
మొహర్రం ఉత్సవాలకు సర్వం సిద్ధం
చిన్నమండెం: మొహర్రం ఉత్సవాల నిర్వహణకు చిన్నమండెంలో సర్వం సిద్ధం చేశారు. ఉత్సవాల్లో కీలక ఘట్టమైన అగ్నిగుండ ప్రవేశం కార్యక్రమం శనివారం జరగనుంది. ఇందుకు సంబంధించి నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. కడప పెద్ద దర్గా పీఠాధిపతి ఆరీఫుల్లాహుస్సేనీ పాల్గొనే ఈ కార్యక్రమానికి పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
మార్గదర్శకుల ఎంపిక పూర్తిచేయాలి: కలెక్టర్
రాయచోటి: పేదరికం నిర్మూలనకు పీ–4 సర్వే ద్వారా మండలాల వారీగా గుర్తించిన బంగారు కుటుంబాలను ఆదుకునేందుకు మార్గదర్శకుల ఎంపిక పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం విజయవాడలోని రాష్ట్ర సచివాలయం నుంచి పి–4పై జిల్లా కలెక్టర్లు, మంత్రులు ఎమ్మెల్యేలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు సమావేశం నిర్వహించి తీసుకోవాల్సిన చర్యలపై దిశా నిర్దేశం చేశారు. రాయచోటి కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫిరెన్సు హాల్ నుంచి వీడియో కాన్ఫిరెన్సులో పాల్గొన్న జిల్లా కలెక్టర్ శ్రీధర్ ఛామకూరి, జేసీ ఆదర్శ రాజేంద్రన్ తదితరులు పాల్గొన్నారు. వీసీ అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో దాదాపు 66వేల బంగారు కుటుంబాలను గుర్తించామన్నారు. వీరికి మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించడమే పి–4 లక్ష్యమన్నారు.