ఎర్త్ సైన్సెస్ ముస్తాబు..
ఏర్పాట్లపై దృష్టి
ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న కలెక్టర్ జితేష్, ఎస్పీ రోహిత్
కొత్తగూడెంఅర్బన్: డాక్టర్ మన్మోహన్‌సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ పనులు చకచకా జరుగుతున్నాయి. ప్రారంభోత్సవానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రానున్న నేపథ్యంలో కలెక్టర్ జితేష్ వి.పాటిల్, ఎస్పీ రోహిత్‌రాజు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. గత జూలైలో రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్, హ్యయర్ ఎడ్యుకేషన్ అధికారులు వర్సిటీని సందర్శించి కావాల్సిన సదుపాయాలపై ప్రభుత్వానికి నివేదించారు. అదే నెలలో సీఎం యూనివర్సిటీని ప్రారంభిస్తారని అధికారులు పేర్కొన్నా.. ప్రోగ్రాం వాయిదా పడింది. ఇటీవల సీఎం పర్యటన ఖరారుకాగా, ఈ నెల 2న ప్రారంభోత్సవం జరగనుంది.
పాత భవనాలకు మరమ్మతులు
యూనివర్సిటీలో ప్రస్తుతం బీఎస్సీ జియోలాజిలో 14 మంది, ఎన్విరాన్‌మెంట్ సైన్స్‌లో 34 మంది, పీజీ ఎన్విరాన్‌మెంట్ సైన్స్‌లో 14, మొత్తం 62 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరికి 8 మంది అధ్యాపకులను నియమించారు. అయితే తరగతులు, హాస్టల్ వసతికి పాత భవనాలనే వినియోగిస్తున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో శిలాఫలకం ఏర్పాటు, భవనాలకు రంగులు వేయడం, మరమ్మతులు, ఆడిటోరియం పనులు, 120 విద్యార్థినులు, 80 మంది విద్యార్థులకు సరిపడే విధంగా వేర్వేరు హాస్టల్ భవనాలకు మరమ్మతులు చేపడుతున్నారు. వీటితోపాటు రోడ్డు నిర్మాణ, విద్యుత్, వాటర్ సప్లై తదితర పనులు కూడా నిర్వహిస్తున్నారు.
సీఎం పర్యటన నేపథ్యంలో కలెక్టర్ జితేష్ వి.పాటిల్ పలుమార్లు ఇంజనీరింగ్, రోడ్లు–భవనాలు, విద్యుత్, పోలీస్ శాఖ, మున్సిపల్ అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. భద్రతా చర్యలు, నిర్వహణపై పలు సూచనలు చేశారు. అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. విశ్వవిద్యాలయం సుందరీకరణలో భాగంగా మొక్కలు నాటడం, ప్రాంగణ పరిశుభ్రత, తాగునీటి సౌకర్యాలు, శానిటేషన్ ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. భద్రతా ఏర్పాట్లను ఎస్పీ రోహిత్‌రాజు పర్యవేక్షిస్తున్నారు.
రేపు ప్రారంభించనున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి


