అబద్ధాలకు హద్దేముంది? ‘ఈనాడు’కు సిగ్గేముంది?

Ramoji Rao Eenadu Fake News On Grain purchases - Sakshi

బాబు భరోసా కేంద్రం..‘ఈనాడు’

ధాన్యం కొనుగోళ్లపై పనిగట్టుకుని విషప్రచారం

ఆర్బీకే వ్యవస్థ భరోసా ఇవ్వటం లేదంటూ దుర్మార్గపు రాతలు 

రైతులంటూ అసలు పొలమే లేని కూలీల ఫొటోలు 

వారు చెప్పనివి కూడా వారి పేరిట రాసేసిన దిగజారుడు పాత్రికేయం 

బాబు ఐదేళ్లలో సేకరించిన ధాన్యానికి సమానంగా.. ఈ మూడేళ్లలోనే చెల్లింపులు 

రైతుకు, ప్రభుత్వానికి మధ్య దళారుల్ని తొలగించడానికే ఆర్బీకే వ్యవస్థ 

అందుకే పొరుగు రాష్ట్రాలతో పాటు అంతర్జాతీయంగానూ ఖ్యాతి 

అబద్ధాలకు హద్దేముంది? ‘ఈనాడు’కు సిగ్గేముంది? పతాక శీర్షికల్లో చెప్పినంత మాత్రాన అబద్ధం నిజమైపోతుందా? మీరేం రాస్తే అది నిజమైపోవటానికి ఇవి వైస్రాయ్‌ రోజులనుకున్నారా రామోజీరావు గారూ? కూలీల ఫొటోలు తీసి వారు రైతులంటూ.. దోపిడీకి గురయ్యారంటూ దుర్మార్గపు రాతలు రాస్తే ఎలా? వారి చేతికందిన సొమ్మును కూడా అందలేదని రాస్తే ఎలా? ఏది నిజమో... ఏది మీ నైజమో చెప్పటానికి మరో మీడియా లేదనుకున్నారా? ఫోటోలతో సహా మీరు వేసిన అబద్ధాలను... వీడియోలతో సహా వివరించడానికి ‘సాక్షి’ ఉందిక్కడ. మీ ‘బాబు’ కోసం జనం మెదళ్లలో ప్రభుత్వంపై విద్వేష భావాలు నాటడానికి ఈ వయసులో కూడా ఇన్ని కాకిలెక్కలు మీకు అవసరమా? కనీసం ఇన్నాళ్లు మీ పత్రికను నమ్మిన జనం కోసమైనా నిజాలు చెప్పరా?

ఆంధ్రప్రదేశ్‌లోని రైతు భరోసా కేంద్రాలకు పొరుగు రాష్ట్రాలే కాదు.. కేంద్రంతో పాటు అంతర్జాతీయ సమాజమూ సలాం కొడుతోంది. ‘విత్తు నుంచి విక్రయం వరకూ’ అనే నినాదంతో ఊరూరా రైతన్నకు భరోసాగా నిలుస్తున్న ఈ కేంద్రాలు రాష్ట్ర వ్యవసాయ రంగాన్ని కొత్త దారిలో నడిపిస్తున్నాయి. అందుకే రామోజీ పథకం ప్రకారం గురువారం ‘ఈనాడు’ పతాక శీర్షికలో ‘ధాన్యంలో దోపిడీ’ అంటూ వీలైనన్ని అబద్ధాలు పోగేశారు. రైతు భరోసా కేంద్రాల్లో అన్నదాతకు భరోసాయే దక్కటం లేదంటూ మొత్తం వ్యవస్థపైనే విషం గక్కారు. 

