
కవిత్వంతో సామాజిక చైతన్యం
కొత్తగూడెంఅర్బన్: కవులు తమ కవిత్వంతో సామాజిక సమస్యలపై ప్రజల్లో చైతన్యం రగిలిస్తారని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ పేర్కొన్నారు. ఆదివారం కొత్తగూడెం క్లబ్‌లో ప్రజా సంఘాల వేదిక ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వ అవార్డు గ్రహీత, ప్రముఖ ప్రజా, ప్రకృతి కవి జయరాజును ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమాజాన్ని చైతన్యం వైపు నడిపించేందుకు కవులు, రచయితలు ఎంతో మానసిక సంఘర్షణ ఎదుర్కొంటారని, అలాంటి వారిని గుర్తించి సత్కరించడం శుభపరిణామం అన్నారు. ప్రజా సంఘాల వేదిక కన్వీనర్ జే.బీ.శౌరీ మాట్లాడుతూ జయరాజ్ సామాజిక ఉద్యమాల యోధుడని పేర్కొన్నారు. వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ మాట్లాడుతూ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసిన అంబేద్కర్ వాదులు, సామాజిక ఉద్యమకారులు, ప్రకృతి ప్రేమికులను అభినందించారు. కాగా జయరాజుతో పాటు వివిధ రంగాల్లో విశేష సేవలందించిన మరో 14 మందిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో సన్మాన గ్రహీతలు తాళ్లూరి వెంకటేశ్వరరావు, కోచ్ మాస్టర్ షమీ ఉద్దీన్, ఎస్.కె.బాసిత్, కాల్వ దేవదాస్, మొక్కల వెంకటయ్య, వేల్పుల భాస్కర్, ప్రకృతి వైద్యులు సుగుణారావు, కోచైర్మన్ కూసపాటి శ్రీను, బిక్కసాని నాగేశ్వరరావు, ఎర్రా కామేష్, మారపాక రమేష్ కుమార్, శనగ వెంకటేశ్వర్లు, కోచర్ల కమలారాణి పాల్గొన్నారు.
కలెక్టర్ జితేష్ వి.పాటిల్