
యూరియా కోసం పడిగాపులు
ఇల్లెందు: పట్టణంలోని మార్కెట్ యార్డులో రైతులు యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు. గత వారం రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో పంటలకు యూరియా వేసేందుకు వస్తుండడంతో మార్కెట్‌లోని యూరియా విక్రయ కేంద్రం కిటకిటలాడుతోంది. గురువారం రెండు లారీల యూరి యాను రైతులు కొనుగోలు చేశారు. ఇప్పటివరకు ఇల్లెందు పీఏసీఎస్‌లో సుమారు 2వేల మంది రైతులు 300 టన్నులు యూరియా కొనుగోలు చేశారు. యూరియా బస్తాలను పీఏసీఎస్ వద్ద కొనుగోలు చేస్తుండగా.. డీఏపీ, 20:20 ఎరువులు మాత్రం ప్రైవేట్ వ్యాపారుల వద్ద తీసుకెళ్తున్నారు. వర్షాలకు ఏపుగా ఎదిగి వస్తున్న పంటలకు యూరియా అవసరం పెరిగింది. అయితే యూరియా కొరత లేదని, రైతులకు అవసరమైనంత అందిస్తున్నానమని పీఏసీఎస్ సీఈఓ హీరాలాల్ తెలిపారు.