
తొలి పండగకు సిద్ధం..
● హిందువులకు మొదటి పండుగగా పేరు ● ముస్తాబైన వైష్ణవ ఆలయాలు ● ఉపవాసాలు, దానధర్మాలతో మోక్షం
నేడు తొలి ఏకాదశి
కొత్తగూడెంటౌన్: హిందువులకు ఎంతో విశిష్టమైన పండగలో మొదటి పండుగ తొలి ఏకాదశి. ఆషాఢమాసంలో వచ్చే ఈ పండగను దేవశయన ఏకాదశి లేదా పేలాల పండగ అని కూడా పిలుస్తారు. ఆషాఢశుద్ధ ఏకదశి తిథి సందర్భంగా నేడు(ఆదివారం) పండుగను జరుపుకుంటారని అర్చకులు, వేదపండితులు చెబుతున్నారు. ఏడాది కాలంలో వచ్చే 24 ఏకాదశుల్లో ఇది మొదటిది కాగా తలెగు పండుగలన్నీ దీంతోనే ప్రారంభమవుతాయి. శ్రీమహావిష్ణువు క్షీరసాగరంలో యోగనిద్రలోకి వెళ్లి నాలుగు నెలల పాటు విశ్రాంతి తీసుకుంటారని చెబుతారు. ఇక సూర్యుడు దక్షిణం వైపుకు మరలిన తరుణాన ఈ రోజు నుంచి దక్షిణయానం ప్రారంభమవుతుందని, ఈ సందర్భంగా గోపద్మవ్రతాన్ని కార్తీకమాస శుక్లపక్షం వరకు జరుపుకుంటారు. ఇందుకోసం శ్రీవైష్టవి ఆలయాలను నిర్వాహకులు ముస్తాబుచేయడంతో పాటు స్వామి, అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి భక్తుల దర్శనం కోసం ఏర్పాట్లు చేశారు.
విశిష్ట పూజలు.
ఏకాదశి రోజున కొందరు చతుర్మాస వ్రతాలు ప్రారంభిస్తారు. సూర్యోదయానికి ముందే శ్రీహరిని పూజించి, విష్ణువు ప్రతిమను పసుపు, కుంకుమ, పూలతో అలంకరించి చక్కెర పొంగళి నైవేధ్యంగా పెడతారు. అంతేకాక కర్పూర హారతులిచ్చి భక్తులు ఉపవాసంతో వైష్ణవ ఆలయాలను సందర్శించి పూజలు చేస్తారు. గోపూజ చేయడం మంచిదని, పితృ దేవతలకు ప్రీతికరమైన పేలాల పిండిని తినాలని పెద్దలు, అర్చకులు చెబుతున్నారు. ఉపవాసం ఉండి దానధర్మాలు చేస్తేమోక్షం సిద్ధిస్తుందని పేర్కొంటున్నారు.
తొలి ఏకాదశితో పండగలు మొదలు..
గ్రీష్మ రుతువు ముగిసి, వర్ష రుతువు ప్రారంభమైన సందర్భంగా పండగను జరుపుకోవడం ఆనవాయితీ. తొలి ఏకాదశికి హైందవ సంస్కృతిలో ప్రత్యేక స్థానం ఉంది. ఇది శ్రీమహావిష్ణువు, లక్ష్మీదేవిలకు ఇష్టమైన పండుగ కావడంతో అందరూ నేడు పూజలు చేస్తే పాపాలు తొలగిపోతాయని, పుణ్యఫలం లభిస్తుందని భక్తుల నమ్మకం.
మొదటి పండగ..
తొలి ఏకాదశి శ్రీమహావిష్ణువు, లక్ష్మీదేవిలకు ఇష్టమైన పండుగ కావడంతో ఈ రోజు పూజలు చేస్తే పాపాలు తొలగిపోతాయి. పుణ్యఫలం లభిస్తుంది. ఉపవాసం ఉండి దానధర్మాలు చేస్తే మోక్షం సిద్ధిస్తుంది.
– శ్రీధరాచార్యులు,
రామవరం శివాలయం అర్చకుడు

తొలి పండగకు సిద్ధం..