
విద్యుత్ షాక్‌తో కార్మికుడికి తీవ్ర గాయాలు
మదనపల్లె రూరల్ : విద్యుత్ పోల్ మరమ్మతులకు వెళ్లిన కాంట్రాక్ట్ కార్మికుడు విద్యుత్ షాక్‌కు గురై తీవ్రంగా గాయపడి పరిస్థితి విషమంగా మారిన సంఘటన బుధవారం పట్టణంలో జరిగింది. బుధవారం ఉదయం ఎన్‌టీఆర్ సర్కిల్‌లోని విద్యుత్ పోల్‌ను టిప్పర్ ఢీకొంది. ప్రమాదంలో స్తంభం పూర్తిగా పక్కకు ఒరిగిపోయింది. దీంతో మరమ్మతుల నిమిత్తం విద్యుత్‌శాఖ అధికారులు, కాంట్రాక్టర్ రిటైర్డ్ విద్యుత్‌శాఖ ఏడీ నరసింహకు బాధ్యతలు అప్పగించారు. ఆయన తన వద్ద పనిచేసే నిమ్మనపల్లె మండలం తవళం పంచాయతీ ఉంటావారిపల్లెకు చెందిన రామప్ప కుమారుడు వెంకటరమణ(35)కు పనులు పురమాయించారు. దీంతో వెంకటరమణ విద్యుత్ పోల్ మరమ్మతుల కోసం పైకి ఎక్కి పనిచేస్తుండగా, ఆపైన ఉన్న విద్యుత్ వైర్లు ప్రమాదవశాత్తు తగిలి షాక్‌కు గురయ్యాడు. కింద పడే క్రమంలో మధ్యలో ఉన్న వైర్లపై పడి వేలాడుతూ అపస్మారక స్థితికి చేరుకున్నాడు. దీంతో హుటాహుటిన అక్కడకు చేరుకున్న విద్యుత్ సిబ్బంది, సరఫరా నిలిపివేసి, స్థానికుల సహాయంతో గాయపడిన వ్యక్తిని కిందకు దించి ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి రెఫర్ చేశారు. అయితే, ఈ ఘటనలో విద్యుత్‌శాఖ అధికారులు, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. పోల్ మరమ్మతులు చేసే సమయంలో విద్యుత్ సరఫరా లేకుండా చూడటంతో పాటు లైన్‌మెన్ పర్యవేక్షణలో చేయాల్సిన పనులను ఎవరూ లేకుండా నిర్వహించడంపై బాధితుడి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ షాక్‌కు గురై తీవ్రగాయాలతో పడి ఉన్న బాధితుడిని కిందకు దించి ప్రభుత్వ ఆస్పత్రికి పంపి చేతులు దులుపుకున్నారన్నారు. బాధితుడి పరిస్థితిపై చలించిన బహుజన యువసేన అధ్యక్షుడు పునీత్, సీపీఎం జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు ఆస్పత్రికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. విద్యుత్ అధికారులు, కాంట్రాక్టర్‌కు ఫోన్ చేస్తే సమాధానం రాలేదు.