
క్రీడా పాఠశాలలతో ఉజ్వల భవిష్యత్..
● స్పోర్ట్స్ స్కూళ్లలో చేరేందుకు బాలబాలికల ఆసక్తి ● చిన్నారులను ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులు ● గత ఏడేళ్లలో రాష్ట్రస్థాయి పోటీలకు 106 మంది ఎంపిక ● ఏటా జూన్‌లో మండల, జిల్లాస్థాయి పోటీల నిర్వహణ
కొత్తగూడెంటౌన్: ‘మాకు క్రికెట్ అంటే ఇష్టం.. ధోనిలా ఆడతాం. పీటీ ఉషలా పరుగెడతాం. గోపీ చంద్, సైనా నెహ్వాల్‌లా బ్యాడ్మింటన్ ఆడతాం.’ అంటూ చిన్నారులు క్రీడపట్ల ఆసక్తి చూపుతున్నా రు. నచ్చిన క్రీడలను ఎంచుకుని రాణించేందుకు ఉత్సాహం చూపుతున్నారు. కొందరు క్రీడా పాఠశాలల్లో చేరి రాష్ట్ర, జాతీయస్థాయిలో రాణించేందుకు శ్రమ పడుతున్నారు. స్పోర్ట్స్ కోటాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు కూడా వస్తుండటంతో తల్లి దండ్రులు కూడా ప్రోత్సహిస్తున్నారు. క్రీడా పాఠశాలల్లో చేరిన విద్యార్థులకు ప్రభుత్వం ఫ్రీ హాస్టల్ వసతి కల్పిస్తోంది. చదువుతోపాటు క్రీడల్లో శిక్షణనిస్తోంది. వివిధ క్రీడా పోటీలకు రాష్ట్రం తరఫున విద్యార్థులను పంపిస్తోంది. ఈ నేపథ్యంలో చిన్నారులు క్రీడా పాఠశాలలో చేరేందుకు ఆసక్తి చూపుతుండగా, తల్లిదండ్రులు తోడ్పాటునందిస్తున్నారు.
ఏటా జూన్‌లో ఎంపికలు
ప్రతి ఏడాది క్రీడా పాఠశాలలో ప్రవేశాలకు జూన్‌లో ఎంపికలు నిర్వహిస్తారు. మూడో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులకు నాలుగో తరగతిలో అడ్మిషన కల్పిస్తారు. గత నెల 26న కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో ఎంపికలు నిర్వహించారు. జిల్లా యు వజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో మండల, జిల్లా స్థాయిలో ఎంపికలు నిర్వహించి రాష్ట్రస్థాయి పోటీలకు పంపిస్తారు. రాష్ట్రస్థాయి పోటీల్లో ఎంపికై న విద్యార్థులను రాష్ట్రంలోని మూడు స్పోర్ట్స్ పాఠశాలల్లో ప్రవేశం కల్పిస్తారు. హైదరాబాద్‌లోని హకీంపేట, కరీంనగర్, ఆదిలాబాద్‌లలో ప్రభుత్వ క్రీడా పాఠశాలలు ఉన్నాయి. వీటిల్లో 4వ తరగతిలో చేర్చితే, 12వ తరగతి వరకు విద్యాభ్యాసంతో ఫ్రీ హాస్టల్ వసతి కల్పిస్తారు. క్రీడల్లో శిక్షణనిస్తూ వివిధపోటీలకు విద్యార్థులు హాజరయ్యలా చూస్తారు.
ఈసారి రాష్ట్రస్థాయి పోటీలకు 20 మంది..
గత జూన్‌లో జిల్లాలోని కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో క్రీడా పాఠశాలల్లో ఎంపికలు నిర్వహించారు. 170 మంది చిన్నారులు పోటీ పడగా 20 మంది బాలబాలికలు ఎంపికయ్యారు. వారిని రాష్ట్రస్థాయి పోటీలకు పంపనున్నారు. ఏ చిన్నారిని పలకరించినా జాతీయస్థాయిలో రాణిస్తామని, పతకాలు సాధిస్తామని చెబుతున్నారు. గత ఏడేళ్లలో జిల్లా నుంచి సుమారు 106 మందికి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. 2018 ఏడాదిలో 20 మంది, 2019లో ఆరుగురు, 2020లో పది మంది, 2022 సంవత్సరంలో 20, 2023 ఏడాదిలో 17 మంది, 2024లో 13 మంది, 2025 ఏడాదిలో 18 మంది ఎంపికై నట్లు జిల్లా యువజన క్రీడలశాఖ అధికారి ఎం.పరంధామరెడ్డి తెలిపారు.