కౌశల్ పోటీల్లో ప్రతిభ
రాయచోటి జగదాంబసెంటర్ : భారతీయ విజ్ఞాన మండలి, ఆంధ్రప్రదేశ్, ఏపీసీఓఎస్‌టీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన కౌశల్–2025 ప్రతిభా అన్వేషణ పోటీల్లో అన్నమయ్య జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 12 మంది విద్యార్థులు రాష్ట్ర స్థాయికి ఎంపికై నట్లు కౌశల్ జిల్లా కోఆర్డినేటర్ మధుమతి, జిల్లా జాయింట్ కోఆర్డినేటర్ వెంకటరమణ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా స్థాయిలో నిర్వహించిన ఆన్‌లైన్ పోటీలలో జిల్లా విద్యార్థులు ప్రతిభ చాటి రాష్ట్ర స్థాయికి ఎంపికై నట్లు వారు పేర్కొన్నారు. 8వ తరగతిలో బి.రెడ్డిప్రసన్న (జెడ్పీహెచ్‌ఎస్ రెడ్డివారిపల్లి), కె.వెన్నెల (జెడ్పీహెచ్‌ఎస్ బీపీ రాచపల్లి), కె.గౌరీప్రియ (జెడ్పీహెచ్‌ఎస్ గట్టు), ఎం.గోపిక (ఎస్‌జేఎస్‌ఎం జెడ్పీహెచ్‌ఎస్ బోయనపల్లి), 9వ తరగతిలో పి.ప్రసన్న, జి.మునిచందు (ఎంజేపీఏపీ బీసీ వెల్ఫేర్ స్కూల్ ఫర్ గర్ల్స్, పీలేరు), ఎ.హర్షిత (జెడ్పీహెచ్‌ఎస్ బీపీ రాచపల్లి), సౌమ్య (జెడ్పీహెచ్ బాలికల, రాజంపేట), 10వ తరగతిలో ఎన్.సుష్మతేజ (జెడ్పీహెచ్‌ఎస్ మాసాపేట, రాయచోటి), ఎల్.అల్మాస్ (జెడ్పీహెచ్‌ఎస్ కురబలకోట), టి.భవ్యశ్రీ (ఎంజేపీఏపీబీసీడబ్ల్యూఆర్ స్కూల్ (గర్ల్స్) కలికిరి), వి.నిఖిత (జెడ్పీహెచ్‌ఎస్ గర్ల్స్ రాయచోటి)లు ఎంపికై నట్లు వివరించారు.
అన్నమయ్య కాలిబాట మీదుగా ప్రయాణించరాదు
రైల్వేకోడూరు : అన్నమయ్య కాలిబాట ద్వారా తిరుమలకు వెళ్లే భక్తులకు రైల్వేకోడూరు మండలం కుక్కలదొడ్డి గ్రామం నుంచి అనుమతి నిరాకరిస్తున్నట్లు అన్నమయ్య జిల్లా అటవీశాఖ అధికారి ఆర్.జగన్నాథ సింగ్ తెలిపారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. ఈ అటవీ మార్గంలో అడవి జంతువులైన ఏనుగుల గుంపు అధికంగా ఉందని, దానివల్ల ప్రజలకు ప్రమాదం ఉందని ఆయన పేర్కొన్నారు. గతంలో ఏనుగుల దాడిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజా శ్రేయస్సు కోసం ఈ మార్గం ద్వారా తిరుమలకు వెళ్లే భక్తులకు అనుమతి నిరాకరించడం జరిగిందని తెలిపారు. కావున భక్తులు రోడ్డు వెంట తిరుమలకు వెళ్లాలని సూచించారు.
ఇండోర్ స్టేడియానికి
భూమి కేటాయింపు
రాయచోటి టౌన్ : అన్నమయ్య జిల్లా కేంద్రంలో రాయచోటి – మదనపల్లె రోడ్డులో ఇండోర్ స్టేడియం కోసం మూడు ఎకరాల భూమి కేటాయించినట్లు రాష్ట్ర క్రీడల, యువజన, రవాణశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు. మంగళవారం రాయచోటిలోని తన క్యాంప్ కార్యాలయంలో ఆయన జిల్లా క్రీడాభివృద్ధి అధికారి జి.చంద్రశేఖర్‌తో చర్చించారు. అనంతరం వారు మాట్లాడుతూ క్రీడల అభివృద్ధి కోసం స్థానికంగా ఉన్న పరిమిత సదుపాయాలు, అవసరాలు, అభివృద్ధి ప్రతిపాదనలపై సమగ్రంగా చర్చించినట్లు తెలిపారు. డీఎస్‌ఏ క్రికెట్ గ్రౌండ్, ఇండోర్ సదుపాయాలు, రన్నింగ్ ట్రాక్, ఇతర క్రీడా ప్రాంగణాలను అభివృద్ధి పరిచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అలాగే డీఎస్‌ఏలో ఖాళీగా ఉన్న కోచ్ పోస్టులు, కార్యాలయ సిబ్బంది, నిధుల కొరత వంటి అంశాలపై చర్చించినట్లు పేర్కొన్నారు.
రాయచోటి జగదాంబసెంటర్ : రాయచోటి పట్టణంలోని శ్రీ సాయి ఇంజినీరింగ్ కళాశాలలో మెప్మా ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించే మెగా జాబ్‌మేళాను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర రవాణా, క్రీడా, యువజన శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు. మంగళవారం రాయచోటిలోని తన క్యాంప్ కార్యాలయంలో ఆయన పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మెప్మా ఆధ్వర్యంలో తొలిసారిగా మహిళా సంఘా ల సభ్యుల పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకు ని ప్రభుత్వం ఒక కుటుంబం.. ఒక పారిశ్రామికవేత్తగా తయారు చేయడంలో భాగంగా మెప్మా సంస్థ ‘నిపుణ’ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నదని తెలిపారు. పలు కంపెనీల ప్రతినిధుల సమక్షంలో జాబ్‌మేళా నిర్వహించడం జరుగుతుందన్నారు. మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ లక్ష్మీదేవి, మెప్మా అధికారి అబ్బాస్‌ఆలీఖాన్, మెప్మా సిబ్బంది, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
కౌశల్ పోటీల్లో ప్రతిభ


