నేటి నుంచి కొత్త వైన్స్
● జిల్లాలో 88 మద్యం షాపులు, 13 బార్లు ఏర్పాటు ● పేట మున్సిపాలిటీలో నిబంధనలు సడలింపు
అశ్వారావుపేటరూరల్: జిల్లాలో సోమవారం నుంచి కొత్త మద్యం షాపులు ప్రారంభంకానున్నాయి. వ్యాపారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేసుకున్నారు. ప్రభుత్వం నూతన మద్యం పాలసీని అమలు చేయనుంది. జిల్లాలో మొత్తం 88 మద్యం దుకాణాలు ఉండగా, గత అక్టోబర్ 27న లక్కీ డ్రా నిర్వహించారు. చాలాచోట్ల పాత షాప్‌ల్లోనే కొత్త వ్యాపారులు కూడా దుకాణాలు ఏర్పాటు చేసుకుని, డిపోల నుంచి మద్యం స్టాక్ తెప్పించుకున్నారు. ఇక పాత వ్యాపారులు ఆదివారం రాత్రి వరకు అమ్మకాలు చేపట్టాక మిగిలిన స్టాక్‌ను తీసుకెళ్లారు.
అశ్వారావుపేటలో నిబంధనల్లో మార్పు
కొత్తగా ఏర్పాటైన అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వ, ఎకై ్సజ్ నిబంధనల్లో కొద్ది మార్పులు జరిగాయి. గతంలో అశ్వారావుపేటకు మేజర్ పంచాయతీ హోదా ఉండగా, పట్టణంలోని ఖమ్మం, జంగారెడ్డిగూడెం మార్గాలు జాతీయ రహదారి పరిధిలో ఉండటంతో నిబంధనల ప్రకారం ఆయా మార్గాల్లో మద్యం దుకాణాలు ఏర్పాటు కాలేదు. దీంతో అశ్వారావుపేటలో ఉన్న దుకాణాలన్నీ భద్రాచలం మార్గంలోనే ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ఈ ఏడాది జనవరిలో అశ్వారావుపేటకు మున్సిపాలిటీ హోదా దక్కింది. ఈ నేపథ్యంలో మున్సిపాలిటీ పరిధిలో జాతీయ రహదారి నిబంధనలు వర్తించని కారణంగా తాజాగా దుకాణాలు దక్కించుకున్న వ్యాపారులు పట్టణంలోని జంగారెడ్డిగూడెం, ఖమ్మం మార్గాల్లో షాపులు ఏర్పాటు చేస్తున్నారు.
షాపులు దక్కినవారితో బేరసారాలు!
పలువురు వ్యాపారులు సిండికేట్‌గా మారి పదుల సంఖ్యలో దరఖాస్తులు దాఖలు చేసినా, ఓ సిండికేట్‌కు ఒకే షాపు, మరో సిండికేట్‌గా మూడు షాపులు మాత్రమే దక్కాయి. దీంతోవారు షాపులు దక్కినవారితో బేరసారాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రా వ్యాపారులు సైతం ఉమ్మడి జిల్లా వ్యాపారులతో చేతులు కలిపి వ్యాపారంలోకి దిగుతున్నట్లు సమాచారం.
ఆదిలోనే ధమాకా..
దుకాణాలు ప్రారంభించిన తొలినెలలో విక్రయాలు జోరుగా సాగే అవకాశం ఉందని మద్యం వ్యాపారులు భావిస్తున్నారు. ఈనెలలో గ్రామపంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. జీపీ ఎన్నికల ఫలితాల ఆధారంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ.. ఆపై మున్సిపాలిటీ ఎన్నికలు కూడా జరిగే అవకాశం ఉంది. దీంతో వ్యాపారానికి ఢోకా ఉండదనే భావనలో వ్యాపారులు ఉన్నారు.
ఎక్సైజ్ శాఖ నిబంధనల ప్రకారమే మద్యం దుకాణాలు ఏర్పాటు చేయాలి. సర్కిల్ పరిధిలోని అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లో 11 దుకాణాలకు లైసెన్సులు జారీ చేశాం. అన్ని చోట్ల దుకాణాలు సోమవారం నుంచి ప్రారంభం అవుతాయి. ఎలాంటి అడ్డంకులు లేవు.
–సాంబమూర్తి, ఎకై ్సజ్ సీఐ, అశ్వారావుపేట


