చిత్తశుద్ధి లేని బాబు ఎన్ని హామీలైనా ఇస్తారు

Vidadala Rajini comments over chandrababu naidu  - Sakshi

2014లో చంద్రబాబు 600కు పైగా హామీలిచ్చారు

ఒక్కటైనా నెరవేర్చారా?

కాపీ కొట్టడం.. ఆల్‌ఫ్రీ అనడమే చంద్రబాబు మేనిఫెస్టో

బాబు హామీలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు

వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని  

సాక్షి, విశాఖపట్నం: కాపీ కొట్టడం.. ఆల్‌ ఫ్రీ అనడం.. ఇదే టీడీపీ నేత చంద్రబాబు మేనిఫెస్టో అని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని విమర్శించారు. చంద్రబాబు లాంటి చిత్తశుద్ధి లేని నాయకులు ప్రజలకు ఎన్ని హామీలైనా ఇస్తారన్నారు. 2014లో ఏకంగా 600కు పైగా హామీలిచ్చారని, అధికారంలోకి వచ్చాక ఒక్క హామీ అయినా నెరవేర్చారా? అని మంత్రి ప్రశ్నించారు.  శనివారం విశాఖలో మంత్రి రజిని మీడియాతో మాట్లాడారు.

చంద్రబాబు గత పాలనలో చేసిన మోసాన్ని ప్రజలు మర్చిపోలేదన్నారు. 2019లో తగిన విధంగా బుద్ధి చెప్పిన ప్రజలు.. ఈసారి టీడీపీని నామరూపాలు లేకుండా చేసేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. చంద్రబాబు పొరుగు రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీల మేనిఫెస్టోల నుంచి కొన్ని, ఇక్కడ సీఎం జగన్‌ అమలు చేస్తున్న పథకాల్లో నుంచి కొన్ని కాపీ కొట్టి.. వాటినే తాను ఇస్తానంటూ మాయ మాటలు చెబుతున్నారని దుయ్యబట్టారు.

చంద్రబాబు హామీలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే రాష్ట్రం దివాలా తీస్తోందని మొసలి కన్నీరు కార్చి­న చంద్రబాబు.. ఇప్పుడు తాను అధికారంలోకి వస్తే అవే పథకాలు ఇస్తానంటూ హామీలు ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచి్చన నాలుగేళ్లలోనే 99 శాతం హామీలు నెరవేర్చిన గొప్ప వ్యక్తి సీఎం జగన్‌ అని చెప్పారు.

ఇటీవల ప్రభుత్వ ఉద్యోగులకు మేలు చేస్తూ జీపీఎస్‌ ప్రవేశపెట్టారని, కాంట్రాక్ట్‌ ఉద్యోగులను క్రమబద్ధీకరించారని పేర్కొన్నారు. తమకు మేలు చేసే నాయకుడు వైఎస్‌ జగన్‌ మాత్రమేనని ప్రజలు భావిస్తున్నారని చెప్పారు. 2024లో గత ఎన్నికలకు మించిన విజయంతో సత్తా చాటుతామని ధీమా వ్యక్తం చేశారు. 

వైద్య, ఆరోగ్య శాఖకు ఏం చేశారో చెప్పాలి? 
అధికారంలో ఉన్నప్పుడు వైద్య, ఆరోగ్య శాఖ కోసం ఏం చేశారో చెప్పాలని చంద్రబాబుకు మంత్రి రజిని సవాల్‌ విసిరారు. టీడీపీ పాలనలో ప్రభుత్వాస్పత్రులను పూర్తిగా గాలికొదిలేశారని మండిపడ్డారు. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలో ప్రజల ఇళ్ల వద్దకే వెళ్లి వైద్యం చేసేందుకు.. ఫ్యామిలీ డాక్టర్‌ విధానాన్ని ప్రవేశపెట్టామన్నారు. కొత్తగా 17 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలను అందుబాటులోకి తెస్తున్నామని తెలిపారు.

తాజాగా గర్భిణులకు ఆరోగ్యశ్రీ కింద అల్ట్రాసౌండ్, టిఫా స్కానింగ్‌లు ఉచితంగా చేస్తున్నామని వెల్లడించారు. ఇలా.. అనేక విధాలుగా పేద రోగులకు అండగా నిలుస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు, మేయర్‌ హరి వెంకటకుమారి, ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, నెడ్‌ క్యాప్‌ చైర్మన్‌ కె.కె.రాజు, వీఎంఆర్‌డీఏ చైర్‌పర్సన్‌ ఎ.విజయనిర్మల తదితరులు పాల్గొన్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top