
మహిళ ఆత్మహత్య
రామాపురం (రాయచోటి జగదాంబసెంటర్) : రామాపురం మండలం కుమ్మరపల్లి పంచాయతీ మన్నేరువాండ్లపల్లెకు చెందిన మన్నేరు లత(38) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వారి వివరాల మేరకు.. మన్నేరువాండ్లపల్లెకు చెందిన వితంతువు మన్నేరు లతను అదే గ్రామానికి చెందిన ఏనుగుల శివ అనే వ్యక్తి గత కొంతకాలంగా తనను ప్రేమించాలని లేకపోతే తాను చనిపోతానని వేధిస్తున్నాడు. ఈ విషయం ఆమె కుటుంబ సభ్యులకు చెప్పుకోలేక ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. వెంటనే రాయచోటి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యుల సలహా మేరకు వేలూరు సీఎంసీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
గాయపడిన యువకుడి మృతి
కలికిరి : వాల్మీకిపురం మండల పరిధిలోని గండబోయనపల్లి సమీపం టోల్‌గేటు వద్ద మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడు వినేష్(27) తిరుపతిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కలికిరి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎల్లయ్య కుమారుడు వినేష్ ప్రమాదంలో మృతి చెందడంతో పలువురు ప్రముఖులు సర్పంచ్‌ను పరామర్శించారు. మృతదేహాన్ని బుధవారం సాయంత్రం స్వగ్రామం అంకెంవారిపల్లికి తరలించారు. గురువారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కాగా మృతునికి భార్య, రెండు నెలల కుమారుడు ఉన్నాడు. కుటుంబ సభ్యుల రోదనలు అందరిని కంట తడిపెట్టించాయి.
మహారాష్ట్రలో రోడ్డు ప్రమాదం
– ములకలచెరువు వాసి మృతి
ములకలచెరువు : మహారాష్ట్రలోని పూణే సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ములకలచెరువు వాసి మృతి చెందాడు. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం మేరకు.. ములకలచెరువు వినాయక్ నగర్‌లో ఉంటున్న పి.రమణకు నర్సరీ ఎరువుల ఫ్యాక్టరీ ఉంది. దీంతో పాటు మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల్లో వెజిటెబుల్ నర్సరీలు ఉన్నాయి. నర్సరీ పనుల మీద పి.రమణ తన సొంత బొలేరో వాహనంలో ఒంటరిగా మంగళవారం మహారాష్ట్రలోని గురిహత్నుర్ వెళ్తుండగా మార్గమధ్యంలో ఎదురుగా వస్తున్న బస్సు ఢీ కొంది. ఈ ప్రమాదంలో పి.రమణ(45) తీవ్ర గాయాలతో సంఘటన స్థలంలోనే మృత్యువాత పడ్డాడు. అక్కడి పోలీసులు కుటుంబ సభ్యులకు సమచారం అందించి, పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని బుధవారం అందించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అక్కడి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని ములకలచెరువు పోలీసులు వెల్లడించారు.
గండి టెండర్లు ..
కొన్నింటికే ఆమోదం
చక్రాయపేట : గండి వీరాంజనేయ స్వామి సన్నిధిలో శ్రావణమాస ఉత్సవాల ఏర్పాట్లకు సంబంధించి బుధవారం నిర్వహించిన టెండర్లలో అదికారులు కొన్నింటిని మాత్రం ఆమోదించి మరి కొన్నింటిని తిరస్కరించారు. ఉత్సవాలకు సంబంధించి ఫోటో, వీడియో కవరేజి, ప్రత్యేక భజంత్రీలు, స్వాగత ఆర్చీలకు సంబంధించిన టెండర్లకు ఆమోదం తెలిపినట్లు ఆలయ సహాయ కమిషనర్ వెంకటసుబ్బయ్య తెలిపారు. ప్రత్యేక పూల అలంకరణ, విద్యుద్దీపాలంకరణకు సంబంధించి ఎవరూ టెండర్లలో పాల్గొన లేదని ఆయన తెలిపారు. పందిళ్లు, బారికేడ్లకు సంబంధించి ఇద్దరు మాత్రమే వచ్చి ఒకే ధరను కోట్ చేయడంతో వాటిని తిరస్కరించామన్నారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కావలి కృష్ణతేజ, కడప దేవదాయ శాఖ సూపరింటెండెంట్ రమణమ్మ పాల్గొన్నారు.

మహిళ ఆత్మహత్య

మహిళ ఆత్మహత్య