
కునుకు లేదు
చినుకు పడితే..
అసెంబ్లీలో చర్చిస్తానన్న
పోలవరం ఎమ్మెల్యే..
పెదవాగు ఆయకట్టు మొత్తం 16 వేల ఎకరాల్లో 13 వేల ఎకరాలు ఏపీలోని కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోనే ఉంది. అందుకే ప్రాజెక్టు పునర్నిర్మాణానికి 80 శాతం నిధులు భరించేందుకు జీఆర్‌ఎంబీ సమావేశంలో ఏపీ ఇరిగేషన్ అధికారులు అంగీకరించారు. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఫిబ్రవరి 11న అశ్వారావుపేటకు వచ్చినపుడు పెదవాగు అంశాన్ని ప్రస్తావిస్తూ అసెంబ్లీలో ప్రాజెక్టు సమస్యపై మాట్లాడతానని హామీ ఇచ్చారు. అయితే నాటి నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగకున్నా.. అధికార పార్టీ ఎమ్మెల్యే కాబట్టి నేరుగా సీఎంతో మాట్లాడొచ్చు కదా అని రైతులు అంటున్నారు. పోల‘వరం’ ఎమ్మెల్యే హామీ కూడా ఆచరణ సాధ్యం కాలేదని ఆవేదన చెందుతున్నారు.
అశ్వారావుపేట : గోదావరి బేసిన్ పరిధిలోని పెదవాగు మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టు పునర్నిర్మాణానికి నిధులు మంజూరు చేయకుండా ఏపీ ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందంటూ ఆయకట్టు రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గతేదాడి జూలై 18న క్లౌడ్‌బరస్ట్‌కు ప్రాజెక్టు కట్టతెగిన సంగతి తెలి సిందే. ఆ తర్వాత ఇరు రాష్ట్రాల ప్రజాప్రతినిధులు, అధికారులతో పాటు జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ సైతం సందర్శించారు. అనంతరం గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డ్ సమావేశంలోనూ ఇరురాష్ట్రాల ఇరిగేషన్ అధి కారులు ప్రాజెక్టు పునర్నిర్మాణానికి సమష్టి అంగీకారం తెలిపారు. ఈ సీజన్‌కే సాగునీరు అందించేలా చర్యలు చేపట్టాలని, ఆయకట్టు రైతులకు న్యా యం చేయాలని, దిగువ గ్రామాలకు వరద ముప్పు లేకుండా శాశ్వత పరిష్కారం చూపాలని నిర్ణయించారు. ఇందుకు రూ.19 కోట్ల వ్యయంతో తెలంగాణ ఇరిగేషన్ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేయగా అందులో 80 శాతం నిధులు జీఆర్‌ఎంబీకి డిపాజిట్ చేసేందుకు ఏపీ అధికారులు అంగీకరించారు. ఇక ఆ తర్వాత నిధుల్లేవు, పనుల్లేవు. దీంతో రైతులు, లోతట్టు ప్రాంతాల వారి పరిస్థితి ‘చినుకు పడితే .. కునుకు లేదు’ అన్నట్టుగా మారింది.
అటకెక్కిన తుమ్మల హామీ..
గతేడాది జూలై 18వ తేదీ రాత్రి పెదవాగు ప్రాజెక్టు కట్ట తెగిపోగా 21న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సందర్శించారు. పంటలు, ఇళ్లు దెబ్బతినడంపై విచారం వ్యక్తం చేయడమే కాక ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యంతోనే ఇలా జరిగిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టుకు మరమ్మతులు కాదు.. రీడిజైన్ చేయడమే శాశ్వత పరిష్కారమని, ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళతానని ప్రకటించారు. జీఆర్‌ఎంబీ, ఏపీ ప్రభుత్వంతో సమన్వయం చేస్తామని చెప్పారు. ప్రస్తుతం ఉన్న 40 వేల క్యూసెక్కుల సామర్థ్యాన్ని 80 వేల క్యూసెక్కులకు పెంచేలా ప్రతిపాదనలు తయారు చేయాలని ఇరిగేషన్ అధికారులకు ఆదేశించారు. 2025 వానాకాలం నాటికి రీ డిజైన్, నిర్మాణ పనులు పూర్తయ్యేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. దీంతో రైతుల్లో సరికొత్త ఆశలు చిగురించాయి. అయితే ఏడాది కావొస్తున్నా ఇవేమీ ఆచరణకు నోచుకోకపోవడంతో వారిలో నిరాశ అలుముకుంది.
‘రింగ్‌బండ్’కు ముప్పు.!
అశ్వారావుపేటరూరల్: పెదవాగు ప్రాజెక్టులో రూ.కోట్ల వ్యయంతో తాత్కాలికంగా నిర్మించిన రింగ్‌బండ్‌కు వర్షాలు, వరదతో ముప్పు పొంచి ఉంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో మట్టికట్టకు బీటలు ఏర్పడుతుండగా, ఓ చోట భారీగా కోతకు గురై గుంత ఏర్పడింది. వర్షాలు ఇంకా కొనసాగితే మట్టికట్ట వద్ద గండి పడే ప్రమాదం ఉందని ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. రూ. 3.50 కోట్లు వెచ్చించి నిర్మించిన రింగ్‌బండ్ విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు.. రింగ్‌బండ్‌పై ఆధారపడి పంటలు సాగు చేయాలా, వద్దా అనే సందిగ్ధంలో ఉన్నారు.
●
భయాందోళనలో పెదవాగు ఆయకట్టు రైతులు, లోతట్టు ప్రజలు
ఏపీ ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందంటూ అసహనం
జిల్లా మంత్రి పరిచయాలు, ప్రయత్నాలు ఏమయ్యాయని నిలదీత