విశేషమేంటంటే చంద్రబాబు హయాంలో రైతు భరోసా కేంద్రాల మాట అటుంచి.. రైతుకు భరోసాయే లేదు. ధాన్యం సేకరించాలంటూ రైతులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తే అప్పుడు కొనుగోళ్లకు ఉపక్రమించిన చరిత్ర బాబుది. ఆయన ఐదేళ్ల పాలనలో 2.81 కోట్ల టన్నుల ధాన్యాన్ని మాత్రమే సేకరించగా.. ఇందుకు రూ.43,134 కోట్లు అయితే, ఇందులోనుంచి రూ.4,838 కోట్లను ఎన్నికల్లో గెలుపుకోసం పసుపు కుంకుమకు మళ్లించారు. తర్వాత వచ్చిన సీఎం జగన్‌ ఆ బకాయిలనూ తీర్చి రైతులను గట్టెక్కించారు. అంతేకాదు.. జగన్‌ ఈ మూడేళ్లలోనే 2.33 కోట్ల టన్నుల ధాన్యాన్ని సేకరించి, ఏకంగా 43,549 కోట్లు చెల్లించారు.

రామోజీది ఎంత నిఖార్సయిన జర్నలిజం అంటే.. బాబు ఏమిచేసినా ఆయనకు తప్పు అనిపించదు. ఇప్పుడు ప్రతిదీ తప్పుగానే కనిపిస్తుంది. నిజాలు ఎప్పుడూ చెప్పరు!!. అప్పట్లో సేకరించలేదనికానీ... ఇప్పుడు సేకరిస్తున్న విషయాన్ని కానీ నిజాయితీగా అంగీకరించరు. ఈ ఏడాది ఇప్పటికే ప్రభుత్వం 6.68 లక్షల రైతులకి చెందిన 52.54 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించిందంటే రైతులకు ఎంత దన్నుగా నిలుస్తున్నదో అర్థమవుతుంది. 

ఆర్బీకే అంటేనే... భరోసా
పంట విక్రయానికి సంబంధించి పూర్తి పారదర్శకత ఉండాలన్నదే ఆర్బీకేల లక్ష్యం. కేంద్రం ప్రకటించిన కనీస మద్దతు ధరకు రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ నేరుగా కొనుగోలు చేయడానికే ఈ ఏర్పాటు. ఆర్బీకేల ద్వారా మద్దతు ధరకు అమ్మాలనుకున్న రైతులు తొలుత వారి పంట, బ్యాంకు ఖాతా వివరాలను ఈ–క్రాప్‌ పోర్టల్‌లో నమోదు చేసుకోవటం తప్పనిసరి. దీన్నిబట్టే ఆర్బీకేలు సేకరణ మొదలెడతాయి. ఇక రైతుల ఖాతాల్లోకి నేరుగా ఆన్‌లైన్‌లో నగదు చేరిపోతుంది.

16నే మేకా సూర్యనారాయణకు హమాలీ చార్జీని చెల్లించిన చెక్కు   

ఈ మేరకు వీలు కల్పించే ధాన్యం సేకరణ పోర్టల్‌ను ఎలాంటి ఇబ్బందులూ లేకుండా టీసీఎస్‌ సంస్థ నిర్వహిస్తోంది. ఈ–క్రాప్‌లో నమోదు చేసుకోకున్నా... కౌలు రైతు కార్డు లేకున్నా అలాంటి వారు ఒకరో ఇద్దరో ఇబ్బంది పడొచ్చు. కానీ దాన్ని సార్వత్రికం చేస్తూ... యావత్తు రైతాంగం దోపిడీకి గురయిపోతున్నారని రామోజీ ఆక్రోశించటమే దుష్ప్రచార యుద్ధంలో కీలక ఘట్టం. 

ఆర్బీకేల ద్వారా సమీకరించేందుకు అవసరమైన గోనె సంచులను ప్రభుత్వమే సరఫరా చేయటంతో పాటు... హమాలీ చార్జీలనూ అందజేస్తోంది. అందరి ఖాతాల్లోనూ ఈ సొమ్ము పడుతున్నా... ఎవ్వరికీ దీని గురించి తెలియదన్నట్లుగా రాయటమే చిత్రాతిచిత్రం. 

