బతకాలనే ఆశ ఉంది.. అధిక వడ్డీలు చెల్లించలేక చనిపోతున్నా! | - | Sakshi
Sakshi News home page

బతకాలనే ఆశ ఉంది.. అధిక వడ్డీలు చెల్లించలేక చనిపోతున్నా!

Jul 3 2025 5:16 AM | Updated on Jul 3 2025 5:16 AM

బతకాలనే ఆశ ఉంది.. అధిక వడ్డీలు చెల్లించలేక చనిపోతున్నా!

బతకాలనే ఆశ ఉంది.. అధిక వడ్డీలు చెల్లించలేక చనిపోతున్నా!

మదనపల్లె రూరల్‌ : ‘సమాజంలో గౌరవంగా బతకాలని చాలా కోరికగా ఉంది. అప్పుల వాళ్లు ప్రాణం తీసేస్తున్నారు. గంట గంటకు టెన్షన్‌. నిద్రపోయి చాలా రోజులైంది. ఆరోగ్యం బాగోలేదు. దేనికీ పనికి రాకుండా అయిపోయాను. వడ్డీలకు వడ్డీలు, అధిక వడ్డీలు కట్టలేకపోతున్నాను. అందరి దగ్గర నీచమైన మాటలు అనిపించుకుంటున్నాను. విధిలేని పరిస్థితుల్లో చచ్చిపోతున్నా’... భార్య, బిడ్డ నన్ను క్షమించండంటూ రియల్టర్‌ రాజేంద్రబాబు చివరిగా సెల్‌ఫోన్‌లో సెల్ఫీ సూసైడ్‌ వీడియో తీసుకుని తనువు చాలించాడు. మదనపల్లెలో కొద్దిరోజుల క్రితం వెలుగుచూసిన కాల్‌మనీ వ్యవహారం సద్దుమణగక ముందే పట్టణానికి చెందిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి అప్పులబాధ తాళలేక, అధిక వడ్డీలు చెల్లించలేక ఆత్మహత్యకు పాల్పడటం సంచలనం కలిగించింది. పట్టణంలోని అమ్మినేనివీధికి చెందిన బొజ్జ రాజేంద్ర(55) రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తుంటాడు. ఇతనికి అమ్మినేనివీధి, కృష్ణానగర్‌లో రెండు సొంత ఇళ్లు ఉన్నాయి. కృష్ణానగర్‌లోని ఇంటి కింది భాగంలో రెండు వార్డు సచివాలయాలకు అద్దెకు ఇచ్చి, పై భాగంలోని ఇంటిలో రియల్‌ ఎస్టేట్‌ ఆఫీసు నిర్వహిస్తున్నాడు. వ్యాపార లావాదేవీల్లో భాగంగా పట్టణానికి చెందిన పలువురి వద్ద అప్పులు తీసుకున్నాడు. ఇటీవల కొంతకాలంగా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కుదేలవడం, వ్యాపార లావాదేవీలు పూర్తిగా స్తంభించడంతో అప్పుల వాళ్లకు చెల్లింపులు చేయలేకపోయాడు. పరువు, ప్రతిష్టలు కాపాడుకునేందుకు వడ్డీలు చెల్లించేందుకు అధిక వడ్డీకి కొత్త అప్పులు తీసుకోవడం, వాటికి వడ్డీలు చెల్లించలేక, ఇచ్చిన వారు ఇంటివద్దకు వచ్చి నిలదీస్తుంటే తట్టుకోలేకపోయాడు. బజారులో అందరి ముందు తక్కువచేసి మాట్లాడటం, తన గురించి చెడు ప్రచారం చేస్తుండటంతో విధిలేని పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. గతంలోనూ ఆత్మహత్యకు ప్రయత్నించి, చివరి నిమిషంలో ప్రాణాలు దక్కించుకున్నాడు. ఆ తర్వాత కొద్ది రోజులు బాగానే ఉన్నప్పటికీ, ఇటీవల అప్పుల వాళ్ల వేధింపులు అధికమయ్యాయి. బుధవారం మధ్యాహ్నం కృష్ణానగర్‌లోని కార్యాలయంలో సెల్ఫీ సూసైడ్‌ వీడియో తీసుకున్న తర్వాత రూములోని ఫ్యాన్‌ కొక్కీకి తాడు తగిలించి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులు, పోలీసులకు సమాచారం అందించారు. టూటౌన్‌ పోలీసులు ఘట నాస్థలానికి చేరుకుని, మృతుడి సెల్‌ఫోన్‌ స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. బొజ్జా రాజేంద్రకు భార్య లత, ఇంటర్మీడియట్‌ చదువుతున్న కుమార్తె రిషిత ఉన్నారు.

అధికమవుతున్న వడ్డీ వ్యాపారుల వేధింపులు..

పట్టణంలో మధ్యతరగతి, బడుగు, బలహీనవర్గాలకు చెందిన వ్యక్తులు అధికంగా ఉన్నారు. వీరి ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకున్న వడ్డీ వ్యాపారులు, డైలీ, వీక్లీ, మంత్లీ పద్ధతుల్లో 100 కి రూ.10 నుంచి 45 వరకు వసూలు చేస్తూ ఇష్టారాజ్యంగా దోచుకుంటున్నారు. చివరకు మహిళలను శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురిచేసే స్థితికి వచ్చారు. వడ్డీ వ్యాపారుల ఆగడాలపై బాధిత మహిళల ఆవేదనను...అప్పు తీర్చేందుకు వ్యభిచారం చేయమంటున్నారంటూ మీడియా వెలుగులోకి తెచ్చినా పోలీసులు పట్టించుకోకపోవడంపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి.

సెల్ఫీ సూసైడ్‌ వీడియోలో

రియల్టర్‌ రాజేంద్ర

అప్పుల భారం అధికమై

ఆత్మహత్య

మదనపల్లెలో అధికమవుతున్న

కాల్‌ విష నాగులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement