వ్యక్తి అదృశ్యం
పీలేరు : పీలేరు పట్టణం తిరుపతి రోడ్డు కృష్ణానగర్‌కు చెందిన దేవులపల్లె భాస్కర్‌రెడ్డి (73) గత నెల 24న ఇంటి నుంచి వెళ్లి అదృశ్యమయ్యాడు. బంధువుల ఇళ్లవద్ద గాలించినా ఆచూకీ లభించలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు పోలీస్ స్టేషన్‌లో సమాచారం ఇవ్వాలని కోరారు.
విద్యాలక్ష్మీ పోర్టల్‌లో
సులువుగా విద్యా రుణాలు
కురబలకోట : విద్యా లక్ష్మీ పోర్టల్ ద్వారా సులువుగా విద్యా రుణాలు లభిస్తాయని స్థానిక ఎస్‌బీఐ బ్రాంచ్ మేనేజర్ రుస్తుం ఖాన్ అన్నారు. మంగళవారం అంగళ్లు మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీలో విద్యా రుణాలపై జరిగిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రూ. 7.5 లక్షల వరకు ఎలాంటి గిరవు లేకుండా విద్యా రుణాలకు అవకాశం ఉందన్నారు. విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులు లేకుండా చదువును కొనసాగించవచ్చన్నారు.
ట్రాక్టర్ ఢీకొని వ్యక్తికి
తీవ్ర గాయాలు
మదనపల్లె రూరల్ : ట్రాక్టర్ ఢీకొని వ్యక్తి తీవ్రంగా గాయపడిన ఘటన మంగళవారం ములకలచెరువు మండలంలో జరిగింది. సత్యసాయిజిల్లా తనకల్లు మండలం ఈతవడ్డు గ్రామానికి చెందిన వెంకటసుబ్బారెడ్డి కుమారుడు రమణారెడ్డి(50) వ్యక్తిగత పనులపై మరో వ్యక్తితో కలిసి ద్విచక్రవాహనంలో ములకలచెరువుకు వచ్చాడు. పనులు ముగించుకుని తిరిగి మదనపల్లెకు బయలుదేరుతుండగా, ట్రాక్టర్ రివర్స్‌లో వస్తూ బైక్‌ను ఢీకొంది. ప్రమాదంలో రమణారెడ్డి తీవ్రంగా గాయపడగా, గమనించిన స్థానికులు మదనపల్లె ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అత్యవసర విభాగంలో చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించారు. ములకలచెరువు పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.
పిలుగుంట్ర రాళ్ల గుట్ట ఆక్రమణ
గాలివీడు : గరుగుపల్లి గ్రామ పరిధిలోని పిలుగుంట్ర రాళ్లగుట్ట వద్ద ప్రభుత్వ భూమిని కొందరు బడాబాబులు ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారని స్థానిక రైతులు ఆరోపించారు. ఈ మేరకు మంగళవారం రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్వే నంబర్ 696లో 3.80 ఎకరాలు, సర్వే నంబర్ 697లో 5.44 ఎకరాల ప్రభుత్వ భూమిని దశాబ్దాలుగా పశువుల మేత కోసం వినియోగించుకుంటున్నామని రైతులు వెల్లడించారు. అయితే ఇటీవల కొందరు ఆర్థిక, అంగబలం కలిగిన ఆక్రమణదారులు ఆ భూమిపై కన్నేశారన్నారు. స్థలాన్ని చదును చేస్తూ తమ ఆధీనంలోకి తీసుకునేందుకు ప్రయత్నించారని రైతులు పేర్కొన్నారు. దీంతో స్థానిక రైతులు ఆక్రమణను వెంటనే అడ్డుకోవాలంటూ సంబంధిత అధికారులకు విజ్ఞప్తి చేశారు.
వ్యక్తి అదృశ్యం
వ్యక్తి అదృశ్యం