నాణ్యమైన బియ్యం కోసం..
బాబు హయాంలో సేకరించటమే అరకొరయితే... అలా సేకరించిన దాన్లో ముక్కిపోయిన, నూకలుగా మారిపోయిన బియ్యాన్ని మాత్రమే రేషన్‌ డిపోలకు సరఫరా చేసేవారు. అప్పట్లో రేషన్‌ బియ్యం తినేవారు అతితక్కువ. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేకుండా నాణ్యమైన బియ్యాన్ని సరఫరా చేయటానికి ముఖ్యమంత్రి అన్ని చర్యలూ తీసుకోవటంతో... దీనికి అవసరమైన సార్టెక్స్‌ రైస్‌ను మిల్లింగ్‌ చేయడానికి రైస్‌ మిల్లులకు అదనంగా క్వింటాలుకు రూ.110 చొప్పున చెల్లించాల్సి వస్తోంది.

ఫోర్టిఫైడ్‌ బ్లెండింగ్‌ కోసమూ అదనపు మిల్లింగ్‌ చార్జీలు చెల్లిస్తున్నారు. అందుకే నాణ్యమైన బియ్యం రేషన్‌ కార్డు దారులకు చేరుతోంది. వారంతా తమ ఇళ్లలో వీటిని వాడుతున్నారు. కాకపోతే ఈ నిజాలేవీ ‘ఈనాడు’ రాయదు. రైతు కూలీల్ని ఫోటోలు తీసి... రైతులంటూ అబద్ధపు రాతలు మాత్రం రాస్తుంది. ఎందుకంటే రామోజీ లక్ష్యం... అడ్డూ అదుపూ లేని దుష్ప్రచారం మరి!!. 

రామోజీ రాసిన ఈ రైతుల సంగతి చూస్తే... ఇన్నాళ్లూ అబద్ధాలను ‘ఈనాడు’ ఎంత అందంగా అచ్చేసిందో అర్థమవుతుంది. ఒక్కో రైతు కథనూ చూస్తే...

‘ఈనాడు’ రాతల ప్రకారం రామచంద్రపురం మండలం కొత్తూరు గ్రామానికి  చెందిన ఉండవల్లి వీరభద్రరావు నాలుగెకరాల్లో వరి వేశారు. షావుకారులే కొంటున్నారని, బస్తాకు రూ.1,380 ఇస్తామన్నారని, అంతకన్నా ఎక్కువ జమయితే తెచ్చి కమీషన్‌ దారుకు ఇవ్వాలన్నారని ఆయన చెప్పినట్లు రాశేశారు. పోయిన పంటకూ ఇలాగే చేసారని, హమాలీ, రవాణా చార్జీలు ఇస్తారనే విషయం తమకు తెలియదన్నట్లు కూడా రాశారు.

కానీ నిజమేంటో తెలుసా?
ఉండవల్లి వీరభద్ర రావు పేరిట పొలం లేదు. ఆయన భార్య ఉండవల్లి పద్మావతి పేరిట పొలం ఉండటంతో అమ్మిన ధాన్యం సొమ్ము ఈ ఏడాది జనవరి 3న  NPCI ద్వారా నేరుగా రైతు ఖాతాలో (యూనియన్‌ బ్యాంక్‌ ) జమ అయింది. హమాలీ చార్జీల రూపేణా ఈ నెల 4న రూ.1,740 జమయింది. దీన్ని పద్మావతి స్వయంగా చెప్పారు. ఐదు నెలల కిందట సొమ్ము జమైనా... నెల కిందట హమాలీ చార్జీలు వచ్చినా... ఈ అబద్ధపు రాతలెందుకు? ఎవరిని నమ్మించడానికి? 

రామోజీ రాతల ప్రకారం రామచంద్రపురం మండలం కొత్తూరు గ్రామానికి  చెందిన మేకా వీర సూర్యనారాయణ 12 ఎకరాల్లో వచ్చిన ధాన్యం అమ్మారు. లిస్టులో పేరున్నా డబ్బులివ్వడం లేదు. అమ్మి 5 నెలలైనా ఇప్పటిదాకా హమాలీ చార్జీలు ఇవ్వలేదు. డీసీసీబీకి వెళ్లినా పనికాలేదు!!. 

