వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చాలి
రాయచోటి : వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి, లాభసాటిగా మార్చేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో జేసీ ఆదర్శ రాజేంద్రన్‌తో కలిసి వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా కలెక్టర్ సమీక్షించారు. ఈ సమీక్షలో ప్రైమరీ సెక్టార్, జిల్లా వ్యవసాయ, జిల్లా ఉద్యానశాఖ, సిరి కల్చర్, ఏపీఎంఐపీ పీడీ, పశుసంవర్ధక, మత్స్య శాఖ, సహకార శాఖ, మార్కెటింగ్, డీఆర్‌డీఏ, మార్క్‌ఫెడ్ డీఎం, ప్రైమరీ సెక్టార్ల అధికారులు, మండల వ్యవసాయ అధికారులు, విలేజ్ అగ్రికల్చర్, హార్టికల్చర్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో 271 రైతు సేవా కేంద్రాలలో ఈ నెల 3న నిర్వహించే రైతన్న మీకోసం కార్యక్రమంలో వ్యవసాయ అనుబంధ శాఖల సిబ్బంది పాల్గొనాలని పేర్కొన్నారు. ఈ వర్క్‌షాప్‌లో రబీ, ఖరీప్ పంటల యాక్షన్ ప్లాన్, వివిధ రకాల అంశాలపై రైతులతో సలహాలు, సూచనలు తీసుకొని విజయవంతం చేయాలని తెలిపారు. రైతుల ఆదాయం పెంపు లక్ష్యంతో ప్రభుత్వం చేపడుతున్న పథకాలు, సాంకేతిక పద్ధతులు, ఆధునిక సాగు విధానాలు గ్రామ గ్రామానికి చేరేలా అవగాహన కార్యక్రమాలు అత్యంత అవసరమన్నారు. రైతులు ఆధునిక పద్ధతులను అనుసరించడం ద్వారా ఖర్చులు తగ్గించి, ఆదాయాన్ని పెంచుకునే అవకాశాలపై లోతుగా చర్చించి నివేదికలను తయారు చేసి ప్రభుత్వానికి పంపాలన్నారు. వీడియో కాన్ఫిరెన్స్‌లో జిల్లా వ్యవసాయశాఖ అధికారి జి.శివనారాయణ, ఉద్యానశాఖ అధికారిణి సుభాషిణి, సిరికల్చర్ ఏపీఎంఐపీ, పశుసంవర్ధకశాఖ, మత్స్యశాఖ, సహకార శాఖ, మార్కెటింగ్, డీఆర్‌డీఏ మార్క్‌ఫెడ్ అధికారులు పాల్గొన్నారు.


