విషజ్వరాలపై అప్రమత్తంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

విషజ్వరాలపై అప్రమత్తంగా ఉండాలి

Jul 4 2025 3:58 AM | Updated on Jul 4 2025 3:58 AM

విషజ్వరాలపై అప్రమత్తంగా ఉండాలి

విషజ్వరాలపై అప్రమత్తంగా ఉండాలి

అధికారులకు కలెక్టర్‌ ఆదేశం

కొత్తగూడెంఅర్బన్‌ : భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాలో విష జ్వరాలు ప్రబలే ప్రమాదం ఉన్నందున వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ సూచించారు. కలెక్టరేట్‌లో గురువారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్ని రకాల మందులు, పరీక్ష కిట్లు అందుబాటులో ఉంచాలన్నారు. వైద్య సిబ్బంది 24 గంటలూ అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఆస్పత్రుల్లో ఏ చిన్న సమస్య వచ్చినా.. వెంటనే తన దృష్టికి తేవాలన్నారు. ఇన్సులిన్‌, మలేరియా మందుల సరఫరాకు కృషి చేస్తానని చెప్పారు.

‘భవిత’తో మనో వికాసం..

భవిత కేంద్రాల ద్వారా దివ్యాంగులకు మనోవికాసం కలుగుతుందని కలెక్టర్‌ అన్నారు. కొత్తగూడెం రైటర్‌ బస్తీలోని భవిత కేంద్రాన్ని గురువారం సందర్శించారు. శిక్షణ పొందుతున్న విద్యార్థులతో మాట్లాడి ఏమైనా సమస్యలున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. అన్ని సౌకర్యాలు, వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లల బోధనకు అవసరమైన అన్ని పరికరాలు, స్టడీ మెటీరియల్‌ తెప్పించాలని, రెయిలింగ్‌, రాంప్‌ వంటివి పటిష్టంగా ఏర్పాటు చేయాలని అన్నారు.ఫిజియోథెరపిస్టులు కచ్చితంగా కేంద్రానికి వచ్చేలా చూడాలన్నారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయంలోని ఈవీఎం గోడౌన్‌ను కలెక్టర్‌ తనిఖీ చేశారు. గోడౌన్‌ పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచాలని, అనుమతి లేకుండా ఎవరినీ లోనికి వెళ్లనివ్వొద్దని సిబ్బందికి సూచించారు.

మేకపాల విశిష్టతను తెలియజేయాలి..

జిల్లాలోని మారుమూల గ్రామాల గిరిజనులు, మహిళల వద్ద గల మేకల సంతతిని అభివృద్ధి చేయాలని, అధిక పాల దిగుబడి వచ్చేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ పాటిల్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో గురువారం ఆయన పశువైద్య అధికారులు, సిబ్బందితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మేకపాల విశిష్టతపై ప్రజలకు అవగాహన పెంచాలన్నారు. మేకపాల నుంచి పెరుగు, మజ్జిగ, జున్ను, పన్నీరు, చీజ్‌ వంటి ఉత్పత్తులు తయారు చేసి వినియోగించే పద్ధతులపై ప్రచారం కల్పించాలన్నారు. జిల్లా ప్రజలకు ఆరోగ్యకరమైన మేకపాలు అందించేందుకు ప్రత్యేకంగా విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేయాలని, వీటి మార్కెటింగ్‌ ద్వారా గిరిజనులు, మహిళల ఆర్థిక స్థితి మెరుగుపడుతుందని చెప్పారు. బాతులు, కౌజు పిట్టల పెంపకంపై కూడా ప్రోత్సహించాలని ఆదేశించారు. ఆయా కార్యక్రమాల్లో డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ రవిబాబు, కొత్తగూడెం ఎంఈఓ ప్రభుదయాల్‌, ఎన్నికల సూపరింటెండెంట్‌ రంగా ప్రసాద్‌, ఎలక్షన్‌ సెల్‌ సిబ్బంది నవీన్‌, పశువైద్యాధికారి ఎం. వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

తహసీల్దార్లు, నాయబ్‌ తహసీల్దార్ల బదిలీ

జిల్లాలోని ముగ్గురు తహసీల్దార్లు, ఏడుగురు నాయబ్‌ తహసీల్దార్లను బదిలీ చేస్తూ కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. వారి స్థానంలో కొత్తవారిని నియమించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement