
ఆర్డర్‌పై అడవి మాంసం!
రెచ్చిపోతున్న వేటగాళ్లు
రాష్ట్రంలోనే అత్యధికంగా అడవులు ఉన్న జిల్లా భద్రాద్రి కొత్తగూడెం. జిల్లా కేంద్రంగా ఉంటూ పారిశ్రామిక ప్రాంతంగా ఉన్న కార్పొరేషన్ పరిధి చుట్టూ కిన్నెరసాని అభయారణ్యం ఉంది. దీంతో పల్లె ప్రజలకే కాదు పట్టణ వాసులకు అడవి జంతువులు కనిపించడం ఇక్కడ సాధారణ విషయం. దీంతో కొందరు సరదాగా అడవి పందులను వేటాడటం మొదలెట్టారు. ఇలా వచ్చిన మాంసాన్ని రహస్యంగా అమ్ముకుని తమ అవసరాలను తీర్చుకునే వారుకొందరు. వన్యప్రాణుల మాంసానికి డిమాండ్ ఎక్కువగా ఉండటంతో గడిచిన రెండేళ్లుగా వేటనే ప్రధాన పనిగా పెట్టుకునే ముఠాలు తయారయ్యాయి. జిల్లాలో పాల్వంచ, ములకలపల్లి, దమ్మపేట, అశ్వారావుపేట, ఆళ్లపల్లి, గుండాల, కొత్తగూడెం, ఇల్లెందు, మణుగూరు, అశ్వాపురం, కిష్టారం (బూర్గంపాడు) రేంజ్‌లలో వన్యప్రాణులను వేటాడేవారు పెరిగిపోయారు.
పోగుల్లేవు.. ఏకంగా శాల్తీలే..
ఒకప్పుడు పొలాలకు రైతులు అమర్చిన విద్యుత్ తీగలకు తగిలి లేదా వేటగాళ్లు అమర్చిన ఉచ్చుల్లో చిక్కుకుని అడవి పంది లేదా ఇతర జంతువులు చనిపోతే, ఆ విషయాన్ని రహస్యంగా ఉంచేవారు. బయటకు తెలియకుండా ఆ జంతువు కళేబరాలను పాతి పెట్టడమో, కొద్దిపాటి ధైర్యం చేసి పొతం చేసి పోగులు వేసి తమకు పరిచయస్తులైన కొందరికే ఆ మాంసాన్ని పంపించేవారు. కానీ ఇటీవల అదే పనిగా జంతువుల మాంసం కోసం అడవులపై కన్నేసే వారు పెరిగిపోయారు. ఉచ్చులు బిగించిప్పుడు, తుపాకులు పట్టుకుని అడవిలోకి వెళ్లేప్పుడే తమ ‘సర్కిల్’లో ఉన్న వారికి సమాచారం ఇచ్చి ఆర్డర్లు తీసుకుంటున్నారు. చుక్కల దుప్పి మాంసానికి కేజీ రూ. 1,000 నుంచి రూ.1,500, అడవి పంది మాంసానికి రూ. 600 వంతున ఒక్కో జంతువుకు ఒక్కో రేటు చెబుతున్నారు. ఇటీవల ఒక అడుగు ముందుకు వేసి ఇటు వేటగాళ్లు, అటు మాంసం తీసుకునే వారు పోగుల కంటే ఏకంగా శాల్తీలకు శాల్తీలే బేరం చేయడానికి ఎక్కువగా ఉబలాటపడుతున్నారు. వన్యప్రాణుల వేటకు సంబంధించి వరుసగా వెలుగు చూస్తున్న ఘటనలు ఫారెస్ట్ శాఖ నిఘా వైఫల్యాలను ఎత్తి చూపుతోంది.
జిల్లాలో రెచ్చిపోతున్న వన్యప్రాణి వేటగాళ్లు
నాటు తుపాకులతో అడవుల్లో సాగుతున్న వేట
కరెంటు తీగల ఏర్పాటుతో అటవీ జంతువుల వధ
ఈ నెల 15న వేటగాళ్లు అమర్చిన విద్యుత్ తీగలు తగిలి అన్నపురెడ్డిపల్లి మండలంలో ఎనిమిది గేదెలు మృత్యువాత.
ఈ నెల 15న ములకలపల్లి మండలంలో కొందరు వేటగాళ్లు నాటు తుపాకులతో సంచరిస్తుండగా అటవీ శాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు
మే 26న అశ్వారావుపేట మండలంలో కస్తూరి జింకకు సంబంధించిన అవశేషాలు పట్టుబడ్డాయి
ఏప్రిల్ 17న దమ్మపేట మండలంలో ఓ తోటలో దుప్పి మాంసంతో విందు చేసుకుంటుండగా అటవీ శాఖ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు
ఏప్రిల్ 9న నాటు తుపాకులతో వేటకు వచ్చిన ముగ్గురిని అటవీ అధికారులు అరెస్ట్ చేశారు.
మే 23న చుక్కల దుప్పి దారి తప్పి అశ్వారావుపేటలో సంచరించినట్టుగా ఫొటోలు బయటకు వచ్చాయి. అంతకు కొద్ది రోజుల ముందు కొత్తగూడెం నగరంలో గాజులరాజం బస్తీలోకి ఒక దుప్పి వచ్చినట్టుగా వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఈ ఏడాది ఆరంభంలో గుండాల మండలం కాచనపల్లి అటవీ ప్రాంతంలో వన్యప్రాణి మాంసం విక్రయాలు జరగగా ఆ విషయాన్ని బహిర్గతం కానివ్వలేదననే ఆరోపణలు వచ్చాయి. ఇటీవల లక్ష్మీదేవిపల్లి మండలం రేగళ్ల అడవుల్లోనూ ఈ తరహా ఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది.