
వర్షం.. రైతుల హర్షం
● రెండు రోజుల్లో లోటు నుంచి అధిక వర్షపాతం నమోదు ● పత్తి 1,90,831 ఎకరాల్లో సాగు, మొక్కజొన్న 54,223 ఎకరాల్లో.. ● జిల్లాలో సాధారణం కంటే 14 శాతం అధిక వర్షపాతం
వర్షపాతం ఇలా.. (మి.మీ లలో)
మండలం బుధ జూన్ 1 నుండి
వారం జూలై 2 వరకు
కరకగూడెం 25.2 112.4
పినపాక 26.4 114.8
చర్ల 31.2 211.8
దుమ్ముగూడెం 36.6 145.6
అశ్వాపురం 55.6 211.8
మణుగూరు 34.6 151.6
ఆళ్లపల్లి 36.8 163.8
గుండాల 28.0 122.8
ఇల్లెందు 52.6 157.2
టేకులపల్లి 56.2 214.8
జూలూరుపాడు 49.2 367.2
చండ్రుగొండ 38.0 284.2
అన్నపురెడ్డిపల్లి 36.4 236.8
చుంచుపల్లి 59.2 171.0
సుజాతనగర్ 65.4 214.2
కొత్తగూడెం 49.0 176.8
లక్ష్మీదేవిపల్లి 35.4 142.4
పాల్వంచ 86.2 286.8
బూర్గంపాడు 81.6 293.2
భద్రాచలం 64.6 206.2
ములకలపల్లి 52.2 179.2
దమ్మపేట 23.0 227.0
అశ్వారావుపేట 13.6 337.2
జిల్లా సరాసరి 45.1 205.6
సూపర్‌బజార్(కొత్తగూడెం): రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో రైతన్నల్లో హర్షం వ్యక్తమవుతోంది. జూన్ మాసంలో లోటు వర్షపాతం నమోదైంది. రెండు రోజుల నుంచి వానలు దంచి కొడుతుండటంతో వ్యవసాయ పనులను వేగవంతం చేశారు. ఈ సీజన్ ప్రారంభంలో రుతుపవనాలు ముందుగానే ఊరించాయి. ఆ తర్వాత ముఖం చాటేశాయి. దీంతో నాటిన పత్తి విత్తనాలు మొలకెత్తక రైతులు నష్టపోయారు. ఆ తర్వాత వర్షాలు కొంతమేర కురిసినా గత నెలలో లోటు వర్షపాతమే నమోదైంది. మంగళ, బుధవారాల్లో కురిసిన వర్షాలకు లోటు పూడిపోయింది. గత నెల 1 నుంచి ఈ నెల 2వ తేదీ వరకు జిల్లాలో సాధారణ వర్షపాతం 180 మి.మీ కాగా 205.6 మి.మీ వర్షపాతం నమోదైంది. అంటే సాధారణం కంటే 14 శాతం అధికంగా వర్షాలు కురిశాయి. తొమ్మిది మండలాలు అశ్వారావుపేట, దమ్మపేట, అన్నపురెడ్డిపల్లి, చండ్రుగొండ, టేకులపల్లి, జూలూరుపాడు సుజాతనగర్, బూర్గంపాడు, పాల్వంచలలో అధిక వర్షపాతం నమోదైంది. మరో తొమ్మిది మండలాలు ములకలపల్లి, చర్ల, అశ్వాపురం, ఆళ్లపల్లి, ఇల్లెందు, చుంచుపల్లి, కొత్తగూడెం, లక్ష్మీదేవిపల్లి, భద్రాచలం మండలాల్లో సాధారణ వర్షపాతం, మిగిలిన ఐదు మండలాలు పినపాక, కరకగూడెం, దుమ్ముగూడెం, మణుగూరు, గుండాలలో లోటు వర్షపాతం నమోదైంది.
పంటల సాగు ఇలా..
జిల్లాలో ప్రధాన వాణిజ్య పంట పత్తిని వర్షాధారంగా సాగు చేస్తారు. రుతుపవనాలు ఊరించడంతో విత్తనాలు నాటిన సుమారు 30 శాతం మంది రైతులు మొక్కలు మొలవక నష్టపోయారు. ఆ తర్వాత అడపాదడపా వర్షాలతో పత్తి సాగు ఊపందుకుంది. సాగునీటి సౌకర్యం ఉన్న రైతులు వరినార్లు పోశారు. జీలుగు, జనుము సాగు చేసిన రైతులు పచ్చిరొట్టను కలియదున్నేందుకు సిద్ధమవుతున్నారు. ఇక కొందరు రైతులు వెదజల్లే పద్ధతిలో వరి సాగు ప్రారంభించారు. అక్కడక్కడా నాట్లు కూడా వేస్తున్నారు. ఇప్పటివరకు వెదజల్లే పద్ధతిలో 2,124 ఎకరాల్లో వరి సాగు చేపట్టారు. పత్తి 1,90,831 ఎకరాల్లో మొక్కజొన్న 54,223 ఎకరాల్లో సాగు చేశారు.
ముమ్మరంగా వ్యవసాయ పనులు
వర్షాలు కురుస్తుండటంతో జిల్లాలో వ్యవసాయ పనులు ముమ్మరమయ్యాయి. ఎక్కువ మంది రైతులు పత్తి సాగు చేస్తున్నారు. వ్యవసాయాధికారుల సలహాలను పాటించి సాగు చేయాలి.
–వి.బాబూరావు, జిల్లా వ్యవసాయాధికారి
పనులు వేగవంతం చేశాం
ఇప్పటివరకు వర్షాలు భయపెట్టినా ఇప్పుడు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. సాగుకు అనుకూలం. అందుకే వ్యవసాయ పనులు వేగవంతం చేశాం.
–మల్లయ్య, రైతు, గరీబ్‌పేట, సుజాతనగర్ మండలం

వర్షం.. రైతుల హర్షం

వర్షం.. రైతుల హర్షం