
రామయ్యకు సువర్ణ పుష్పార్చన
భద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామివారికి ఆదివారం అభిషేకం, సువర్ణ పుష్పార్చన నిర్వహించారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం స్వామివారిని బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం జరిపించారు. అనంతరం స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీతధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ వేడుకను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. సెలవు రోజు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
శ్రీకనకదుర్గమ్మకు
విశేష పూజలు
పాల్వంచరూరల్: శ్రీకనకదుర్గమ్మ అమ్మవారికి అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాలతోపాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. భక్తులు క్యూలైన్ ద్వారా భక్తులు అమ్మవారిని దర్శించుకోగా, అర్చకులు విశేషపూజలు జరిపారు. భక్తులు అన్నప్రాసనలు, ఒడిబియ్యం, పసుపు కుంకుమలు, చీరలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, ఈఓ ఎన్.రజనీకుమారి పాల్గొన్నారు.
నేడు గిరిజన దర్బార్
భద్రాచలంటౌన్: భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో సోమవారం నిర్వహించనున్న గిరిజన దర్బార్ కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు సకాలంలో హాజరుకావాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ ఆదివారం ఒక ప్రకటనలో ఆదేశించారు. ఉదయం 10.30 గంటలకు ప్రారంభమయ్యే గిరిజన దర్బార్‌లో ఆదివాసీ గిరిజనలు తమ సమస్యలకు సంబంధించిన అంశాలపై లిఖితపూర్వకంగా ఫిర్యాదులు అందజేయాలని పేర్కొన్నారు.
కిన్నెరసానిలో జలవిహారం
పాల్వంచరూరల్: కిన్నెరసానిలో ఆదివారం పర్యాటకులు సందడి చేశారు. ఆదివారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి పర్యాటకులు కిన్నెరసాని ప్రాజెక్ట్‌కు తరలివచ్చారు. డ్యామ్‌పై నుంచి జలాశయాన్ని, డీర్ పార్కులోని దుప్పులను వీక్షించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆనందోత్సాహాల నడుమ గడిపారు. 560 మంది పర్యాటకులు కిన్నెరసానిలోకి ప్రవేశించగా వైల్డ్‌లైఫ్ శాఖకు రూ.30,820 ఆదాయం లభించింది. 250 మంది బోటు షికారు చేయగా టూరిజం కార్పొరేషన్ సంస్థకు రూ.13,300 ఆదాయం లభించినట్లు నిర్వాహకులు తెలిపారు.
కిన్నెరసానిని సందర్శించిన
6వ బెటాలియన్ కమాండెంట్
చాతకొండ ఆరో బెటాలియన్‌కు చెందిన కమాండెంట్ శివప్రసాద్‌రెడ్డి కుటుంబ సభ్యులతో కిన్నెరసానిని సందర్శించారు. జలాశయాన్ని వీక్షించి బోటు షికారు చేశారు.
జేఈఈ అడ్వాన్స్‌డ్
ప్రశాంతం
సుజాతనగర్: మండల పరిధిలోని అబ్దుల్ కలాం ఇంజనీరింగ్ కళాశాలలో ఆదివారం జరిగిన జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించారు. 120 మందికిగాను 118 మంది హాజరైనట్లు నిర్వాహకులు తెలిపారు.

రామయ్యకు సువర్ణ పుష్పార్చన

రామయ్యకు సువర్ణ పుష్పార్చన