బూర్గంపాడు: వ్యవసాయ యాంత్రీకరణకు ఎట్టకేలకు గ్రహణం వీడింది. ఏడేళ్లుగా నిలిచిన పథకానికి ప్రభుత్వం మళ్లీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. రైతులకు 50 శాతం రాయితీతో వ్యవసాయ పరికరాలు, పనిముట్లు అందించేందుకు సర్కారు నిర్ణయం తీసుకుంది. 14 రకాల వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలను అందించేందుకు వ్యవసాయ శాఖ దరఖాస్తులు స్వీకరిస్తోంది. తొలుత మహిళా రైతులకు ప్రాధాన్యతనివ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. తొలివిడతలో ఎస్సీ, ఎస్టీ మహిళా రైతులకు పనిముట్లు అందించాలని భావిస్తోంది.
జిల్లాకు రూ.కోటి నిధులు
తొలివిడతగా వ్యవసాయ యాంత్రీకరణ కోసం జిల్లాకు రూ. కోటి నిధులు కేటాయించింది. ఈ నిధులను కొత్తగూడెం, ఇల్లెందు, మణుగూరు, భద్రాచలం, అశ్వారావుపేట వ్యవసాయ డివిజన్లకు విభజించి కేటాయింపులు జరిపారు. రైతులకు పవర్ స్ప్రేయర్లు, హ్యాండ్ స్ప్రేయర్లు, కల్టివేటర్లు, నాగళ్లు, డిస్క్‌లు, కేజ్ వీల్స్, రోటో పడ్లర్, రోటోవేటర్, సీడ్ కమ్ ఫర్టిలైజర్ డ్రిల్, బ్రష్ కట్టర్, పవర్ టిల్లర్స్,స్ట్రా బేలర్స్ వంటి పనిముట్లు అందించనున్నారు. రైతులు తమకు అవసరమైన పనిముట్ల కోసం దరఖాస్తు చేసుకుంటే అధికారులు పరిశీలన చేసి ప్రభుత్వానికి నివేదికలు పంపించనున్నారు.
448 యూనిట్లే..?
జిల్లాలో ఎస్సీ, ఎస్టీ రైతులు వ్యవసాయ యాంత్రీకరణ పథకం కోసం ఏడేళ్లుగా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం యాంత్రీకరణకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వటంతో రైతుల్లో ఆశలు రేకెత్తాయి. ప్రభుత్వంఅరకొర నిధులు, తక్కువ యూనిట్లు కేటాయించటంతో తమవరకు ఈ పథకాలు వర్తిస్తాయో లేదోనని రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. దరఖాస్తులు వేలసంఖ్యలో వచ్చే అవకాశం ఉండగా, జిల్లాలో 448 యూనిట్లు మాత్రమే అందే పరిస్థితి ఉంది. లబ్ధిదారుల ఎంపిక కూడా వ్యవసాయశాఖఅధికారులకు కత్తిమీద సాములా మారనుంది.అధికార పార్టీ ప్రజాప్రతినిధుల ప్రమేయం, స్థానికఎమ్మెల్యేల సిఫారసులు ఉంటేనే యాంత్రీకరణ పథకాలు అందే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
50శాతం రాయితీతో
వ్యవసాయ పనిముట్లు
తొలుత మహిళా రైతులకు ప్రాధాన్యం
దరఖాస్తులు స్వీకరిస్తున్న వ్యవసాయశాఖ
నిధులు పెంచాలని రైతుల డిమాండ్
యాంత్రీకరణకు ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించి యూనిట్ల సంఖ్యను పెంచాలని రైతులు, రైతు సంఘాల నాయకులు కోరుతున్నారు. ప్రభుత్వం మొక్కుబడిగానే నిధులు కేటాయించటం సరికాదని పేర్కొన్నారు. ఏడేళ్లుగా యాంత్రీకరణకు నిధులు కేటాయించకపోవటంతో ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజన రైతులు పాత పద్ధతుల్లోనే వ్యవసాయం చేస్తున్నారు. కనీసం ఏజెన్సీ ప్రాంతాలలోనైనా యాంత్రీకరణకు ఎక్కువ నిధులు కేటాయించాలని గిరిజన రైతులు కోరుతున్నారు.