మరో ట్రావెల్స్ బస్సుకు ప్రమాదం
● డివైడర్‌ను ఢీకొని పల్టీలు
● మహిళ మృతి, 10 మందికి గాయాలు
● బద్వేలు నుంచి బెంగళూరుకు వెళ్తున్న బస్సు
● కోలారు జిల్లాలో ఘటన
శ్రీనివాసపురం/మదనపల్లె రూరల్ : నిత్యం ఏదో ఒకచోట ప్రైవేటు బస్సులు ప్రమాదాలకు గురవుతూ ప్రయాణికులకు దడ పుట్టిస్తున్నాయి. ట్రావెల్స్ స్లీపర్ కోచ్ బస్సు ప్రమాదంలో మహిళ చనిపోయిన ఘటన కర్ణాటక– ఏపీ సరిహద్దుల్లో కోలారు జిల్లా శ్రీనివాసపురం తాలూకాలోని మంచినీళ్లకోట గ్రామం వద్ద మంగళవారం తెల్లవారుజాము 3 గంటల సమయంలో జరిగింది. కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన అనిత (58) బద్వేలు నుంచి బెంగళూరుకు బయలుదేరిన హరిత ట్రావెల్స్ బస్సులో ఎక్కింది. బస్సు మంచినీళ్లకోట గ్రామం వద్ద రోడ్డు డివైడర్‌ను ఢీకొని బోల్తా పడింది. ఈ ప్రమాదంలో అనిత అనే ప్రయాణికురాలు అక్కడికక్కడే మరణించగా, 10 మందికిపైగా ప్రయాణికులకు గాయాలయ్యాయి. వారి ఆర్తనాదాలతో అక్కడ హృదయ విదారక వాతావరణం నెలకొంది. బాధితులను శ్రీనివాసపురం, మదనపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కడపకు చెందిన ఫయాజ్(27), జునైద్(28), అట్లయ్య(26), అట్లూరు గ్రామానికి చెందిన నరసింహులు(29) మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి వచ్చి చికిత్స పొందారు. . ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో ఉంచారు ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులున్నారు. బస్సు ముందు భాగం బాగా ధ్వంసం కావడం ప్రమాద తీవ్రతకు అద్దం పడుతోంది.
అదుపులో డ్రైవర్..
రాయల్పాడు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. రోడ్డుకు అడ్డంగా పడి ఉన్న బస్సును జేసీబీతో తొలగించారు. బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. నిద్రమత్తు, నిర్లక్ష్యంగా నడపడమే కారణమని అనుమానాలున్నాయి.
మరో ట్రావెల్స్ బస్సుకు ప్రమాదం


