
ఫలించిన ‘అంగన్‌వాడీ బాట’
● కొత్తగా 13,760 మంది చిన్నారుల చేరిక ● ఐదేళ్లు నిండిన 6,154 మంది పాఠశాలల్లో చేరిక ● టీచర్ పోస్టులు భర్తీ చేస్తే మరింతమంది చేరే అవకాశం
భద్రాచలంఅర్బన్ : రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జూన్ 10 నుంచి 17 వరకు నిర్వహించిన ‘అమ్మమాట – అంగన్ వాడీ బాట’ కార్యక్రమం విజయవంతమైంది. అంగన్‌వాడీ కేంద్రాలు అందించే సేవలను తల్లిదండ్రులకు వివరించడంతో జిల్లాలో ఈ ఏడాది కొత్తగా 13,760 మంది చిన్నారులు చేరగా, 3,966 మంది ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు.
పౌష్టికాహారం, ఆటపాటలతో విద్య..
జిల్లాలో 2,060 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఈ కేంద్రాల్లో చిన్నారులకు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు భోజనం, గుడ్డు, మురుకులు, బాలామృతం వంటి పౌష్టికాహారం అందిస్తున్నారు. గర్భిణులు, బాలింతలకు కూడా పాలు, గుడ్డు వంటి పోషకాహారం అందుతోంది. ఆటపాటలు, కథలు, సంభాషణ నైపుణ్యాలతో కూడిన పూర్వ ప్రాథమిక విద్య ద్వారా చిన్నారులకు మంచి అలవాట్లు నేర్పుతున్నారు. పుట్టిన వెంటనే తల్లులు, చిన్నారుల పేర్లను అంగన్‌వాడీ కేంద్రాల్లో నమోదు చేయడం ద్వారా బాలింతలకు పోషకాహారం, చిన్నారులకు బాలామృతం పంపిణీ చేస్తున్నారు.
ఖాళీల భర్తీతో మరింత బలోపేతం..
జిల్లాలో 2,060 అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా 1,869 మంది టీచర్లు, 1,103 మంది ఆయాలు పనిచేస్తున్నారు. ఇంకా 191 టీచర్ పోస్టులు, 957 ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో సమీప కేంద్రాల టీచర్లు ఖాళీగా ఉన్న కేంద్రాలను పర్యవేక్షిస్తున్నారు. ఇది వారికి అదనపు భారంగా మారుతోంది. గతేడాది నుంచి ఖాళీల భర్తీకి ప్రతిపాదనలు పంపినా ఇంకా భర్తీ చేయలేదు. పోస్టుల భర్తీతో పాటు ఆయా సెంటర్లకు పక్కా భవనాలు నిర్మిస్తే లబ్ధిదారులకు మరింతగా సేవలు అందే అవకాశం ఉంటుంది.
ఆరు నెలలుగా అద్దె పెండింగ్
కొత్తగూడెంటౌన్: అంగన్‌వాడీ కేంద్రాలకు ఆరు నెలలుగా అద్దె బకాయిలు విడుదల కాకపోవడంతో టీచర్లు ఇబ్బంది పడుతున్నారు. అద్దె చెల్లించక ఇంటి యజమానుల నుంచి ఒత్తిడి ఎదురవుతోందని వాపోతున్నారు. అలాగే, రెండేళ్లుగా ఈవెంట్ బిల్లులు, మూడేసి నెలలుగా ఆరోగ్యలక్ష్మి, గ్యాస్ బిల్లులు పెండింగ్‌లోనే ఉన్నాయని చెబుతున్నారు. జిల్లాలో 785 అంగన్‌వాడీలు అద్దె భవనాల్లో కొనసాగుతుండగా, ఒక్కో భవనానికి నెలకు రూ.వెయ్యి నుంచి రూ.4వేల చొప్పున ఆరు నెలలుగా అద్దె బకాయిలు పేరుకుపోయాయి. అలాగే, సంక్షేమశాఖ ద్వారా అమలయ్యే కార్యక్రమాలు వివరించేందుకు ఈవెంట్లకు రూ.200 నుంచి రూ.500 వెచ్చిస్తుండగా ఒక్కో సెంటర్‌కు దాదాపు రూ.6 వేల నుండి రూ.9 వేల వరకు చెల్లించాల్సి ఉంది.
అంగన్‌వాడీలకు వచ్చేలా చర్యలు
అన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో సమీప చిన్నారులు చేరేలా అమ్మమాట – అంగన్‌వాడీ బాట కార్యక్రమాన్ని చేపట్టాం. వారం రోజుల్లోనే మంచి ఫలితాలు నమోదయ్యాయి. చిన్నారులను చేర్పించే కార్యక్రమం కొనసాగిస్తూనే, కేంద్రాల్లో చిన్నారులకు అవసరమైన వసతులు కల్పిస్తాం. అలాగే, అద్దె బకాయిలు, ఈవెంట్ బిల్లులపై ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు సమర్పించాం. చిన్నారులందరికీ యూనిఫామ్ ఇచ్చేలా అధికారుల దృష్టికి తీసుకువెళ్తాం.
– స్వర్ణలత లెనీనా, జిల్లా సంక్షేమశాఖ అధికారి
ఈసారీ కొందరికే యూనిఫామ్
కొత్తగూడెంటౌన్: అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులకు 2024 నుంచి రాష్ట్ర ప్రభుత్వం యూనిఫామ్ అందిస్తోంది. అయితే, జిల్లాలో 2,060 అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా, వీటిల్లో ఏడు నెలల నుంచి మూడేళ్ల లోపు వయస్సు వారు 33,800 మంది, మూడేళ్ల నుంచి ఆరేళ్ల వయస్సు పిల్లలు 2,800 ఉన్నారు. అయితే, గత ఏడాది 612 కేంద్రాల్లోని 6,362 పిల్లలకే యూనిఫామ్ పంపిణీ చేశారు. అమ్మాయిలకు గౌన్, అబ్బాయిలకు నిక్కరు, చొక్కా కుట్టించి ఇవ్వగా.. మిగతా మిగతా కేంద్రాల్లో చిన్నారులకు నిరాశ ఎదురైంది. ఈసారి సైతం జిల్లాలో అదే సంఖ్యలో యూనిఫామ్ పంపిణీ చేయనున్నారని తెలుస్తుండగా.. అందరికీ ఇవ్వాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. ప్రభుత్వ భవనాల్లో కొనసాగుతున్న కేంద్రాల చిన్నారులకు యూనిఫామ్ ఇచ్చి మిగతా వారిని విస్మరించడం సరికాదని చెబుతున్నారు.

ఫలించిన ‘అంగన్‌వాడీ బాట’

ఫలించిన ‘అంగన్‌వాడీ బాట’

ఫలించిన ‘అంగన్‌వాడీ బాట’