
చేప చెరువుకు చేరేనా?
● ఊసేలేని ఉచిత చేప పిల్లల పంపిణీ ప్రక్రియ ● ప్రతిపాదనలు కూడా రూపొందించని అధికారులు ● జిల్లావ్యాప్తంగా నిరీక్షిస్తున్న మత్స్యకారులు
పాల్వంచరూరల్: ఉచిత చేప పిల్లలు ఈసారి చెరువులకు చేరే పరిస్థితి కన్పించడంలేదు. జూలైలో చేప పిల్లలను చెరువులో వదిలితే మత్స్యకారులు ఉపాధి, ఆదాయం పొందుతారు. కానీ చేప పిల్లల పంపిణీకి ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి ఆదేశాలూ రాకపోవడంతో జిల్లా మత్స్యశాఖ అధికారులు ప్రతిపాదనలు కూడా పంపలేదు. జిల్లాలో గతేడాది 734 చెరువుల్లో చేప పిల్లలను వదిలారు. ఆలస్యంగా పంపిణీ చేయడంతోపాటు కేవలం 86 లక్షల చేపపిల్లలను మాత్రమే చెరువుల్లో వదిలి చేతులు దులుపుకున్నారు. ఈసారి సీజన్ ప్రారంభమైనా పంపిణీ ప్రక్రియపై అధికారుల నుంచి స్పష్టత లేకపోవడంతో మత్స్యకారులు నిరీక్షిస్తున్నారు.
734 చెరువులు, కుంటల్లో పెంపకం
జిల్లాలో చేపలు పెంచే చెరువులు, కుంటలు 734 ఉన్నాయి. 70 మత్స్య పారిశ్రామిక సొసైటీల ఆధ్వర్యంలో పెంపకం చేపడుతున్నారు. వీటిల్లో 3,248 మంది సభ్యులు ఉండగా, చేపల పెంపకం ద్వారా సుమారు 10 వేల మంది ఉపాధి పొందుతున్నారు. గతేడాది 86 లక్షల చేప పిల్లలను, అంతకుముందు సంవత్సరం 1,93,76,000 చేప పిల్లలను చెరువుల్లో వదిలారు. ఈసారి పంపిణీ ఊసేలేదు.
కిన్నెరసానిలో ఉత్పత్తి కేంద్రం..
కిన్నెరసానిలో మత్స్యశాఖ చేప పిల్లల ఉత్పత్తి కేంద్రంలో చేప గుడ్లు(స్పాన్) పోసి రెండు నెలలపాటు పెంచి గిరిజన మత్స్యకార సొసైటీలకు ఉచితంగా పంపిణీ చేస్తారు. 20 లక్షల చేప పిల్లలను పెంచేలా ఇక్కడ 13 తొట్లు నిర్మించగా, ప్రస్తుతం కొన్ని మాత్రమే పనిచేస్తున్నాయి. గతేడాది 12 లక్షల చేప పిల్లలను మాత్రమే పెంచారు. ఈసారి మాత్రం గుడ్లు ఇంతవరకు పోయలేదు.
గుడ్లు తీసుకురావాల్సిఉంది
ప్రభుత్వం ప్రతిపాదనలు అడిగితే జిల్లాలో 1.75 కోట్ల చేప పిల్లల పంపిణీ కోసం సిద్ధం చేసి పంపిస్తాం. కిన్నెరసాని ఉత్పత్తి కేంద్రానికి చేప గుడ్లను కరీంగనగర్ నుంచి తేవాల్సి ఉంది.
–ఇంతియాజ్ అహ్మద్, జిల్లా మత్స్యశాఖ అధికారి
సమయం దాటితే..
చేప పిల్లలను సీజన్ ప్రారంభంలో చెరువుల్లో వదిలితే 8,9 నెలల్లో చేపలు పెరిగి ఆశించిన దిగుబడి లభిస్తుంది. కానీ అదును దాటాక చేప పిల్ల లను పోసినా ఉపయోగం ఉండదు. ఆలస్యమైతే చేపలు ఎదగపోవడంతోపాటు దిగుబడి తగ్గుతుంది. సాధారణంగా జూలైలో 50, 60 రోజుల చేప పిల్లలను చెరువుల్లో వదులుతారు. ఫిబ్రవరి, మార్చి నాటికి చేప ఎదుగుతుంది. దీంతో మత్స్యకారులకు ఉపాధి లభిస్తుంది. కానీ ఈ ఏడాది ఇప్పటివరకు చేప పిల్లల పంపిణీకి ప్రతిపాదనలే రూపొందించలేదు. గుడ్లు తెచ్చి పిల్లల పెంపకం చేపట్టలేదు. జూలై తర్వాత పిల్లలను కొనుగోలు చేసి వదిలినా చేప ఎదిగే అవకాశం ఉండదు. మార్చి నాటికి చెరువుల్లో నీట్టిమట్టం కూడా తగ్గిపోతుందని, ఈ ఏడాది ఉచిత చేప పిల్లలు లేనట్టేనని మత్స్యకారులు ఆవేదన చెందుతున్నారు.

చేప చెరువుకు చేరేనా?

చేప చెరువుకు చేరేనా?