
డీసీసీబీ ఉద్యోగుల వేతన సవరణ
● 26–29 శాతం మేర పెరిగే అవకాశం
ఖమ్మంవ్యవసాయం: జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ) ఉద్యోగుల వేతన సవరణపై ఒప్పందం కుదిరింది. ఈ అంశంపై ఉద్యోగులు మూడేళ్లుగా ఎదురుచూస్తుండగా ఎట్టకేలకు నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మార్నేని రవీందర్‌రావు ఆధ్వర్యాన హైదరాబాద్‌లోని టీజీకాబ్ కార్యాలయంలో డీసీసీబీ ఉద్యోగ యూనియన్ల ప్రతినిధులతో మంగళవారం సమావేశమయ్యారు. ఈసందర్భంగా ఉద్యోగుల ప్రస్తుత వేతనాలపై 26నుంచి 29 శాతం మేర సవరణకు నిర్ణయించి, 2022 నవంబర్ 1 నుంచి అమయ్యేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ చర్చల్లో ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఎం.శ్రీనివాస్, నున్నా సందర్‌రావు, జె.అనిల్‌కుమార్, ఎండీ.అఫ్జల్, పి.మంగయ్య, యూ.రవీందర్‌కుమార్, డి.రవి, ఎస్.కే.జానీమియా, ఎం.స్రవంతి, బి.రవికుమార్, పి.వెంకట్రామయ్య, జి.క్రాంతి, ప్రకాష్ పాండే పాల్గొన్నారు. కాగా, వేతన సవరణకు సహకరించిన మంత్రి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, అధికారులకు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ వేతన ఒప్పందాన్ని జిల్లాల వారీగా బ్యాంకు పాలకవర్గాలు తీర్మానించి అమలు చేయాల్సి ఉంటుంది.
బాల కార్మికులు
కనిపించొద్దు..
కొత్తగూడెంటౌన్: బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని ఎస్పీ రోహిత్‌రాజు సూచించారు. మంగళవారం ఎస్పీ కార్యాలయంలో సంక్షేమశాఖ అధికారి స్వర్ణలత లెనీనా ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆపరేషన్ ముస్కాన్–11 వాల్‌పోస్టర్లను ఎస్పీ ఆవిష్కరించి మాట్లాడారు. ఆపరేషన్ ముస్కాన్‌లో భాగంగా జూలై 1 నుంచి 31 వరకు జరగనున్న ప్రత్యేక కార్యక్రమంలో బాల కార్మికులను గుర్తిస్తారని, ఈ బృందంలో ఒక ఎస్‌ఐతోపాటు నలుగురు సిబ్బంది ఉంటారని తెలిపారు. పోలీస్ శాఖతో పాటు ఇతర అధికారులతో కలిసి జిల్లావ్యాప్తంగా 5 ప్రత్యేక బృందాలతో నెల రోజుల పాటు బాల కార్మికులను గుర్తించేందుకు దాడులు నిర్వహిస్తామని వెల్లడించారు. బాల కార్మికులను గుర్తిస్తే తక్షణమే 1098కు సమాచారం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమశాఖ అధికారి స్వర్ణలత లెనీనా, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, డీసీపీఓ హరికుమారి, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ఫక్రుద్దీన్, సందీప్, రమాదేవి, విజయకుమారి, ఏసోబు, సూర్యం పాల్గొన్నారు.