
పినకడిమి సర్పంచ్ సునీత భర్త శ్రీనివాసరావు
సాక్షి, టాస్క్‌ఫోర్స్: టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వల్ల తమకు ప్రాణహాని ఉందని ఏలూరు జిల్లా పెదవేగి మండలం పినకడిమి గ్రామ సర్పంచ్ సునీత భర్త పలగాని శ్రీనివాసరావు ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. తాము కాలువ పోరంబోకు ఐదెకరాలను ఐదేళ్లుగా సాగు చేసుకుంటున్నామని, తహసీల్దార్ పొజిషన్ సర్టీఫికెట్ కూడా ఇచ్చినట్టు తెలిపారు. శనివారం సాయంత్రం ఎమ్మెల్యే చింతమనేని, ఆయన గన్‌మేన్, మరో వ్యక్తి.. పొలంలోకి వచ్చి బూతులు తిడుతూ తీవ్రంగా కొట్టినట్టు చెప్పారు.
ఈ దాడిలో తన భార్య, సర్పంచ్ సునీత స్పృహ కోల్పోయిందన్నారు. తాను సాగు చేసుకుంటున్న భూమిని ఆక్రమించుకునే కుట్ర పన్నుతున్నారని చెప్పారు. సంఘటనా స్థలానికి వచ్చిన ఎస్‌ఐ, వీఆర్‌వోలను తనపై కేసు పెట్టాలంటూ ఒత్తిడి చేస్తూ వారినీ బూతులు తిట్టినట్టు తెలిపారు. తమ పొలంలోకి వచ్చి తమను కొట్టి తమపైనే కేసు పెట్టడం ఎంతవరకు న్యాయమంటూ కన్నీటిపర్యంతమయ్యారు. తమకు ప్రాణహాని ఉందని, తమకు ఏం జరిగినా ఎమ్మెల్యే చింతమనేనిదే బాధ్యతని స్పష్టం చేశారు.