
ప్రజల శాంతికి ఆటంకం కలిగిస్తే చర్యలు
నరసరావుపేట: జిల్లాలో ప్రజల శాంతికి ఆటంకం కలిగించినా, మద్యం తాగి వాహనాలు నడిపినా కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు హెచ్చరించారు. రైల్వేస్టేషన్, బస్టాండ్లలో ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని అసాంఘిక శక్తులు దాగి ఉండే ప్రదేశాలను ముందుగానే గుర్తించి చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు. పల్నాడు జిల్లావ్యాప్తంగా ఆదివారం పోలీసులు బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, లాడ్జీలు, వాహనాలు, నగర శివారు ప్రాంతాలు, ప్రధాన రహదారులపై విస్తృత తనిఖీలు చేశారు. బీడీ టీమ్, డాగ్ స్క్వాడ్‌లు కూడా పాల్గొన్నాయి. లాడ్జీల్లో పోలీసులు ప్రతి గదిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. బస చేసిన వ్యక్తులను ప్రశ్నించి, వివరాలు ఆరా తీశారు. రిజిస్టర్లను పరిశీలించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనుమానితులను గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని లాడ్జీల నిర్వాహకులకు సూచించారు. లాడ్జి పరిసరాలు స్పష్టంగా కనిపించేలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తులను తనిఖీచేసి వారి గుర్తింపు వివరాలను నమోదు చేశారు. ఖాళీ ప్రదేశాలు, శివారు నగర ప్రాంతాల్లో బహిరంగంగా మద్యం తాగుతున్న వారిపై దాడులు నిర్వహించారు. అనంతరం వాహన తనిఖీలు చేపట్టారు. రహదారి భద్రత నిబంధనలను ఉల్లంఘించిన వాహనదారులపై కేసులు నమోదు చేశారు.
పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు

ప్రజల శాంతికి ఆటంకం కలిగిస్తే చర్యలు