
కొత్తగూడెం టూ కిరండోల్
కొత్త రైల్వేలైన్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వ నిర్ణయం
● రెడ్‌కారిడార్‌లో రైల్వే కనెక్టివిటీ పెంపునకు చర్యలు ● కచ్చితమైన సమాచారం కోసం లైడార్ సర్వేకు ఆదేశాలు ● గతంలోనే ఫైనల్ లొకేషన్ సర్వే చేపట్టిన అధికారులు
దేశవ్యాప్తంగా ప్రాథమిక సర్వే రిపోర్టులను పరిశీలించిన రైల్వేశాఖ అందులో ప్రాధాన్యత క్రమాన్ని అనుసరించి ఏ ప్రాజెక్టును నిర్మించాలనే నిర్ణయాన్ని తీసుకుంటుంది. ఫలానా రైల్వే లైను నిర్మించాలని నిర్ణయం తీసుకున్న తర్వాత బడ్జెట్ కేటాయింపునకు ముందు ఫైనల్ లొకేషన్ సర్వే (ఎఫ్‌ఎల్‌ఎస్)ను చేపడుతుంది. రైలుమార్గం వెళ్లే దారిలో వర్షాల ప్రభావం, వరద, కాంటూరు లెవల్స్, వంతెనలు, కల్వర్టుల నిర్మాణానికి ఎలాంటి డిజైన్ ఉపయోగించాలి? నిర్మాణ ప్రదేశాలకు మ్యాన్ పవర్‌ను ఎలా పంపాలి, వారికి ఎక్కడ బస ఏర్పాటు చేయాలి. నిర్మాణ సామగ్రిని చేరవేయడం ఎలా? అనే ప్రతీ అంశంలో క్షుణ్ణంగా వివరాలను సేకరించి రిపోర్టు తయారు చేస్తారు.
సమగ్ర వివరాల సేకరణ
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రైల్వే కనెక్టివిటీ పెంచేందుకు కొత్తగూడెం – కిరండోల్ కొత్త రైల్వేలైన్ నిర్మించాలని రైల్వేశాఖ నిర్ణయించింది. ఇందుకోసం ఫైనల్ లొకేషన్ సర్వే చేపట్టాలని గత నెల 28న ఆదేశాలు జారీ చేసింది. కొత్తగూడెం, కిరండోల్ ప్రాంతాల మధ్య 180 కిలోమీటర్ల దూరం ఉంది. ఇందులో కొత్తగూడెం నుంచి పాండురంగాపురం వరకు ఇప్పటికే రైలుమార్గం అందుబాటులో ఉంది. మణుగూరు–భద్రాచలం రోడ్ (కొత్తగూడెం) సెక్షన్‌లో ఉన్న పాండురంగాపురం నుంచి కిరండోల్ వరకు కొత్తగా 160.33 కిలోమీటర్ల మేర లైన్ నిర్మించాల్సి ఉంటుంది. గోదావరి నదిపై వంతెన నిర్మించడంతోపాటు పాండురంగాపురం రైల్వే స్టేషన్ నుంచి భద్రాచలం వరకు 9.50 కిలోమీటర్ల మేర నూతన మార్గం నిర్మించాల్సి ఉంది. ఆ తర్వాత దుమ్ముగూడెం మండలంలోని రామచంద్రునిపేట, అడవి రామవరంల మీదుగా మరో 12.32 కిలోమీటర్ల రైల్వే లైన్ ఏర్పాటు చేయాలి. అక్కడి నుంచి ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలోకి ఈ మార్గం ప్రవేశిస్తుంది. గంగ్రేల్, గొల్లపల్లి, చింతల్నార్, నీలంపల్లి , తమోడిల మీదుగా కిరండోల్‌కు ఈ మార్గం చేరుకుంటుంది. 160 కిలోమీటర్ల లైన్‌లో తెలంగాణ పరిధిలో 22 కిలోమీటర్లు ఉండనుంది.
ప్రకటన వచ్చినా నిధులు కేటాయించలే..
భద్రాచలం–మల్కన్‌గిరి (ఒడిశా) కొత్త లైను నిర్మాణానికి రైల్వేశాఖ 2021లో పచ్చజెండా ఊపింది. రెండు పట్టణాల మధ్య 173 కిలోమీటర్ల మేరకు రైల్వేలైను నిర్మించేందుకు 2022 జూన్‌లో ప్రాథమిక సర్వే రిపోర్టు వచ్చింది. ఇందులో ఒడిశా పరిధిలో మల్కన్‌గిరి, బదాలి, కోవాసిగూడ, రాజన్‌గూడ, మహరాజ్‌పల్లి స్టేషన్లు ఉండగా ఆంధ్రప్రదేశ్‌లో కన్నాపురం, కూటుగుట్ట, పల్లు, నందిగామ స్టేషన్లు ఉన్నాయి. తెలంగాణ పరిధిలో భద్రాచలం, పాండురంగాపురం స్టేషన్లు నిర్మించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ రైలుమార్గం దారిలో గోదావరి, శబరి నదులతోపాటు పలు ప్రాంతాల్లో 213 వంతెనలు నిర్మించాల్సి వస్తుందని తేల్చారు. ప్రాజెక్ట్ నిర్మాణానికి రూ. 3,592 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఆ తర్వాత రెండేళ్లకు వెనుకబడిన గిరిజన ప్రాంతాల అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఈ రైల్వేలైనుకు పచ్చజెండా ఊపుతున్నట్టు 2024 ఆగస్టులో కేంద్ర రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు. కానీ గత రైల్వే బడ్జెట్‌లో ఈ లైనుకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. అదే విధంగా మణుగూరు – రామగుండం, భద్రాచలంరోడ్ – కొవ్వూరు, కొత్తగూడెం – కొండపల్లి రైల్వేలైన్ల పరిస్థితి కూడా సర్వేల దశను దాటి అడుగు ముందుకు పడటం లేదు.
లైడార్ సర్వేకు నిర్ణయం..
ప్రస్తుతం కిరండోల్‌కు విశాఖపట్నం నుంచి మాత్రమే రైలుమార్గం అందుబాటులో ఉంది. ఈ మార్గం నిడివి 440 కి.మీలుగా ఉంది. దీంతో ప్రత్యామ్నాయ మార్గంగా కొత్తగూడెం–కిరండోల్ రైలుమార్గాన్ని నిర్మిస్తామంటూ 2014/15లో బడ్జెట్‌లో రైల్వేశాఖ ప్రకటించింది. ఆ తర్వాత 2018 ప్రాథమిక సర్వే చేపట్టింది. 2023 సెప్టెంబర్‌లో ఫైనల్ లొకేషన్ సర్వే చేపట్టారు. కానీ ఆ తర్వాత ఈ లైను విషయంలో ఉలుకూపలుకు లేకుండా పోయింది. తాజాగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా కొత్తగూడెం–కిరండోల్ మార్గం తెర మీదకు వచ్చింది. దీంతో రెండోసారి ఫైనల్ లొకేషన్ సర్వే చేపడుతున్నారు. ఈసారి మరింత కచ్చితమైన సమాచారం కోసం లైడార్ (లైట్ డిటెక్షన్ అండ్ రేంజింగ్) సర్వే కూడా చేపట్టాలని నిర్ణయించారు.