● 48 గంటలకు ముందు దరఖాస్తు
ఎన్నికల సమయంలో అభ్యర్థులు, పార్టీల నాయకులకు ప్రతీ నిమిషం విలువైనదనే చెప్పాలి. ఈమేరకు సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహణ కోసం నిర్ణీత తేదీకి 48గంటల ముందు సువిధ యాప్ ద్వారా పూర్తి వివరాలతో దరఖాస్తు చేసుకోవాలి. ఎక్కడ సభ నిర్వహించనున్నారు, ర్యాలీ అయితే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు సాగుతుంది.. ఎన్నివాహనాలు పాల్గొంటాయి తదితర అంశాలతో సువిధ యాప్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆపై అధికారులు అన్ని వివరాలు పరిశీలించి అనుమతులు జారీ చేస్తారు.
● ఎక్కడికక్కడే అనుమతి
ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లోని అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ మేరకు సువిధ యాప్ ద్వారా అందే దరఖాస్తులను సభ, ర్యాలీ జరిగే ప్రాంతం ఆధారంగా అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు అనుమతి ఇస్తారు.
● మొదటి దరఖాస్తుకే ప్రాధాన్యత
సభలు, సమావేశాల నిర్వహణకు ఒకటి కంటే ఎక్కువ పార్టీల ఒకే మైదానాన్ని ఎంచుకుంటే మొదటి అందిన దరఖాస్తుకే అధికారులు ప్రాధాన్యత ఇస్తారు. గెస్ట్ హౌస్‌ల విషయంలోనూ ఇదే నిబంధన పాటిస్తారు. ఇదిలా ఉండగా గురువారం లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాగా బీజేపీ ఆధ్వర్యాన శుక్రవారం ఖమ్మంలో ర్యాలీ నిర్వహించారు. మిగతా పార్టీల నామినేషన్లు, సభలు మొదలు కానుండడంతో అదే స్థాయిలో సువిధ యాప్ ద్వారా దరఖాస్తుల సంఖ్య పెరుగుతుందని భావిస్తున్నారు.