అక్రమ కేసులకు భయపడేది లేదు
ములకలచెరువు : వైఎస్సార్‌సీపీ వారిపై బనాయించే అక్రమ కేసులు నిలబడవని, వాటికి భయపడేది లేదని తంబళ్లపల్లె వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్‌రెడ్డి అన్నారు. మంగళవారం తంబళ్లపల్లె కోర్టు బయట విలేరులతో మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వంలో నకిలీ మద్యం దందా నడుస్తోందని నిలదీసిన జోగి రమేష్‌పై కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రభుత్వాన్ని నిలదీశారు. నకిలీ మద్యం కేసును సీబీఐ విచారణకు ఇవ్వాలని వైఎస్సార్‌సీపీ కోరగా నిజాలు బయటపడతాయని భయపడిన చంద్రబాబు ప్రభుత్వం సిట్ వేసి కేసును నీరుగార్చిందన్నారు. వైఎస్సార్‌సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇలాంటి అక్రమ కేసులకు భయపడేది లేదని తేల్చిచెప్పారు. నకిలీ మద్యం కేసులో టీడీపీ వారిని తప్పించడానికే వైఎస్సార్‌సీపీ మాజీ మంత్రి జోగి రమేష్, అతని తమ్ముడు జోగి రాములపై కేసులు పెట్టారన్నారు. నిందితుడు జనార్దన్‌రావుకు, జోగి రమేష్‌కు ఎలాంటి సంబంధాలు లేవని, నిందితుడితో జోగి రమేష్ పేరు ప్రభుత్వమే చెప్పించిందని ఆరోపించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సొంత గడ్డ చంద్రగిరిలో ఎప్పుడైనా గెలుపొందారా అని ప్రశ్నించారు. అప్పట్లో దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పుణ్యమా అని గెలిచావు అన్నారు.
నకిలీ మద్యం కేసును సీబీఐకి ఇచ్చే దమ్ముందా..
నకిలీ మద్యం నడిపింది టీడీపీ నాయకులైతే కేసును ఎత్తి చూపించిన వైఎస్సార్‌సీపీ మాజీ మంత్రి జోగి రమేష, అతని తమ్ముడు జోగి రాములను కేసులో చేర్చడం ప్రభుత్వం చేతగానితనమే అని మదనపల్లి వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ అన్నారు. నకిలీ మద్యం కేసును సీబీఐకి అప్పగించే దమ్ము కూటమి ప్రభుత్వానికి ఉందా అంటూ సవాల్ విసిరారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న టీడీపీ తంబళ్లపల్లె ఇన్‌చార్జి దాసరపల్లి జయచంద్రారెడ్డి, అతని బావమర్ది మంత్రి గిరిధర్‌రెడ్డి, పీఏ రాజేష్, వ్యక్తిగత అకౌంటెంట్ అనుబురాజులను తప్పించడానికే జోగి రమేష్‌లపై కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి చేతకాని ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెబుతారన్నారు.
తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్‌రెడ్డి


