
ఆదివాసీల సంక్షేమానికి కృషి
కొత్తగూడెంఅర్బన్: ఆదివాసీ ప్రజల సంక్షేమం, అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ఎస్పీ రోహిత్‌రాజు తెలిపారు. శుక్రవారం లక్ష్మీదేవిపల్లి మండలంలోని గంగమ్మ కాలనీ గొత్తికోయ గ్రామంలో ఏర్పాటు చేసిన కమ్యూనిటీ కనెక్ట్ కార్యక్రమంలో ఎస్పీ మాట్లాడారు. పిల్లలకు విద్య నేర్పిస్తే ఉన్నత స్థానాలకు చేరుకుంటారని తెలిపారు. గ్రామంలోకి ఎవరైనా కొత్త వ్యక్తులు ప్రవేశిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. వర్షాకాలంలో ఇళ్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పారు. అనంతరం 27 కుటుంబాలకు దుప్పట్లు, దోమ తెరలను పంపిణీ చేశారు. విద్యుత్, మొబైల్ నెట్‌వర్క్ సమస్యలను సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరలోనే పరిష్కరిస్తామని తెలిపారు. అనంతరం మద్దె గుంపునుకు చేరుకుని అక్కడ నివసిస్తున్న ఆదివాసీ ప్రజల స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ జి.నరేందర్, కొత్తగూడెం డీఎస్పీ రెహమాన్, ఇన్‌స్పెక్టర్లు శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, ఎస్సైలు రమణారెడ్డి, కార్తీక్, లక్ష్మీదేవిపల్లి పోలీసు సిబ్బంది, స్పెషల్ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు.