
పచ్చ పత్రిక కథనం బూటకం
పెద్దతిప్పసముద్రం : తంబళ్లపల్లిలో అదే తాలిబన్ల రాజ్యం అంటూ ఓ పచ్చ పత్రికలో ప్రచురితమైన వార్తపై బాధిత గ్రామస్తులు స్పందించారు. ఇదంతా బూటకపు కథనమని వారు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా మండలంలోని పులికల్లు పంచాయతీ చిన్న వెంకట్రమణగారిపల్లి (సీవీ పల్లి)కి చెందిన ముస్తాని చిన్నప్ప, ముస్తాని జయరాం కుటుంబీకులు మంగళవారం మాట్లాడుతూ ప్రశాంతంగా ఉన్న పల్లెలో కొంత మంది టీడీపీ నాయకులు తమ దాయాదుల నడుమ చిచ్చు పెడుతూ గొడవలకు ప్రేరేపిస్తున్నారన్నారు. 20 ఏళ్ల క్రితమే ప్రజల సౌకర్యం కోసం రోడ్డుకు స్థలాన్ని కేటాయించారన్నారు. గ్రామస్తుల విన్నపం మేరకు తంబళ్లపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్‌రెడ్డి సిమెంటు రోడ్డు కూడా గతంలోనే వేయించారన్నారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇదే గ్రామంలో ఉంటున్న ఓ టీడీపీ సానుభూతిపరుడు రోడ్డుకు అడ్డంగా ముళ్ల కంపలు వేశాడన్నారు. అప్పట్లో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ముళ్ల కంపలను తొలగించేసినా కూడా మళ్లీ అదే వ్యక్తి ప్రజల రాకపోకలకు అసౌకర్యాన్ని కల్పిస్తూ రోడ్డులో మూగజీవాలు, ద్విచక్ర వాహనాలతో అడ్డుకట్ట వేశాడని ఆరోపించారు. వ్యవసాయం చేసుకుని జీవిస్తున్న పల్లె ప్రజలపై దాయాదుల మధ్య చిచ్చు పెట్టి అగ్నికి ఆజ్యం పోసి ఒకరి కోసం 10 మందిని ఇబ్బందులకు గురి చేస్తూ ఉనికి కోసం రాజకీయ రంగు పులమడం టీడీపీ సానుభూతిపరులకు తగదని హితవు పలికారు. ఏడు కుటుంబాల ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న సదరు వ్యక్తి అసౌకర్యం కల్పించనని చెబితే రోడ్డులోని రాళ్లను తొలగించడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని బాధితులు స్పష్టం చేశారు.
అగ్నికి ఆజ్యం పోసింది
టీడీపీ సానుభూతిపరులే
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రోడ్డుకు అడ్డంగా ముళ్ల కంపలు
పోలీసుల చొరవతో కంపలు
తొలగించినా మళ్లీ రోడ్డులో
మూగజీవాలతో అడ్డు కట్ట

పచ్చ పత్రిక కథనం బూటకం