సమగ్ర ఏర్పాట్లు చేయాలి
● ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయండి ● రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
కొత్తగూడెంఅర్బన్: కొత్తగూడెంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీని మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారని, ఇందుకోసం సమగ్ర ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర వ్యవసాయ, సహకార మార్కెటింగ్, చేనేత శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం ఆయన శిలాఫలకం ఏర్పాట్లను, యూనివర్సిటీ ప్రాంగణంలో పనుల పురోగతిని పరిశీలించారు. సభాస్థలిని సందర్శించి, అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం ఆడిటోరియంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శాఖల వారీగా చేపడుతున్న పనుల పురోగతి, భద్రతా చర్యలు, ఏర్పాట్లను కలెక్టర్ జితేష్ వి.పాటిల్, ఎస్పీ రోహిత్ రాజు వివరించారు. ఆ తర్వాత మంత్రి మాట్లాడుతూ సీఎం పర్యటన విజయవంతం చేయాలని, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. పాల్వంచలో కొత్త విద్యుత్ ప్లాంట్, రూ.420 కోట్లతో కొత్తగూడెం బైపాస్ రహదారి నిర్మిస్తామన్నారు. సీతారామ ప్రాజెక్ట్ డిస్టిబ్య్రూటర్ కాల్వల నిర్మాణానికి అవసరమైన రూ.3,400 కోట్ల నిధులకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారని అన్నారు. పినపాక, మారెళ్లపాడు, తుమ్మలచెరువు , సింగభూపాలెం, అశ్వారావుపేట, అన్నదైవంపాడు, మూకమామిడి అభివృద్ధి ప్రాజెక్ట్‌లను అభివృద్ధి చేస్తామన్నారు. కొత్తగూడెం–ఇల్లెందు–హైదరాబాద్ రహదారి నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని, భద్రాచలం–మణుగూరు–ఏటూరునాగారం–చౌటాల రహదారి నిర్మాణానికి అటవీ శాఖ అనుమతులు మంజూరు చేసిందని వివరించారు. ఖమ్మం–భద్రాద్రి జిల్లాల అభివృద్ధికి రింగురోడ్లను కూడా ఆమోదించినట్లు చెప్పారు. కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ కొత్తగూడెంలో సింగరేణి, పాల్వంచలో జెన్‌కో సహకారంతో కొత్తగా బస్టాండ్‌లు నిర్మిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పినపాక, అశ్వారావుపేట ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, జారె ఆదినారాయణ, అదనపు కలెక్టర్లు డి.వేణుగోపాల్, విద్యాచందన, కొత్తగూడెం ఆర్డీవో మధు, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.