ఆర్బీకే ఇచ్చిన రసీదు 

ఇక వాస్తవం చూద్దాం...
రైతు మేకా వీర సూర్యనారాయణ అమ్మిన ధాన్యము యొక్క హమాలీ చార్జీలు రూ.2,520 ఈ నెల 16నే చెక్కు రూపంలో ఆయనకు అందాయి. ఇది ఆయనే అంగీకరించారు. కానీ.. రామోజీ తనకు తోచినట్లు రాసేశారు.

‘ఈనాడు’ కథనం మేరకు... రాయవరం మండలం నదురుబాద గ్రామానికి  చెందిన కొండపల్లి వెంకట సత్యనారాయణ అనే రైతు ఐదున్నర ఎకరాల్లో వరి వేశారు. బస్తా రూ.1,380కి అమ్మారు. తామే మిల్లుకు తీసుకెళితే బస్తాకు రూ.1,455 ఇస్తారన్నారని, లేకుంటే రూ.1,380 ఇస్తామన్నారని, ధాన్యాన్ని మిల్లుకు తీసుకెళ్లాక నెమ్ము చేరిందన్నారని, ఎంత తరుగు తీసేస్తారో తెలియడం లేదని ఆయన వాపోయినట్లు రాసిపారేశారు. 

కానీ వాస్తవమేంటో తెలుసా?
కొండపల్లి వెంకట సత్యనారాయణ కౌలు రైతు అని ‘ఈనాడు’ రాసింది తప్ప... ఆయన ఎక్కడ కౌలు రైతుగా నమోదు చేసుకున్నారో రాయలేదు. ఆయన కూడా... తానెక్కడా నమోదు చేసుకోలేదని, తనకు సీసీఆర్‌సీ కార్డు కూడా లేదని స్పష్టం చేశారు. మరి ఈ–క్రాప్‌లో నమోదు కాకుండా ఆ పంటనెలా కొంటారు? సీసీఆర్‌సీ కార్డు లేనిదే కౌలు రైతు ఎలా అవుతారు? రాసేముందు ఈ మాత్రం చూసుకోవద్దా రామోజీరావు గారూ?

ఇక రామోజీ రాతల్లో డొల్లెంతో చెప్పటానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. ప్రత్తిపాడు గ్రామంలో మన్యం గోపాలకృష్ణ ఐదెకరాల్లో వరి వేసారని, ఎకరాకు 30–35 బస్తాలొస్తుండగా 3 రోజులుగా ఎండబెడుతున్నారని రాశారు. రైతు భరోసా కేంద్రాలకు వెళ్తే ఈ తిప్పలు పడలేరు, కమీషన్‌.దారులకు ఇచ్చేయమన్నారని... మిల్లులకు తీసుకెళితే తేమ, నూక తేడా ఉంటే బస్తాకు రూ.200/– కోత పెడతామన్నారని, ఆర్బీకేల్లో సంచులు ఇవ్వడం లేదని ఆయన , చెప్పినట్లుగా రాసేశారు. అందుకే కమీషన్‌ దారులకు ధాన్యం ఇస్తున్నారని సూత్రీకరించారు. 

‘ఈనాడు’ రాయని నిజమేంటంటే మన్యం గోపాల కృష్ణ వ్యవసాయ కూలీ. తనకు పొలం లేదు. ఆయన పొలంలో ధాన్యం పట్టుబడి చేస్తుంటే ‘ఈనాడు’ బృందం వెళ్లి ఫోటో తీసుకుంది. పేపర్లో ఏం రాశారో తనకు తెలియదని, తానైతే వాళ్లతో ఏమీ చెప్పలేదని ఆయన వాపోయాడు. తమ గ్రామంలో రైతు భరోసా కేంద్రాల ద్వారానే మద్దతు ధరకు ధాన్యాన్ని కొంటున్నారని, సంచుల కొరత లేదని కూడా చెప్పాడు. 

ఈనాడు, ఆంధ్రజ్యోతి వక్రీకరిస్తున్నాయి.. 
జగన్‌ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టాక రైతుల కోసం రైతు భరోసా, సున్నా వడ్డీ రుణాలు, అధిక మద్దతు ధర, ఉచిత విద్యుత్, భూ రికార్డుల ప్రక్షాళన, కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్ల వంటి విప్లవాత్మక చర్యలు తీసుకున్నారు. ధాన్యం కొనుగోళ్లకు దేశంలోనే అతిపెద్ద వ్యవస్థను ఏర్పాటు చేశారు. అయితే క్షేత్ర స్థాయిలో కొన్ని చోట్ల రైసు మిలర్ల పాత్ర వల్ల రైతులు నష్టపోతున్నారని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశా.

కానీ ఈనాడు, ఆంధ్రజ్యోతిల్లో మొత్తం వ్యవస్థ తప్పుగా ఉందని నేనన్నట్లు వక్రీకరించి రాశారు. ఇది సరికాదు. నేను ఈ అంశాన్ని చెప్పిన వెంటనే వ్యవసాయ మంత్రి, పౌర సరఫరాల మంత్రులు నాతో మాట్లాడి దీనిపై విచారణ చేయిస్తామని చెప్పారు.     
– పిల్లి సుభాష్‌ చంద్రబోస్, ఎంపీ

నిజానికి రైతు భరోసా కేంద్రాలు ఎంత అండగా నిలుస్తున్నాయో ఏ ఊళ్లో ఏ రైతును కదిలించినా తెలుస్తుంది. అలాంటి కొందరు రైతుల అభిప్రాయాలివీ..

పంట నష్టం కూడా అందింది...
మాకు రామచంద్రపురం మండలం చోడవరంలో మూడెకరాల వరిపొలం ఉంది. ప్రతి సీజన్లో పంట నమోదు చేస్తున్నా. మూడేళ్లుగా రైతు భరోసా రూపంలో పెట్టుబడి సాయం అందుతోంది. తొలకరిలో అధిక వర్షాల వల్ల పంట నష్టపోయినా... ఆర్బీకేలోని గ్రామ వ్యవసాయ సహాయకుడు దాని వివరాలు నమోదు చేశారు. దీంతో ప్రభుత్వం నుంచి పరిహారం కూడా అందింది.

నేను పండించిన ధాన్యాన్ని మూడేళ్లుగా ఆర్బీకే ద్వారానే విక్రయిస్తున్నా. ఖరీఫ్‌లో క్వింటాలుకు రూ.1940 ధాన్యం సొమ్ము గతంలో 21 రోజులకు అందింది. హమాలీ ఖర్చులు క్వింటాలుకు రూ.25 చొప్పున చోడవరం సొసైటీ ద్వారా చెక్కు రూపంలో అందజేశారు. ఎరువుల కోసం తిప్పలు లేకుండా ఆర్బీకే నుంచే యూరియా, డీఏపీ అందాయి.            
    – గుణ్ణం రామకృష్ణ, రైతు, చోడవరం, కోనసీమ జిల్లా

తూకం.. లెక్కల్లో తేడాలు లేవు..
ఐదెకరాలు కౌలుకు తీసుకుని రబీ పంట సాగు చేశా. రెండెకరాల్లో కోత కోశా. 77 బస్తాల ధాన్యం వచ్చింది. ఆర్బీకేలో గురువారం విక్రయించాను. బస్తాకు రూ.1,455 చొప్పున 77 బస్తాలకు రూ.1,12,035 నగదు ఇస్తామని రసీదు ఇచ్చారు.

హమాలీ చార్జీలు క్వింటాలుకు రూ.25 ఇస్తున్నారు. తూకం, లెక్కల్లో తేడాల్లేవు. అదే ధాన్యాన్ని గ్రామంలోని దళారి వద్దకు తీసుకెళితే బస్తాకు రూ.1,300 ఇస్తానన్నాడు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే న్యాయం జరుగుతోంది. మిగిలిన మూడెకరాలూ కోత కోశాక ఆర్బీకేలోనే విక్రయిస్తా.     
– మొర్త అప్పారావు, కేశనకుర్రు గ్రామం, పెదలంక 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top