
బాల్యం వికసించేలా..
● ఆపరేషన్ ముస్కాన్‌తో బాలకార్మికులకు విముక్తి ● ఈ నెల 31 వరకు కార్యక్రమాలు ● జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక బృందాలతో తనిఖీలు ● గత మూడేళ్లలో 251 మంది గుర్తింపు, సంరక్షణ
కొత్తగూడెంటౌన్: అనాథలు, బాల కార్మికులకు వెట్టిచాకిరీ నుంచి విముక్తి కలిగించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఆపరేషన్ ముస్కాన్‌తో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి చేస్తోంది. బాల కార్మికులను గుర్తించి వారి భవిష్యత్‌కు అండగా నిలుస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాల కార్మికుల కోసం ఆపరేషన్ ముస్కాన్, ఆపరేషన్ స్మైల్ కార్యక్రమాలు చేపడుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 2022 నుంచి 2025 వరకు దాదాపుగా 251 మంది బాల కార్మికులను గుర్తించి విముక్తి కలిగించినట్లు జిల్లా సంక్షేమశాఖ అధికారి స్వర్ణలత లెనినా తెలిపారు. హోటళ్లు, బట్టల షాపులు, ఇటుకల నిర్మాణ, భవన నిర్మాణ ప్రదేశాలు, బేకరీలు, సినిమాహాళ్లతోపాటు పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపడుతూ బాలకార్మికులను గుర్తిస్తున్నారు. జిల్లా సంక్షేమ, పోలీసు, రెవెన్యూ, కార్మిక శాఖలు, బాలల సంరక్షణ బృందాలు, చైల్డ్‌లైన్(1098), బాలల సంక్షేమ సమితి, ప్రత్యేక బాలల విభాగం, జాతీయ బాల కార్మిక విభాగాల సమన్వయంతో సబ్ డివిజన్ల వారీగా కార్యక్రమాలు నిర్వహిస్తూ బాలకార్మికులను రక్షిస్తున్నారు. చిన్నతనంలోనే తల్లిదండ్రుల ఆలనాపాలనకు నోచుకోని పిల్ల లు, తప్పిపోయిన పిల్లలు, అనాథలు, బాల కార్మికులుగా దుర్భర జీవితం సాగిస్తున్న చిన్నారులకు ఆపరేషన్ ముస్కాన్‌తో భరోసా కల్పిస్తున్నారు. 18 ఏళ్లలోపు బాలబాలికలతో పనులు చేయిస్తున్నవారిపై చర్యలు తీసుకుంటున్నారు. సంబంధిత యజమానులపై కేసులు నమోదు చేస్తున్నారు. ఏటా జూలై 1 నుంచి 31 వరకు ఆపరేషన్ ముస్కాన్, జనవరి 1 నుంచి 31 వరకు ఆపరేషన్ స్మైల్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. గుర్తించిన బాల కార్మికులకు సమగ్ర బాలల పరిరక్షణ పథకం కింద బాల సహాయక కిట్లు ఇవ్వడంతోపాటు సంరక్షణ బాధ్యతలను ప్రభుత్వమే పర్యవేక్షిస్తోంది.
బాలలతో పనులు చేయించడం నేరం
బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించేందుకు ఈ నెల 1 నుంచి ఆపరేషన్ ముస్కాన్ చేపడుతున్నాం. 31వ తేదీ వరకు తనిఖీలు కొనసాగిస్తాం. బాలబాలికలతో పనులు చేయిస్తే కేసులు నమోదు చేస్తాం. బాల కార్మికులను గుర్తించి వారికి విద్య నేర్పించేందుకు కృషి చేస్తాం. బాలకార్మికులతో ఎవరైనా పనులు చేయిస్తే 1098కు సమాచారం ఇవ్వాలి.
స్వర్ణలత లెనినా, జిల్లా సంక్షేమశాఖ అధికారి
గత మూడేళ్లలో విముక్తి కల్పించిన బాలల వివరాలు
ఏడాది ఆపరేషన్ బాలురు బాలికలు మొత్తం
2022 స్మైల్ 30 05 35
2022 ముస్కాన్ 56 12 68
2023 స్మైల్ 22 09 31
2023 ముస్కాన్ 28 05 33
2024 స్మైల్ 14 07 21
2024 ముస్కాన్ 21 02 23
2025 స్మైల్ 33 07 40
మొత్తం 204 47 251

బాల్యం వికసించేలా..