
పేదల ఆస్పత్రిలో ఫీ‘జులుం’!
ఉచిత సేవలు అందించలేరా ?
గుంటూరు మెడికల్: క్యాన్సర్‌ను ప్రాథమిక దశలోనే గుర్తిస్తే ఆధునిక చికిత్సలతో వ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చు. ఏ దశలో ఉంది... శరీరంలో ఏ భాగంలో ఉంది.. ఎంత మేరకు వ్యాప్తి చెందింది.. క్యాన్సర్‌కు సంబంధించిన పూర్తి వివరాలు పెట్ సీటీ స్కానింగ్ పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు. ఈ పరీక్షను ప్రైవేటు క్యాన్సర్ సెంటర్‌లో చేసినందుకు రోగి వద్ద సుమారు రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు ఫీజు తీసుకుంటున్నారు. ఎంతో ఖరీదైన పెట్‌సీటీ పరీక్షను ఉచితంగా అందించాలనే మంచి ఆశయంతో ప్రభుత్వం సుమారు రూ.18 కోట్ల ఖరీదు చేసే పెట్‌సీటీ మెషిన్‌ను గుంటూరు జీజీహెచ్ నాట్కో క్యాన్సర్ సెంటర్‌కు మంజూరు చేసింది. కొద్దిరోజుల్లోనే పెట్‌సీటీ మెషిన్‌ను వినియోగంలోకి తీసుకొచ్చేలా వేగవంతంగా సివిల్, ఎలక్రిక్టల్, ఇతర పనులు జరుగుతున్నాయి. రాష్ట్రంలో ఏ ప్రభుత్వ ఆస్పత్రిలో లేనివిధంగా మొట్టమొదటిసారిగా గుంటూరు జీజీహెచ్ నాట్కో క్యాన్సర్ సెంటర్‌లో పెట్‌సీటీస్కాన్ వైద్య పరికరం అందుబాటులోకి రావటంతో క్యాన్సర్ రోగులు, ముఖ్యంగా పేద, మధ్య తరగతి రోగులు ఎంతో సంతోషపడ్డారు. గతంలో ఈ పరీక్ష కోసం జీజీహెచ్‌లోని క్యాన్సర్ రోగులు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి ఇబ్బందులు పడేవారు. వైద్య పరికరం రాకతో సంతోషపడుతున్న తరుణంలో క్యాన్సర్ రోగులకు పిడుగులాంటి వార్త చెవిని పడింది. శనివారం గుంటూరు జీజీహెచ్‌లో ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశం( హెచ్‌డీఎస్) జరిగింది. జిల్లా జాయింట్ కలెక్టర్ భార్గవతేజ, కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు నసీర్ అహ్మద్, రామాంజనేయులు, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్‌ఎస్‌వీ రమణ, పలువురు హెచ్‌డీఎస్ సభ్యుల సమక్షంలో పెట్ సీటీ చేసేందుకు సుమారు రూ.7వేలు రుసుంగా తీసుకోవాలని నిర్ణయించారు. ఈ నిర్ణయంపై పలువురు రోగులు, సహాయకులు మండిపడుతున్నారు.
రోగులు, సహాయకుల ఆగ్రహం
నాట్కో ట్రస్ట్ వారు ప్రతి ఏడాది సుమారు రూ.కోటి వ్యయం చేసే మందులు ఉచితంగా జీజీహెచ్‌కు వచ్చే క్యాన్సర్ రోగులకు అందిస్తున్నారు. కేంద్ర సహాయమంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ చొరవతో నేడు ఆస్పత్రిలో ఎంతో మంది దాతలు ముందుకొచ్చి కోట్లాది రూపాయలు విరాళాలు అందిస్తూ ఆస్పత్రి అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో క్యాన్సర్ రోగులకు వైద్య పరీక్ష పేరుతో రూ.7వేలు ఫీజు తీసుకోవడం అనేది చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు. ఒక పక్క ప్రాణాలు తీసే క్యాన్సర్‌తో పోరాటం చేస్తూ చికిత్స పొందుతున్న రోగులు ఆర్థిక ఇబ్బంది పడేలా ఫీజులు పెట్టడంపై విమర్శలు వస్తున్నాయి. ప్రజాప్రతినిధులు, అధికారులు క్యాన్సర్ రోగుల శ్రేయస్సు దృష్ట్యా వైద్య పరీక్షకు ఫీజు తీసుకోవాలనే విషయమై పునరాలోచించాలని పలువురు రోగులు కోరుతున్నారు.
పెట్ సీటీ స్కానింగ్‌కు
యూజర్ చార్జీలు
ఒక్కో రోగి వద్ద రూ.7వేలు
వసూలుకు రంగం సిద్ధం
హెచ్‌డీఎస్ సమావేశంలో
యూజర్ చార్జీలకు ఆమోదం
క్యాన్సర్ రోగులపై తీవ్ర భారం
పేదల ఆస్పత్రిలో ఫీజులు పెట్టడంపై
తీవ్ర విమర్శలు
జిల్లాకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, నాట్కో ట్రస్ట్ చైర్మన్ నన్నపనేని వీసీ సుమారు రూ.45 కోట్లతో క్యాన్సర్ రోగులకు కార్పొరేట్ వైద్యసేవలు ఉచితంగా అందించేందుకు నన్నపనేని లోకాదిత్యుడు, సీతారావమ్మ స్మారక నాట్కో క్యాన్సర్ సెంటర్‌ను నిర్మించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 2020 జూలై 1న నాట్కో క్యాన్సర్ సెంటర్‌ను వర్చువల్‌గా ప్రారంభించారు. గతంలో కేవలం రేడియేషన్ ఆంకాలజీ వైద్యసేవలు మాత్రమే గుంటూరు జీజీహెచ్‌లో లభించేవి. నాట్కో క్యాన్సర్ సెంటర్ నిర్మించాక మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, న్యూక్లియర్ మెడిసిన్ వైద్య విభాగాలు రావటంతో పాటుగా వైద్యులు, వైద్య సిబ్బందిని సైతం ప్రభుత్వం నియమించింది. సుమారు రూ.15 కోట్లు ఖరీదు చేసే లీనియర్ యాక్సిలేటర్, రూ.2కోట్లు ఖరీదు చేసే బ్రాకీథెరపీ, రూ.5 కోట్లు ఖరీదు చేసే సీటీ స్టిమ్యూలేటర్ వంటి వైద్య పరికరాలను ప్రభుత్వం నాట్కో క్యాన్సర్ సెంటర్‌కు ఇచ్చింది. దాంటోపాటుగా పెట్ సీటీ పరికరాన్ని సైతం మంజూరు చేసింది. టెండర్ల ప్రక్రియలో జాప్యం జరిగి ఎట్టకేలకు ఏడాదిన్నర తరువాత పెట్ సీటీ వైద్య పరికరం నేడు నాట్కో క్యాన్సర్ సెంటర్‌కు వచ్చింది. వైద్య పరికరం వచ్చిందన్న ఆనందం కన్నా వైద్య పరీక్ష చేయించుకునేందుకు రూ.7వేలు చెల్లించాలని ప్రజాప్రతినిధులు, అధికారులు నిర్ణయం తీసుకున్నారనే బాధే నేడు ఎక్కువ మంది రోగుల్లో నెలకొంది.