పోటెత్తిన నామినేషన్లు
రెండో విడతలో మొదటిరోజు నామమాత్రమే..
● తొలివిడతలో 159 సర్పంచ్ స్థానాలకు 813 సెట్లు దాఖలు.. ● 1,436 వార్డు స్థానాల్లో 3,485..
చుంచుపల్లి: జిల్లాలో తొలివిడత ఎన్నికలు జరిగే 159 గ్రామపంచాయతీలు, 1,436 వార్డులకు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. గత నెల 27 నుంచి 29 వరకు తొలిదశ నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ చేపట్టారు. చివరి రోజైన శనివారం భారీ ఎత్తున నామినేషన్లు దాఖలు చేశారు. అర్ధరాత్రి వరకు ప్రక్రియ కొనసాగింది. తొలి విడతలో సర్పంచ్, వార్డులకు కలిపి 4,298 నామినేషన్లు వచ్చాయి. ఇందులో 159 సర్పంచ్ స్థానాలకు 813 నామినేషన్లు రాగా, 1,436 వార్డులకు 3,485 నామినేషన్లు వేశారు. చివరి రోజు సర్పంచ్ స్థానాలకు 614 నామినేషన్లు దాఖలయ్యాయి. వార్డులకు సైతం 3,020 నామినేషన్లు సమర్పించారు. అశ్వాపురం మండలంలో సర్పంచ్ స్థానాలకు 132, వార్డులకు 533, భద్రాచలంలో సర్పంచ్ స్థానానికి 11, వార్డు స్థానాలకు 98, బూర్గంపాడు మండలంలో సర్పంచ్ స్థానాలకు 114, వార్డు స్థానాలకు 483, చర్ల మండలంలో సర్పంచ్ స్థానాలకు 134, వార్డు స్థానాలకు 485, దుమ్ముగూడెం మండలంలో సర్పంచ్ స్థానాలకు 153, వార్డు స్థానాలకు 648, కరకగూడెంలో సర్పంచ్ స్థానాలకు 67, వార్డులకు 278, మణుగూరు మండలంలో సర్పంచ్ స్థానాలకు 83, వార్డులకు 431, పినపాక మండలంలో సర్పంచ్ స్థానాలకు 119, వార్డులకు 529 చొప్పున నామినేషన్లు సమర్పించారు. ఇందులో భద్రాచలం సర్పంచ్ స్థానానికి అత్యల్పంగా 11 నామినేషన్లు రాగా, దుమ్ముగూడెం మండలంలో సర్పంచ్ స్థానాలకు అధికంగా 153 నామినేషన్లు దాఖలయ్యాయి. వార్డు స్థానాలకు దుమ్ముగూడెంలో అత్యధికంగా 648 నామినేషన్లు రాగా, అత్యల్పంగా భద్రాచలంలో 98 నామినేషన్లు వేశారు. కొన్ని స్థానాల్లో సర్పంచ్, వార్డు స్థానాలకు ఒక్క నామినేషన్ మాత్రమే దాఖలు కావడంతో అక్కడ ఏకగ్రీవం అనివార్యంగా మారింది. వీటిని ఈ నెల 3న అధికారికంగా ప్రకటించనున్నారు.
రెండో విడత ఎన్నికలు జరిగే గ్రామ పంచాయతీ స్థానాలకు ఆదివారం నుంచి అధికా రులు 49 కేంద్రాల ద్వారా నామినేషన్లు స్వీకరిస్తున్నారు. 155 గ్రామపంచాయతీలు, 1384 వార్డులకు ఎన్నికలు జరగనుండగా, తొలిరోజు నామమాత్రంగానే నామినేషన్లు దాఖలయ్యాయి. సర్పంచ్ స్థానాలకు 25, వార్డులకు 47 నామినేషన్లు సమర్పించారు. అన్నపురెడ్డిపల్లి మండలంలో సర్పంచ్ స్థానాలకు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. వార్డులకు మాత్రం రెండు నామినేషన్లు వచ్చాయి. అశ్వారావుపేట మండలంలో సర్పంచ్ స్థానాలకు 8, వార్డు స్థానాలకు 11, చండ్రుగొండ మండలంలో సర్పంచ్ స్థానాలకు 4, వార్డులకు 15, చుంచుపల్లి మండలంలో సర్పంచ్ స్థానాలకు ఒకటి, వార్డు స్థానాలకు 8, దమ్మపేట మండలంలో సర్పంచ్ స్థానాలకు 9, వార్డులకు 7, ములకలపల్లి మండలంలో సర్పంచ్ స్థానాలకు 2, వార్డు స్థానాలకు 3 నామినేషన్లు దాఖలు కాగా, పాల్వంచ మండలంలో సర్పంచ్ స్థానానికి ఒకటి, వార్డు స్థానానికి మరొకటి చొప్పున నామినేషన్లను సమర్పించారు. చుంచుపల్లి మండలంలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను ఎన్నికల వ్యయ పరిశీలకురాలు లావణ్య, జిల్లా పరిషత్ సీఈఓ నాగలక్ష్మి పర్యవేక్షించారు.


