
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
వీరబల్లి : మండలంలోని వంగిమళ్ల పంచాయతీ పర్వతయ్యగారిపల్లికి చెందిన పెద్దిరెడ్డి సుబ్బారెడ్డి (70) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మంగళవారం ఉదయం సుబ్బారెడ్డి ఊరిబయట రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న తన సొంత మామిడి తోటలోకి వెళ్లాడు. ఎంతసేపటికీ తిరిగి ఇంటికి రాకపోవడంతో మంగళవారం సాయంత్రం కుటుంబ సభ్యులు, బంధువులు తోట వద్దకు వెళ్లి చూడగా మోటార్ స్టార్టర్ వద్ద రక్తపు మడుగులో మృతి చెంది ఉన్నాడు. వారు మృతదేహ్నాని ఇంటికి తీసుకువచ్చారు. బుధవారం విషయం తెలుసుకున్న స్థానిక ఎస్‌ఐ నరసింహారెడ్డి, రూరల్ సీఐ వరప్రసాద్‌లు తమ సిబ్బందితో వెళ్లి సుబ్బారెడ్డి మృతదేహాన్ని పరిశీలించారు. పలు అనుమానాలు వ్యక్తం కావడంతో సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులు, బంధువులను విచారించారు. విద్యుత్ తీగలు తగులుకొని మృతి చెందాడని కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడి తల, కాళ్లకు గాయాలు ఉండటంతో స్థానికులు కొందరు సుబ్బారెడ్డి మృతి పట్ల అనుమానాలు వ్యక్తం చేశారు. దీంతో రూరల్ సీఐ వరప్రసాద్ సిబ్బందితో మామిడి తోటలోకి వెళ్లి పరిశీలించారు. సుబ్బారెడ్డి దుస్తులు, పాదరక్షలకు ఉన్న రక్తపు మరకలను పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.