
శభాష్.. పోలీస్..!
కురబలకోట : రాష్ట్రంలో సంచలనం కలిగించిన మండలంలోని చెన్నామర్రి వద్ద కర్ణాటక రాష్ట్రం బాగేపల్లెకు చెందిన ట్రావెలర్ టెంపోను సోమవారం ఉదయం ఢీకొట్టి వెళ్లిపోయిన కంటైనర్ మిస్టరీని గంటల వ్యవధిలోనే పోలీసులు ఛేదించారు. దీని వెనుక కఠోర శ్రమతో పాటు సకాలంలో అప్రమత్తమై వివిధ కోణాల్లో జల్లెడ పట్టి శోధించి సాధించారు. తిరుమల దైవ దర్శనానికి వెళ్లి స్వగ్రామానికి వెళుతున్న ట్రావెలర్ టెంపోను ఢీకొన్న సంఘటనలో మేఘర్స్ (16), చరణ్ (17), శ్రావణి (24) అక్కడికక్కడే విగత జీవులుగా మారిన విషయం తెలిసిందే. మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఢీకొట్టి వెళ్లిపోయిన కంటైనర్‌ను చైన్నెలో ఉండగా గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ముదివేడు స్టేషన్‌కు మంగళవారం తీసుకు వచ్చారు. ప్రమాదం సోమవారం ఉదయం ఆరు గంటల ప్రాంతంలో జరగ్గా వెంటనే పోలీసులు అలర్ట్ అయ్యారు. ముగ్గురి మృతికి కారణమై మరో పది మందికి తీవ్ర గాయాలు కావడానికి కారణమైన కంటైనర్ వెళ్లిపోవడాన్ని పోలీసు అధికారులు కూడా తీవ్రంగా పరిగణించారు. ప్రతిష్టాత్మకంగానే కాకుండా చాలెంజ్‌గా తీసుకున్నారు. అప్పటికప్పుడే దీన్ని కనిపెట్టడానికి జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు నేతృత్వంలో మదనపల్లె డీఎస్పీ మహేంద్ర పర్యవేక్షణలో రూరల్ సర్కిల్ సీఐ సత్యనారాయణ, ముదివేడు, నిమ్మనపల్లె ఎస్‌ఐలు దిలీప్‌కుమార్, తిప్పేస్వామి ఆధ్వర్యంలో మూడు టీమ్‌లు ఏర్పాటయ్యాయి. కదిరి నుండి చైన్నె వరకు హైవే పొడవునా 150 పైగా సీసీ కెమెరాలను ముమ్మరంగా తనిఖీ చేశారు. మార్గంలోని ఆరు టోల్‌గేట్లు, మరెన్నో చెక్‌పోస్టుల వద్ద సీసీ కెమెరాలను నిశితంగా పరిశీలించారు. కదిరి టోల్‌గేటు మీదుగా ప్రమాద సమయానికి ముందుగా మూడు కంటైనర్లు వచ్చినట్లు గుర్తించారు. వీటిలో ప్రమాదానికి కారణమైన కంటైనర్ కోసం జల్లెడ పట్టారు. ఎట్టకేలకు లభించిన ఆధారాలను బట్టి చైన్నెలో ఉన్నట్లు గుర్తించారు. అక్కడ కూడా వరుసగా మూడు కంటైనర్లు ఉండడంతో ప్రమాదానికి కారణమైన వాహనం కోసం మళ్లీ సందిగ్ధత ఏర్పడింది. ట్రావెలర్ టెంపోను ఢీకొట్టి ఉండడంతో ఓ కంటైనర్‌కు డ్రైవర్ వైపుగా గీతలు, రాసుకున్న ఆనవాళ్లు ఉండడంతో పసిగట్టారు. డ్రైవర్ హరిని అదుపులోకి తీసుకుని తమ స్టైల్‌లో విచారించారు. వెంటనే కంటైనర్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఓవర్ టేక్ చెయబోయి ప్రమాదవశాత్తు ఈ ప్రమాదానికి కారణమైనట్లు డ్రైవర్ హరి (42) చెబుతున్నట్లు సమాచారం. డ్రైవర్‌ది తమిళనాడులోని చెంగల్పట్టు. ప్రమాదంతో బాధితులు, పరిసర ప్రాంతాల వారు దాడి చేస్తారన్న భయంతో వాహనాన్ని ఆపకుండా వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఇతను తమిళనాడు నుండి కియోకార్లకు సంబంధించి ముడి సరుకులను అనంతపురం జిల్లాలోని కియో కార్ల తయారీ కేంద్రంలో అన్‌లోడ్ చేసి తిరుగు ప్రయాణంలో వస్తుండగా ఈ సంఘటన జరిగింది. ప్రమాదం జరిగిన మూడు గంటలలోనే కారణమైన కంటైనర్ ను గుర్తించడంతో పాటు దానిని స్వాధీనం చేసుకుని డ్రైవర్‌ను పట్టుకున్న పోలీసుల ప్రతిభను జిల్లా ఎస్పీ విద్యా సాగర్ నాయుడు అభినందించారు.
శోధించి..ఛేదించారు
చెన్నామర్రి ప్రమాద ఘటనలో మూడు గంటల్లోనే కంటైనర్ గుర్తింపు
కర్ణాటక వాసుల మృతి కేసులో
పోలీసుల అదుపులో డ్రైవర్
ప్రమాదం ఎలా జరిగింది.?
కురబలకోట : మండలంలోని చెన్నామర్రి వద్ద సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కర్ణాటక వాసులు మృతి చెందిన ఘటనను జిల్లా యంత్రాంగం తీవ్రంగా పరిగణిస్తోంది. ముగ్గురి ప్రాణాలు కోల్పోయి మరో పది మంది తీవ్రంగా గాయపడ్డ ఘటన జరిగిన ప్రదేశాన్ని మంగళవారం త్రిసభ్య కమిటీ జాయింట్ ఇన్‌స్పెక్షన్ నిర్వహించింది. రూరల్ సర్కిల్ సీఐ సత్యనారాయణ, హైవే డీఈ శివరాం, ఎంవీఐ శివలింగయ్య, ముదివేడు ఎస్‌ఐ దిలీప్‌కుమార్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కారణాలను అధ్యయనం చేశారు. అధిక వేగం, డ్రైవర్లు అప్రమత్తంగా లేకపోండం, నిర్లక్ష్య ధోరణి, సిగ్నల్ లోపం తదితర వాటిని ప్రధాన కారణాలుగా భావించారు. వేగ నియంత్రణకు స్పీడు బ్రేకర్లు వేయాలని నిర్ధారించారు. అదే విధంగా ప్రమాదకర మలుపుల వద్ద సిగ్నల్స్, హెచ్చరిక బోర్డుల ఏర్పాటుతో పాటు మరిన్ని చర్యలు తీసుకోవడానికి సంకల్పించారు. మండల కేంద్రం కురబలకోటకు వెళ్లే జంగావారిపల్లె హైవే క్రాస్ వద్ద స్పీడు బ్రేకర్లు వేయాల్సిన అవసరం ఉందని ఆ మార్గంలో నిత్యం రాకపోకలు సాగించేవారు ఈ సందర్భంగా అధికారుల దృష్టికి తీసుకు వచ్చారు.
కర్ణాటక వాసుల మృతి ఘటనపై
త్రిసభ్య కమిటీ పరిశీలన

శభాష్.. పోలీస్..!