
తెర ఒక్కటే.. సినిమాలు రెండు
ఒకప్పుడు థియేటర్‌లో ఒకే సినిమా నాలుగు ఆటలు
● మల్టీప్లెక్స్‌ల రాకతో మారిన ప్రదర్శన విధానం ● సింగిల్ స్క్రీన్లలోనూ సింగిల్ సినిమాలకు తగ్గిన క్రేజ్ ● ట్రెండ్‌కు తగ్గట్టు ప్రతీ పూట వేర్వేరు చిత్రాల ప్రదర్శన
కొత్తగూడెం నగరంలోని ఓ థియేటర్
మరింత సౌకర్యవంతంగా మల్టీప్లెక్స్‌లు..
ఇళ్లలోకి టీవీలు వచ్చాక థియేటర్ల కథ ముగుస్తుందనే ప్రచారం జరిగింది. థియేటర్ ఎక్స్‌పీరియన్స్ పేరుతో డాల్బీ డిజిటల్, డిజిటల్ ట్రాక్ సౌండ్ (డీటీఎస్), డాల్బీ ఆట్మోస్ పేరుతో సౌండ్ క్వాలిటీ, కుషన్, కపుల్ చైర్స్ వంటి సౌకర్యాలతో ఏసీ హాళ్లు వచ్చాయి. దీంతో ఎంటర్‌టైన్‌మెంట్‌లో థియేటర్లు మరింత అగ్రస్థానానికి చేరుకున్నాయి. ఇదే క్రమంలో మరింత సౌకర్యవంతంగా మల్టీప్లెక్స్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఒకే ప్రాంగణంలో రెండుకు మించి స్క్రీన్లు, మూడుకు పైగా సినిమాలు ప్రదర్శించడం మొదలైంది. టాయిలెట్స్ మొదలు స్క్రీన్ వరకు అన్నింటా బెస్ట్ సర్వీస్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తూ సినిమాకు సరికొత్త కేరాఫ్ అడ్రెస్‌గా మల్టీప్లెక్స్‌లు నిలిచాయి.
ఓటీటీల రాకతో..
కరోనా సమయంలో విధించిన లాక్‌డౌన్ సినిమా థియేటర్ల పాలిట మృత్యుపాశంగా మారింది. ఓ వైపు మల్టీప్లెక్స్ హవా పెరుగుతుంటే మరోవైపు ఓవర్ ది టాప్ (ఓటీటీ) యాప్‌లు ఇబ్బడిముబ్బడిగా అందుబాటులోకి వచ్చాయి. రీజినల్, ఇంటర్నేషనల్ కంటెంట్ లోకల్ లాంగ్వేజ్‌లో అందుబాటులోకి వచ్చింది. దీంతో వినోద రంగంలో థియేటర్లకు గట్టి ప్రత్యామ్నాయం అందుబాటులోకి వచ్చినట్లయింది. ప్రేక్షకుడిని ఇంటి నుంచి థియేటర్‌కు రప్పించాలంటే స్టార్ పవర్ లేదంటే మంచి కంటెంట్ ఉండక తప్పని పరిస్థితి ఎదురైంది.
థియేటర్ల మూసివేత
గతంతో పోల్చితే స్టార్‌డమ్ ఉన్న నటుల నుంచి వచ్చే సినిమాల తగ్గిపోవడం, ఓటీటీలో మంచి కంటెంట్ వస్తుండటంతో థియేటర్‌కు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతోంది. ఫలితంగా థియేటర్లు మూసేయాల్సిన పరిస్థితి ఎదురైంది. శుక్రవారం సినిమా విడుదలైతే సోమవారం నుంచి ప్రేక్షకుల సంఖ్య తక్కువగా ఉండటంతో షోలు క్యాన్సిల్ చేయడం రివాజుగా మారింది. కొన్ని థియేటర్లయితే క్రేజ్ ఉన్న సినిమా విడుదలైనప్పుడు తెరవడం, ఆ తర్వాత మూత వేయడం చేస్తున్నారు. తెలంగాణలో సినిమా ప్రదర్శనలకు గుండెకాయలా ఉన్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో థియేటర్లు మూతపడిపోవడం మొదలైంది. ఒకప్పుడు ఖమ్మంలో పదకొండు థియేటర్లు ఉంటే ఇప్పుడు కేవలం ఐదే మిగిలాయి. కొత్తగూడెంలో ఏడుకు బదులు నాలుగు, పాల్వంచలో నాలిగింటా రెండు, ఇల్లెందులో మూడు, మణుగూరు, భద్రాచలంలలో మూడింటా రెండు థియేటర్లే నడుస్తున్నాయి. ఇక మండల కేంద్రాల్లోని థియేటర్లు ఎప్పుడో మూతపడ్డాయి.
ఒకే రోజు రెండు, మూడు సినిమాలు..
మారిన పరిస్థితులకు తగ్గట్టుగా సింగిల్ స్క్రీన్ థియేటర్లు తమ పంథాను మార్చుకోక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒకప్పుడు సింగిల్ స్క్రీన్‌లలో నాలుగు షోలలో ఒకే సినిమా నడిపించడగా ఇప్పుడు ఒకే రోజు రెండు, మూడు సినిమాలు నడిపించే పద్ధతిని అమల్లోకి తెస్తున్నారు. సినిమాలో ఉండే కంటెంట్, వచ్చే ప్రేక్షకులను బట్టి షోలు ఏర్పాటు చేస్తున్నారు. శనివారం ఖమ్మం వినోద థియేటర్‌లో హాలీవుడ్ చిత్రం జురాసిక్‌పార్క్ తెలుగు డబ్బింగ్ వెర్షన్ మార్నింగ్, మ్యాట్నీ షోలు ఉండగా ఫస్ట్ షో, సెకండ్ షోలలో ఇంగ్లిష్ వెర్షన్ ప్రదర్శించారు. ఇదే సినిమా కొత్తగూడెం ఏషియన్ మహేశ్వరి, భద్రాచలం విజయ్‌భాస్కర్‌లలో మ్యాట్నీ, సెకండ్‌షోలు ఉండగా మిగిలిన షోలలో కన్నప్ప, కుబేరా సినిమాలు ఆడిస్తున్నారు. ఈ ట్రెండ్ ఆర్నెళ్ల క్రితమే మొదలైనా పాపులారిటీ ఉన్న సినిమాలు ఇలా ఆడకపోవడంతో ఈ అంశం వెలుగులోకి రాలేదు. కానీ ఇప్పుడు ఒకేసారి వేర్వేరు సినిమాలు ప్రేక్షకుల ఆదరణ చూరగొనడంతో ఒకే థియేటర్‌లో వేర్వేరు షోలకు వేర్వేరు సినిమాలు ప్రదర్శించే అవకాశం చిక్కింది. ట్రెండ్‌కు తగ్గట్టు సింగిల్ స్క్రీన్‌లే మల్టీప్లెక్స్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చేందుకు సిద్ధమయ్యాయి.

తెర ఒక్కటే.. సినిమాలు రెండు

తెర ఒక్కటే.. సినిమాలు రెండు