపర్వంగా రామయ్య కల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామ చంద్ర స్వామివారి నిత్యకల్యాణ వేడుక ఆదివారం నేత్రపర్వంగా సాగింది. స్వామివారికి సువర్ణ పుష్పార్చన, అభిషేకం జరిపారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి స్వామి వారిని పల్లకీసేవగా చిత్రకూట మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. కాగా, హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో హరిహర ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన భద్రాద్రి రామయ్య కల్యాణ వేడుకలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కల్యాణాన్ని తిలకించారు.
పెద్దమ్మతల్లికి విశేషపూజలు
పాల్వంచరూరల్: పెద్దమ్మతల్లికి అర్చకులు విశేషపూజలు నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ(పెద్దమ్మతల్లి) ఆలయానికి ఆదివారం జిల్లా నలు మూలలతోపాటు పొరుగు రాష్ట్రాల నుంచీ భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. క్యూలైన్ ద్వారా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. అర్చకులు విశేషపూజలు జరిపారు. భక్తులు అన్నప్రాసనలు, ఒడిబియ్యం, పసుపు కుంకుమలు, చీరలు సమర్పించి మొక్కులు చెల్లించారు. ఈఓ రజనీకుమారి, ఆలయ కమిటీ చైర్మన్ నాగేశ్వరరావు, వేదపండితుడు పద్మనాభశర్మ, అర్చకుడు రవికుమార్‌శర్మ పాల్గొన్నారు.
సింగరేణిలో రాత పరీక్ష
రుద్రంపూర్: సింగరేణి సంస్థలో ఖాళీగా ఉన్న 10 జూనియర్ శానిటరీ ఇన్‌స్పెక్టర్ పోస్టులకు ఆదివారం సింగరేణి మహిళా డిగ్రీ కళాశాలలో నిర్వహించిన రాతపరీక్ష ప్రశాంతంగా ముగి సింది. 27 మంది మాత్రమే హాజరయ్యారు. జూనియర్ సెక్యూరిటీ ఇన్‌స్పెక్టర్ పోస్టులు 12 ఉండగా, పరీక్షకు 14 మంది హాజరయ్యారు. పరీక్షలను సింగరేణి విజిలెన్స్, రిక్రూట్‌మెంట్ సెల్ అధికారులు పర్యవేక్షించారు.
భగవద్గీత పోటీల్లో బహుమతులు
కొత్తగూడెంఅర్బన్: రాష్ట్ర స్థాయి భగవద్గీత కంఠస్థ పోటీలు ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించారు. జిల్లా నుంచి పలువురు హాజరుకాగా నలుగురికి బహుమతులు దక్కాయి. ఈ మేరకు జిల్లా కార్యాలయ ప్రముఖ్ గోపిరెడ్డి భాస్కర్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. బహుమతులు గెలుపొందిన వారిలో భద్రాచలానికి చెందిన ఊర్విక, పాల్వంచకు చెందిన శరణ్యప్రియ, త్రిపాఠి, కొత్తగూడేనికి గుణనిధి ఉన్నారు. విజేతలను విశ్వహిందూ పరిషత్ నాయకులు అభినందించారు.
మద్దికొండ
పంచాయతీ ఏకగ్రీవం
అశ్వారావుపేటరూరల్: మండలంలోని మద్దికొండ గ్రామ పంచాయతీ ఎన్నిక ఏకగ్రీవమైంది. గ్రామస్తులు, రాజకీయ పార్టీల నాయకులు చర్చించుకుని ఏకగ్రీవంవైపు మొగ్గు చూపారు. కాంగ్రెస్ మద్దతు తెలిపిన, గ్రామానికి చెందిన తాటి రామకృష్ణను సర్పంచ్‌గా, పంచాయతీలోని ఎనిమిది వార్డులను కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని నిర్ణయించుకున్నారు. బీఆర్‌ఎస్ మద్దతుతో వార్డు సభ్యుడిగా బరిలో దిగిన నెర్సు శ్రీనును ఉప సర్పంచ్‌గా ఎన్నుకోవాలని ఒప్పందం చేసుకున్నారు. రామకృష్ణ, శ్రీను ఆదివారం జమ్మిగూడెం కేంద్రంలో నామినేషన్లు దాఖలు చేశారు. అయితే నామినేషన్ల అనంతరం ఎన్నికల అధికారులు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
నేత్రపర్వంగా రామయ్య కల్యాణం
నేత్రపర్వంగా రామయ్య కల్యాణం


