
పోలీసులకు అగంతకుడి పట్టివేత
పెద్దతిప్పసముద్రం : స్థానిక ప్రభుత్వాసుపత్రి ఎదురుగా ఉన్న ఓ పెట్రోల్ పంపులోకి గుర్తు తెలియని ఓ అగంతకుడు మంగళవారం వేకువ జాము జొరబడేందుకు ప్రయత్నించాడు. లోపల నిద్రిస్తున్న పెట్రోల్ పంప్ ఆపరేటర్లు కట్టెతో తచ్చాడుతున్న అగంతకుడిని గుర్తించి అప్రమత్తమై దుండగుడిని పట్టుకునేందుకు బయటకు వచ్చారు. తక్షణం దుండగుడు పక్కనే ఉన్న మరుగుదొడ్డి లోనికి వెళ్లి గడియ పెట్టుకున్నాడు. అనంతరం పెట్రోల్ పంప్ సిబ్బంది ఎస్‌ఐకు సమాచారం ఇవ్వగా పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని గుర్తుతెలియని అగంతకుడిని అదుపులోకి తీసుకున్నారు. మండలంలో ఇటీవల జరుగుతున్న వరుస చోరీల కారణంగా పోలీసులు రాత్రి వేళ గస్తీ నిర్వహిస్తూ అనుమానితుల కదలికలపై ప్రత్యేక నిఘా వేస్తున్నారు.
బైకుల దొంగ అరెస్టు
యశవంతపుర : అతని కన్ను పడితే ఎలాంటి బైక్ అయినా మాయం అవుతుంది. ఘరానా ద్విచక్ర వాహనాల దొంగను బెంగళూరు హెచ్‌ఏఎల్ పోలీసులు అరెస్ట్ చేసి రూ. 40 లక్షల విలువగల 32 బైక్‌లను సీజ్ చేశారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెకి చెందిన హేమంత్ (23) నిందితుడు. ఇటీవల విభూతిపురలో జరిగిన బైకు చోరీ కేసులో విచారించి మదనపల్లి మొయిన్‌రోడ్డులో నివాసం ఉంటున్న హేమంత్‌ను అరెస్ట్ చేశారు. హొసకోట, విజయపురలోనూ బైకులను చోరీ చేశాడు. 20 బైకులను మదనపల్లెలోని తన స్నేహితులకు అమ్మినట్లు పోలీసులు తెలిపారు. మిగిలిన బైకులను మదనపల్లె మెయిన్ రోడ్డులోని ఖాళీ జాగాలో దాచి ఉంచాడు. వాటిని స్వాధీనం చేసుకుని తరలించారు.
250 గ్రాముల
గంజాయి పట్టివేత
సింహాద్రిపురం : వాహనాల తనిఖీలో గంజాయి పట్టుకుని ముగ్గురిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌ఐ రవికుమార్ తెలిపారు. ఎస్‌ఐ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. సోమవారం పోలీసు సిబ్బందితో కలిసి ఆయన సింహాద్రిపురం – పార్నపల్లె రోడ్డులోని సాయిబాబా గుడి వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. వారిని తనిఖీ చేయగా 250 గ్రాముల గంజాయి దొరికింది. దీనిపై సింహాద్రిపురం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి ముగ్గురు వ్యక్తులను రిమాండ్‌కు తరలించారు.