
శాస్త్రోక్తంగా సౌమ్యనాథుడి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
నందలూరు: నందలూరులోని సౌమ్యనాథ స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలకు శుక్రవారం సాయంత్రం అంకురార్పణ చేపట్టారు. ముందుగా సాయంత్రం 6 గంటల నుంచి పుణ్యాహవచనం, మృత్సంగ్రహణం, సేనాధిపతి ఉత్సవం అనంతరం శాస్త్రోక్తంగా బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ నిర్వహించారు. అర్చకులు నవధాన్యాలు, కలశస్థాపనలు, పూర్ణకుంభ ప్రతిష్ట, పుణ్యాహవచనా బియ్యం, నెయ్యి, బెల్లం, టెంకాయలు, తమలపాకులు సమకూర్చారు.పాంచరాత్ర ఆగమ పండితుల బృందంతో కలశస్థాపన చేసి హోమం నిర్వహించారు. ఆగ్నేయమూలలో వెలసి ఉన్న పుట్ట వద్ద పూజలు జరిపారు. పుట్టమన్ను సేకరించి అంకురార్పణ మంటపంలో ఏర్పాటు చేసిన 12 పాలికలలో ఉంచారు. అందులో నవధాన్యాలు చల్లి అంకురింప చేసే కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉదయం మూలవర్లు, ఉత్సవర్లకు తిరుమంజనం కార్యక్రమం జరిపారు. కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ హనుమంతయ్య, ఇన్‌స్పెక్టర్ దిలీప్‌కుమార్, భక్తులు పాల్గొన్నారు.
బ్రహ్మోత్సవాల్లో నేడు: బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం ధ్వజారోహణం, రాత్రికి యాళి వాహనంపై స్వామివారి గ్రామోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ ఇన్‌స్పెక్టర్ దిలీప్‌కుమార్ తెలిపారు.

శాస్త్రోక్తంగా సౌమ్యనాథుడి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