పెరుగుతున్న స్వరం | - | Sakshi
Sakshi News home page

పెరుగుతున్న స్వరం

Jul 7 2025 6:23 AM | Updated on Jul 7 2025 6:23 AM

పెరుగ

పెరుగుతున్న స్వరం

పుష్కరాల తరుణంలో

భద్రాచలం: గోదావరి పుష్కరాలకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. పన్నెండేళ్లకోసారి జరిగే ఈ క్రతువులో లక్షల కొద్దీ భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తారు. వారందరికీ తగిన సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం తాత్కాలిక వసతులు, శాశ్వత నిర్మాణాలు, మరుగుదొడ్లు, అన్నదానసత్రాలు వంటివి నిర్మించాలి. కానీ భద్రాచలంలో ఇప్పటికే భూ సమస్య వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో పుష్కరాల అభివృద్ధి పనులకు భూమెక్కడ అనే ప్రశ్న తలెత్తోంది. ఏపీలో కలిపిన ఐదు పంచాయతీలను తెలంగాణలో తిరిగి విలీనం చేస్తే 2027 జూలైలో జరిగే పుష్కరాలకు భూ సమస్య తీరుతుందని భక్తులు అభిప్రాయపడుతున్నారు.

వసతులు పరిమితం.. అద్దెలు అధికం

శ్రీ సీతారామచంద్రస్వామివారి దర్శనం కోసం భద్రాచలం వచ్చే భక్తుల రద్దీ రోజురోజుకూ పెరుగుతోంది. దేవస్థానం కాటేజీలు, వసతి గదులు మాత్రం స్వల్ప స్థాయిలో ఉన్నాయి. దీంతో ప్రైవేట్‌ లాడ్జీల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. వారాంతపు సెలవు దినాల్లో రూ. వేలల్లో అద్దె వసూలు చేస్తున్నారు. పది వేల మంది భక్తులు వస్తేనే ఇలాంటి ఇబ్బందులు తలెత్తితే పుష్కరాల సమయంలో రోజుకు లక్షకు పైగా భక్తులు వస్తారు. దీంతో వసతి సమస్య జఠిలంగా మారనుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తుగా శాశ్వత, తాత్కాలిక వసతి నిర్మాణాలను చేపట్టాల్సి ఉంది. ఇప్పటికే కాళేశ్వరం వంటి పుణ్యక్షేత్రంలో పుష్కరాల పనులకు భూ సర్వే చేస్తున్నారు.

ఐదు పంచాయతీలను కలిపితే భూమి అందుబాటులోకి..

ప్రస్తుతం భద్రాచలానికి మూడు వైపులా కిలోమీటరు పరిధి మించి విస్తీర్ణం లేదు. కానీ ఏపీలో కలిసిన గుండాల, పిచుకలపాడు, కన్నాయిగూడెం, ఎటపాక, పురుషోత్తపట్నం గ్రామాలు ఇప్పటికీ భద్రాచలంలో అంతర్భాగంగానే ఉన్నాయి. రాష్ట్రాలు వేరయినా దైనందిక కార్యక్రమాలు, పనులు భద్రాచలంతోనే ముడిపడి ఉన్నాయి. ఆ ఐదు పంచాయతీలను తెలంగాణలో కలిపితే భద్రాచలానికి భూమి అందుబాటులోకి వస్తుంది. పురుషోత్తపట్నంలో స్వామి వారికి సుమారు 900 ఎకరాల భూమి ఉంది. దీంతో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టవచ్చు. చర్ల రోడ్డులో ఉన్న ఎటపాక, కూనవరం రోడ్డులో ఉన్న గుండాల పంచాయతీల్లో అటు వైపు నుంచి వచ్చే ట్రాఫిక్‌ను నియంత్రించవచ్చు. పుష్కరాల నేపథ్యంలో పంచాయతీల విలీన డిమాండ్‌పై స్వరం మరింత పెరుగుతోంది.

ఐదు పంచాయతీలను

తెలంగాణలో కలపాలి

మా అభిప్రాయం తెలుసుకోకుండా ఏపీలో విలీనం చేసి అన్యాయం చేశారు. దీని వల్ల ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. పార్టీలన్నీ ఏకమై కేంద్రం దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించాలి. రానున్న పుష్కరాల సమయంలో అందరి దృష్టీ భద్రాచలం వైపే ఉంటుంది. పంచాయతీలకు ఇదే సరైన తరుణంగా భావించి ఎంపీలు చొరవ చూపాలి.

– బండారు వీరభద్రం, కన్నాయిగూడెం,

విలీన గ్రామపంచాయతీ వాసి

మంత్రులు, ఎమ్మెల్యే,

ఎంపీలు చొరవ చూపాలి

మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు చొరవ తీసుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగ సవరణ ద్వారానే విలీనం పూర్తయ్యే అవకాశం ఉండటంతో పార్లమెంట్‌ సభ్యుల పాత్రే కీలకం. ఎన్నికల ముందు ఎంపీ బలరాంనాయక్‌ సైతం ఇదే హామీ ఇచ్చారు. పార్టీలకు అతీతంగా ఇతర ఎంపీల సహాయ సహకారాలతో పార్లమెంట్‌లో ఈ సమస్యను లేవనెత్తాలని బలరాంనాయక్‌ను భక్తులు కోరుతున్నారు. నిజామాబాద్‌లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను ఇటీవల కలిసిన రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇదే విషయమై విన్నవించారు. పుష్కరాల తరుణంలోనైనా విలీన పంచాయతీలు, భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని పలువురు కోరుతున్నారు.

ఏపీ విలీన పంచాయతీలను

తిరిగి తెలంగాణలో కలపాలని డిమాండ్‌

వసతి, సౌకర్యాలకు భూ సమస్య కూడా తీరే అవకాశం

భద్రాచలంలో భక్తుల రద్దీకి తగినట్లు ఏర్పాట్లకు స్థలం

మంత్రులు, ఎమ్మెల్యే, ఎంపీలు గళమెత్తాలని విన్నపాలు

పెరుగుతున్న స్వరం1
1/2

పెరుగుతున్న స్వరం

పెరుగుతున్న స్వరం2
2/2

పెరుగుతున్న స్వరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement