
హామీలు అమలు చేయిద్దాం
ప్రభుత్వం మెడలు వంచుదాం..
● ఎన్నికల ప్రణాళిక అమల్లోకూటమి ప్రభుత్వం విఫలం
● బాబుష్యూరిటీ–మోసం గ్యారెంటీపై ఇంటింటా ప్రచారం
● రాజంపేట పార్లమెంట్ పరిశీలకుడు, కడప మేయర్ సురేష్‌బాబు
రాయచోటి: కూటమి నేతల హామీలకు ష్యూరిటీ లేదని..మోసాలే గ్యారెంటీ అని రాజంపేట పార్లమెంట్ పరిశీలకుడు, కడప మేయర్ కె.సురేష్‌బాబు పేర్కొన్నారు. శుక్రవారం రాయచోటిలోని వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో నియోజకవర్గ ఇన్‌చార్జి గడికోట శ్రీకాంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో జిల్లా నాయకులతో కలిసి కె.సురేష్‌బాబు పాల్గొన్నారు. అమలు చేయలేని హామీలను గుప్పించి ప్రజలను మోసగించి ఎన్నికల్లో గెలుపొందిన ఈ ప్రభుత్వం మెడలు వంచుదాం..హామీలు, సంక్షేమ పథకాలను అమలు చేయిద్దామన్నారు. ఈ క్రమంలోనే వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు బాబు ష్యూరిటీ, మోసం గ్యారంటీని ఇంటింటా ప్రచారం చేయాలని పార్టీ నాయకులు, కార్యకర్తలను కోరారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో రాక్షస పాలన సాగిస్తోందన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మేనిఫెస్టోను ఖురాన్, భగవద్గీత, బైబిల్‌లా భావించి హామీలు అమలు చేశారన్నారు. చంద్రబాబు సాధ్యం కాని హామీలతో ప్రజలను మభ్య పెట్టారన్నారు. ఇదే విషయాన్ని ఇంటింటికెళ్లి చంద్రబాబు మోసాలను వివరించాలని.. జగన్ హయాంలో ఏ విధంగా పథకాలు అందాయో తెలియజేయాలని పార్టీశ్రేణులను సురేష్‌బాబు కోరారు. వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ, మండల నాయకులు, కార్యవర్గ సభ్యులు, అనుబంధాల విభాగాల నాయకులు, పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు.
● ప్రజల్లోకి కూటమి ప్రభుత్వ మోసాలను తీసుకెళ్దామని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. ఓట్లు వేయించుకుని అవసరం తీరాక హామీలను గాలికి వదిలేశారని విరుచుకుపడ్డారు. రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కింద పెట్టుబడి సాయం ఇంతవరకూ అందలేదన్నారు. బీసీలకు 50 ఏళ్లకే పింఛన్ అందిస్తామని చెప్పి ఇవ్వకుండా మోసం చేశారన్నారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేయకుండా, ఉద్యోగాలు కల్పించకుండా, నిరుద్యోగభృతి చెల్లించకుండా యువతను దగా చేశారన్నారు. 18 ఏళ్లు నిండి 59 ఏళ్ల వయస్సు వరకు మహిళలకు నెలకు రూ.1500 ఇస్తామని ఏడాది దాటినా ఆ ఊసే ఎత్తడం లేదన్నారు. చంద్రబాబు ఎన్నికల హామీలను క్యూఆర్ కోడ్ ద్వారా ప్రజలకు వివరించి, ఏవిధంగా మోసం చేశారో ప్రజలను చైతన్యవంతులను చేయాలని పార్టీ శ్రేణులకు శ్రీకాంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.ఈ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి, ఒక బటన్ నొక్కితే చంద్రబాబునాయుడు మేనిఫెస్టో వివరాలు. మరో బటన్ నొక్కితే కూటమి వాగ్ధానాలు నెరవేరక పోవడం వల్ల ఒక్కో కుటుంబం ఎంత నష్టపోయిందో లెక్కలు.. వివరాలు.. చూపిస్తాయని శ్రీకాంత్‌రెడ్డి వివరించారు.
● ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గాంధీ, అంబేడ్కర్ లాంటి మహానేతలతో తనను పోల్చుకుంటూ నేడు బాబా అవతారంలో ప్రజలను మోసగించడానికి ముందుకు వచ్చారని హిందూపురం పార్లమెంట్ పరిశీలకులు ఆర్.రమేష్‌కుమార్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. లోకేష్ యువగళం పేరుతో యువతకు 20 లక్షల ఉద్యోగాలు అని చెప్పి మోసం చేశారన్నారు. ఇప్పుడు చంద్రబాబు కొత్తగా దొంగ బాబా అవతారం ఎత్తాడని.. ఆయనే చంద్రబాబా అంట.. అని ఎద్దేవా చేశారు. మహాత్మాగాంధీ, అంబేడ్కర్‌లాగా తాను కూడా పేద ఇండ్లలో నివాసం ఉన్నట్లు చంద్రబాబు ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మహాత్మాగాంధీకి అంబేడ్కర్‌లకు 70 వేల కోట్ల రూపాయల వ్యాపారసంస్థలు ఉన్నాయా.. వారి బిడ్డలు మంత్రులు అయ్యారా అని ప్రశ్నించారు.. రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో దోపిడీ జరుగుతోందని, పీ4 కాదు ఏ4 నడుస్తోందని తెలిపారు. రౌడీలకు, గూండాలకు టికెట్లు ఇచ్చాడని, వారు పెట్టుబడి పెట్టామని చెబుతూ దోపిడీలకు పాల్పడుతున్నారన్నారు. లక్కిరెడ్డిపల్లెలో 19 మంది వైఎస్సార్‌సీపీ నేతలపై దర్యాప్తు చేయకుండానే పోలీసులు అక్రమ కేసులు పెట్టారన్నారు. బాంబులు తయారుచేసే చట్టాన్ని ప్రయోగించారన్నారు. న్యాయవ్యవస్థపై నమ్మకంతో ప్రజలు బతుకుతున్నారన్నారు. రాష్ట్రంలో 40 శాతం ఓట్లు వేసిన వైఎస్సార్‌సీపీ వారికి సంక్షేమాలు ఇవ్వనంటున్నాడని, సంక్షేమ పథకాలు ఆపితే చంద్రబాబు చెప్పినట్లుగా కాలర్ పట్టుకుని నిలదీస్తామన్నారు. సంవత్సరానికి ఒక్కొక్క కుటుంబానికి లక్ష రూపాయలు మేలు చేస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌లు బాండ్లు ఇచ్చారని, వైఎస్‌ఆర్‌సీపీ అధికారంలో ఉన్నపుడు ఎవరూ రోడ్లపైకి వచ్చింది లేదన్నారు. కూటమి పాలనలో ఏడాదిలోనే ప్రతి ఒక్కరూ రోడ్డు ఎక్కారని రమేష్‌కుమార్‌రెడ్డి విమర్శించారు.
● కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలు అధికారంలోకి వచ్చాక గాలిలో కలిసిపోయాయని జిల్లా పరిషత్ మాజీ చైర్మన్, వైఎస్సార్‌సీసీ నేత సుగవాసి బాలసుబ్రమణ్యం ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వంపై ఆయన నిప్పులు చెరిగారు. అవినీతి, అరాచకం, అక్రమ వసూళ్లు, తోపుడు బండ్ల నుంచి బడా వ్యాపారసంస్థల వరకు జరుగుతున్నాయని వివరించారు. ప్రతి మండలానికి గ్రామానికి, ప్రతి గడపకు వెళ్లి కూటమి ప్రభుత్వం వైఫల్యాలను ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. నాయకులు, కార్యకర్తలు కలిసి పార్టీని బలపరచాలని కోరారు.
● సమావేశంలో జెడ్పీ మాజీ చైర్మన్ దేవనాథరెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఫయాజ్‌బాషా, నియోజకవర్గంలోని అన్ని మండలాల పార్టీ కన్వీనర్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు మాట్లాడారు. తొలుత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమాన్ని పూర్తి ఉత్సాహంతో, క్రమశిక్షణతో నిర్వహించి రాయచోటి నియోజకవర్గాన్ని ఆదర్శంగా నిలపాలని నాయకులు కోరారు. ప్రజల్లో చైతన్యం నింపి టీడీపీ మోసాలపై స్పష్టతనిస్తూ జగన్ పాలనలో అమలైన సంక్షేమ పథకాలను వివరించాలని నేతలు సూచించారు. టీడీపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ కూటమి ప్రభుత్వం 2024 ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలు అమలులో విఫలమైందని ప్రజలకు తెలియజేయడమే ఈ కార్యక్రమం లక్ష్యమన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమ పోస్టర్లను ఆవిష్కరించారు.
ఎన్నికల హామీల అమలులో ప్రభుత్వం విఫలం: ఆకేపాటి
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలుచేయడంలో కూటమి ప్రభుత్వం విఫలం చెందిందని పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి విమర్శించారు. ప్రభుత్వం ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా ప్రజల పక్షాన పోరాటం చేయాల్సిన అవసరం ఆసన్నమైందని ఆయన పిలుపునిచ్చారు. 15 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన చంద్రబాబుకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియనిది కాదన్నారు. ప్రజలను మోసం చేయడం, వెన్నుపోటు పొడవడం ఆయనకు తెలిసిన విద్య అని విమర్శించారు. జగన్‌మోహన్‌రెడ్డి రోడ్డుపైకి వస్తేనే చంద్రబాబుకు వణుకు పుడుతోందన్నారు. నేడు రైతులు ఇబ్బందులు పడుతున్నా చంద్రబాబుకు కనికరం లేదన్నారు.

హామీలు అమలు చేయిద్దాం