CM Jagan Lay Foundation Stone For The Assago Industrial Pvt Ltd Ethanol Plant in East Godavari - Sakshi
Sakshi News home page

అసాగో బయోఇథనాల్‌ ప్లాంట్‌కు సీఎం జగన్‌ భూమి పూజ

Nov 4 2022 11:04 AM | Updated on Nov 4 2022 5:47 PM

CM Jagan Lay Foundation Stone BioEthanol Plant Gokavaram East Godavari - Sakshi

సాక్షి, తూర్పుగోదావరి: గోకవరం మండలం గుమ్మళ్ళదొడ్డి వద్ద సుమారు రూ.270 కోట్లతో అసాగో ఇండస్ట్రీస్‌ ఏర్పాటు చేస్తున్న బయో ఇథనాల్‌ యూనిట్‌ నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో టెక్‌ మహీంద్ర సీఈఓ సీపీ గుర్నానీ, ఆశీష్‌.. మంత్రులు గుడివాడ అమర్ నాధ్,తానేటి వనిత, దాడిశెట్టి రాజా, వేణుగోపాలకృష్ణ, ఎంపీలు భరత్ రామ్ , అనురాధ,వంగా గీతా, ఎమ్మెల్యేలు జ్యోతుల చంటిబాబు పాల్గొన్నారు.

శంకుస్థాపన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగసభలో సీఎం జగన్‌ మాట్లాడుతూ.. 'దేవుడి దయతో ఈ రోజు మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈ ప్రాంతానికి మంచి చేసే ప్లాంట్‌ రాబోతోంది. రూ.270 కోట్లతో టెక్‌ మహీంద్రా గ్రూప్‌ ఇథనాల్‌ను ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తోంది. పరిశ్రముల నెలకొల్పేందుకు ఏపీ మంచి వాతావరణం ఉంది. కేవలం ఆరు నెలల కాలంలోనే అనుమతులు మంజూరు చేసి.. ఈ రోజు భూమి పూజ కూడా చేశాం.

2లక్షల లీటర్ల సామర్థ్యంతో ప్లాంట్‌ రాబోతుంది. ​ప్లాంట్‌ ఏర్పాటుతో స్థానికులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. బ్రోకెన్‌ రైస్‌తో ప్లాంట్‌లో ఇథనాల్‌ తయారీ చేస్తారు. ప్లాంట్‌తో పాటు బైప్రోడక్ట్‌ కింద పశువుల దాణా, చేపల మేతకు ఉపయోగపడే ప్రోటీన్‌ ఫీడ్‌ కూడా అందుబాటులోకి వస్తుంది. రంగు మారిన ధాన్యానికి కూడా మంచి ధర లభిస్తుంది' అని సీఎం జగన్‌ అన్నారు.

కాగా, రాజమహేంద్రవరానికి సమీపంలోని ఏపీఐఐసీ ఇండస్ట్రియల్‌ పార్క్‌లో 20 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న ఈ గ్రీన్‌ఫీల్డ్‌ యూనిట్‌ ద్వారా రోజుకు 200 కిలోలీటర్ల బయో ఇథనాల్‌ ఉత్పత్తి అవుతుంది. ఈ యూనిట్‌ ద్వారా ప్రత్యక్షంగా 100 మందికి, పరోక్షంగా 400 మందికి ఉపాధి లభించనుంది. ముడిచమురు దిగుమతుల బిల్లును తగ్గించుకోవడంతోపాటు హరిత ఇంధన వినియోగం పెంచడం ద్వారా కర్బన ఉద్గారాలను తగ్గించాలన్న లక్ష్యంగా 2025–26 నాటికి ప్రతి లీటరు పెట్రోల్‌లో 20 శాతం బయో ఇథనాల్‌ మిశ్రమం కలపడాన్ని తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.

ప్రస్తుతం లీటరు పెట్రోల్‌లో ఇథనాల్‌ మిశ్రమం సగటున 8.41 శాతంగా ఉంది. కోటిలీటర్ల ఇథనాల్‌ను వినియోగించడం ద్వారా 20 వేల టన్నుల కర్బన ఉద్గారాలు తగ్గుతున్నట్లు అనేక పరిశీలనల్లో వెల్లడైంది. ఒక్కసారిగా కేంద్ర ప్రభుత్వం భారీ లక్ష్యాలను నిర్దేశించడంతో అనేక సంస్థలు ఈ రంగంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నాయి.

భూ కేటాయింపుల దగ్గర నుంచి అన్ని అనుమతులు త్వరితగతిన మంజూరు చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపిందని, ఈ పెట్టుబడుల ద్వారా హరిత పునరుత్పాదక ఇంధన రంగంలో అగ్రగామిగా ఆంధ్రప్రదేశ్‌ నిలుస్తుందని అస్సాగో ఇండస్ట్రీస్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఆశీష్‌ గుర్నానీ తెలిపారు. భవిష్యత్‌లో ప్రత్యామ్నాయ ఇంధన కేంద్రంగా ఆంధ్రప్రదేశ్‌ నిలుస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ యూనిట్‌ ద్వారా 500 మందికి ఉపాధి లభించడమే కాకుండా వ్యవసాయ ఆధారిత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌ రైతులకు అదనపు ప్రయోజనం లభిస్తుందని చెప్పారు. పాడైపోయిన ఆహారధాన్యాలు, నూకలు, వ్యవసాయ ఉత్పత్తుల అవశేషాలు వినియోగించి ఇథనాల్‌ను తయారు చేయడం ద్వారా రైతులకు ఆర్థికంగా ప్రయోజనం చేకూరుతుందన్నారు. 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement