వీడని వర్షం
సాక్షి రాయచోటి : ఈ ఏడాది ఎప్పుడు చూసినా అన్నమయ్య జిల్లాను వర్షాలు వెంటాడుతున్నాయి. అది కూడా మంచి సీజన్‌లో రైతులకు అవసరమైన సమయంలో అనుకుంటే కాదు.. పంటలను దెబ్బతీయడానికో.. రోడ్లు కోసుకుపోవడానికో.. విద్యుత్ స్తంభాలు పడిపోవడానికి తప్ప ఉపయోగపడటం లేదు. ఏదో ఒక తుపాను నేపథ్యంతో సుమారు నెల రోజులుగా మబ్బులు కమ్ముతూనే ఉన్నాయి. ముసురు తప్పుకోవడం లేదు. తుంపెర వర్షాలు ఆగడం లేదు. దీంతో జిల్లా ప్రజలు చలి ప్రభావంతో వణికిపోతున్నారు. దిత్వా తుపాను ప్రభావంతో మూడు రోజులుగా తుంపెర వర్షాలు వెంటాడుతున్నాయి.
ఆకాశం మేఘావృతం
జిల్లాలో దిత్వా తుపాను ప్రభావంతో ఆకాశం మేఘావృతమై కనిపిస్తోంది. సుమారు మూడు, నాలుగు రోజులుగా సూర్య భగవానుడి కాంతి కనిపించడం లేదు. ఉదయం నుంచి రాత్రి వరకు ఆకాశం పూర్తిగా నల్లమబ్బులతో కమ్ముకుని ఉండగా, చుట్టూ కొండ ప్రాంతాల్లో పొగమంచు అలుముకుంటోంది. ఆకాశం మేఘావృతమై ఉండటంతో భారీ వర్షం కురుస్తుందేమోనని ఆశించినా ఇప్పటి వరకు పడలేదు.
చిరు వ్యాపారులకు ఇక్కట్లు
అన్నమయ్య జిల్లాలో దిత్వా తుపానుతో తుంపెర వర్షం పడుతూనే ఉంది. జిల్లా కేంద్రమైన రాయచోటి మొదలుకొని మదనపల్లె, తంబళ్లపల్లె, పీలేరు, రైల్వేకోడూరు, రాజంపేటలలో తుంపెర వర్షం పడుతుండడంతో జనజీవనానికి ఇబ్బందిగా మారింది. కొద్దిసేపు తెరిపి ఇవ్వడం, మళ్లీ తుంపెర పడుతుండటంతో జనాలు గొడుగుల సాయంతో తిరుగుతూ కనిపించారు. రోడ్లు కూడా తుంపెర ధాటికి చిత్తడిగా మారాయి. మూడు, నాలుగు రోజులుగా తుంపెర వర్షం పడుతుండటంతో తోపుడు బండ్లు, ఫుట్‌పాత్‌లపై చిరు వ్యాపారాలు చేసుకునే వారికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
‘ముసురు’ రైతుల్లో ఆందోళన
జిల్లాలో తుపానుల నేపథ్యంలో ముసురు వాతావరణం కనిపిస్తోంది. ఇలా పొగమంచుతో కూడిన వాతావరణం పంటలను దెబ్బతీస్తోందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే గతంలో కురిసిన వర్షాలకు మామిడి లాంటి పంటలకు ఇప్పటికిప్పుడు పూత వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. మరోపక్క ఎక్కడైనా అరకొరగా వచ్చిన పూత కూడా ప్రస్తుత వాతావరణంతో రాలిపోతుందోనన్న ఆందోళన నెలకొంది. టమాట పంటకు సంబంధించి కూడా కాయలపై మచ్చలు ఏర్పడుతున్నాయి. అంతేకాకుండా పెసర, వరి, ధనియాలు తదితర పంటలకు కూడా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే బొప్పాయికి సంబంధించి చాలా వరకు తోటల్లోనే కాయలు కుళ్లిపోతున్నాయి. ఏది ఏమైనా తుపాన్లు రైతన్నను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి.
జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న
‘దిత్వా’ ప్రభావం
పలు ప్రాంతాల్లో తుంపెర్లతో కూడిన వాన
వరుస తుపానులతో పంటలకు కష్టకాలం
జనజీవనానికి తప్పని ఇబ్బందులు


