
స్వర్ణకవచ ధారణలో రామయ్య
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామివారి దేవస్థానం అంతరాలయంలోని మూలమూర్తులు శుక్రవారం స్వర్ణ కవచధారులై దర్శనమిచ్చారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామివారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. శుక్రవారాన్ని పురస్కరించుకుని శ్రీ లక్ష్మీతాయారు అమ్మవారి ఆలయంలో అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు.
పెద్దమ్మతల్లికి
పంచామృతాభిషేకం
పాల్వంచరూరల్: పెద్దమ్మతల్లికి వైభవంగా పంచామృతాభిషేకం నిర్వహించారు. మండల పరిధిలోని కేశవాపురం, జగన్నాథపురం గ్రామాల మధ్య కొలువైఉన్న శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయంలో శుక్రవారం అర్చకులు అమ్మవారి జన్మస్థలం వద్ద పంచామృతం, పసుపు, కుంకుమ, గాజులు, హారతి సమర్పించారు. అనంతరం ఆలయంలోని మూలవిరాట్‌కు పంచామృతంతో అభిషేక పూజలు, పంచహారతులు, నివేదన, నీరాజనం, మంత్రపుష్పం పూజలతోపాటు కుంకుమ పూజ, గణపతిహోమం నిర్వహించారు.
దరఖాస్తుల ఆహ్వానం
కొత్తగూడెంఅర్బన్: అశ్వారావుపేటలోని ప్రాంతీయ ఆస్పత్రిలో మత్తు వైద్య నిపుణులను కాంట్రాక్టు పద్ధతిలో నియమించేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఆస్పత్రుల సూపరింటెండెంట్ డాక్టర్ రవిబాబు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులు ఈనెల 10వ తేదీ లోగా ఐడీఓసీలోని జిల్లా ఆస్పత్రుల ప్రధాన కార్యాలయంలో అందజేయాలని కోరారు. వైద్య నిపుణుడికి నెలకు వేతనం రూ.1.50 లక్షలు చెల్లించనున్నట్లు తెలిపారు.
స్కౌట్ మాస్టార్ పోస్టులకు..
పాల్వంచరూరల్: జిల్లాలోని 23 మండలాల పరిధిలో ప్రైవేట్ పాఠశాలలో పనిచేసేందుకు ఆసక్తి కలిగిన స్కౌట్ మాస్టార్లు ఈ నెల 6వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని స్కౌట్ డిస్ట్రిక్ట్ ఆర్గనైజింగ్ కమిషనర్ గద్దల రమేష్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీ ఉత్తీర్ణులై, 18 నుంచి 30 సంవత్సరాల వయస్సు కలిగిన యువతీ యువకులు స్కౌట్ మాస్టార్లుగా అర్హులని పేర్కొన్నారు. పాల్వంచ మున్సిపల్ కార్యాలయం పక్కన ఉన్న మహిళాశక్తి హోటల్‌లో దరఖాస్తులు అందజేయాలని, ఎంపికై న స్కౌట్ మాస్టార్లకు నెలకు రూ.18 వేల వేతనం ఇస్తారని వివరించారు.
తాలిపేరులోకి వరదనీరు..
చర్ల: తాలిపేరు మధ్యతరహా ప్రాజెక్ట్‌లోకి వరదనీరు చేరుతోంది. రెండు నెలలపాటు సాధారణ నిర్వహణ పనులను పూర్తి చేసిన అధికారులు శుక్రవారం ప్రాజెక్ట్ 25 స్పిల్‌వే గేట్లను దించివేశారు. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో వరదనీరు వస్తుండగా, గేట్లను దించిన దగ్గర నుంచి ప్రాజెక్ట్ నీటిమట్టం పెరుగుతోంది. కనిష్ట నీటిమట్టం 69 మీటర్లు, గరిష్ట నీటిమట్టం 74 మీటర్లు కాగా, గురువారం రాత్రి 10 గంటలకు ప్రాజెక్టు నీటిమట్టం 70.65 మీటర్లుగా నమోదైంది. నాలుగైదు రోజులపాటు వరద ప్రవాహం కొనసాగితే ప్రాజెక్ట్ నీటిమట్టం పూర్తి స్థాయికి చేరుకునే అవకాశం ఉంది. డీఈ తిరుపతి, ఏఈలు ఉపేందర్, సుమన శుక్రవారం ప్రాజెక్ట్‌ను పర్యవేక్షించారు.

స్వర్ణకవచ ధారణలో రామయ్య

స్వర్ణకవచ ధారణలో రామయ్య