వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు మహిళల ఆత్మహత్యాయత్నం
మదనపల్లె రూరల్ : వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు మహిళలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. పీటీయం మండలం ఎగువపల్లెకు చెందిన ఈశ్వరమ్మ(45) భర్త నరసింహులుతో కలిసి మదనపల్లె పట్టణం గౌతమీనగర్‌లో నివాసం ఉంటోంది. మంగళవారం పక్కింటివారితో గొడవ జరగడంతో వారు ఈశ్వరమ్మను నిందించడంతో పాటు దాడికి యత్నించారు. దీంతో మనస్తాపం చెందిన ఆమె ఇంటివద్ద విషపు గుళికలు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. అదేవిధంగా పీటీయం మండలం మల్లెలకు చెందిన భవాని(27) కుటుంబ సమస్యలతో పురుగుల మందు తాగింది. ఆయా ఘటనల్లో గమనించిన కుటుంబ సభ్యులు బాధితులను వెంటనే మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. సంబంధిత పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.
జూదరుల అరెస్టు
నిమ్మనపల్లె : జూదం ఆడుతున్న ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు ఎస్‌ఐ తిప్పేస్వామి తెలిపారు. మంగళవారం మండలంలోని రెడ్డివారిపల్లె పంచాయతీ పిట్టావాండ్లపల్లె సమీపంలో జూదం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో సిబ్బందితో కలిసి దాడి చేశామన్నారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి మూడు మొబైల్‌ఫోన్లు, రూ.3,750 నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులపై కేసు నమోదుచేసి కోర్టుకు హాజరుపరిచామన్నారు.
బి.కొత్తకోట : పేకాట జూదం ఆడుతున్న వారిని మంగళవారం అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. మండలంలోని శీతివారిపల్లె వద్ద నిర్వహించిన దాడుల్లో ఐదుగురిని అరెస్ట్ చేసి, వారి నుంచి రూ.13 వేలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
వివాహిత అదృశ్యం
ప్రొద్దుటూరు క్రైం : ప్రొద్దుటూరులోని ఈశ్వర్‌రెడ్డినగర్‌కు చెందిన సాయిరూప అనే వివాహిత కనిపించలేదని ఆమె భర్త వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..మధుసూదన్ స్థానిక హనుమాన్‌నగర్‌కు చెందిన సాయిరూపలు 8 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. ెపెళ్లయి 8 ఏళ్లయినా వారికి పిల్లలు పుట్టలేదు. ఆస్పత్రిలో చూపించగా ఆమెకు థైరాయిడ్ ఉందని వైద్యులు తెలిపారు. పెళ్లయి ఏళ్లు గడచినా పిల్లలు పుట్టలేదని సాయిరూప తరచూ బాధపడుతూ ఉండేది. ఈ క్రమంలో సోమవారం ఉదయం నుంచి ఆమె కనిపించలేదు. వారి ఇంటి బయట ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించగా రాత్రి ఆమె బ్యాగు తీసుకొని ఇంటి నుంచి వెళ్లినట్లు కనిపిస్తోంది. దీంతో మధుసూదన్ పట్టణంలోను, బంధువుల ఊళ్లలో ఆమె కోసం గాలించినా ఆచూకి తెలియలేదు. ఈ మేరకు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.


